ఫైనల్లో ఇండియా..ఇవాళ పాకిస్తాన్‌‌తో టైటిల్ ఫైట్‌‌

ఫైనల్లో ఇండియా..ఇవాళ పాకిస్తాన్‌‌తో టైటిల్ ఫైట్‌‌

ఒమన్‌‌ : మెన్స్‌‌ జూనియర్‌‌ ఆసియా కప్‌‌లో ఇండియా కుర్రాళ్లు ఫైనల్లోకి దూసుకెళ్లారు. మంగళవారం జరిగిన సెమీస్‌‌లో ఇండియా 3–1తో మలేసియాపై నెగ్గింది. ఇండియా తరఫున దిల్రాజ్‌‌ సింగ్‌‌ (10వ ని), రోహిత్‌‌ (45వ ని), శారద నంద్‌‌ తివారీ (52వ ని) గోల్స్‌‌ చేయగా, అజీముద్దీన్‌‌ (57వ ని) మలేసియాకు ఏకైక గోల్‌‌ అందించాడు. ఆరంభం నుంచే వ్యూహాత్మకంగా ఆడిన ఇండియా ఫార్వర్డ్స్‌‌ కీలక టైమ్‌‌లో మలేసియా డిఫెన్స్‌‌ను ఛేదించారు. 

షార్ట్‌‌ పాస్‌‌లతో బాల్‌‌ను ఎక్కువసేపు ఆధీనంలో ఉంచుకున్నారు. మరోవైపు బాల్‌‌పై పట్టు కోసం మలేసియా చేసిన ఎదురుదాడులను ఇండియా డిఫెన్స్‌‌ అద్భుతంగా తిప్పికొట్టింది. రెండో హాఫ్‌‌లో మలేసియా అటాకింగ్‌‌ గేమ్‌‌ ఆడినా ఇండియన్‌‌ కుర్రాళ్ల మెరుపుల ముందు నిలవలేకపోయింది. 

మరో సెమీస్‌‌లో పాకిస్తాన్‌‌ 4–2తో జపాన్‌‌ను చిత్తు చేసింది. కెప్టెన్‌‌ షాహిద్‌‌ హన్నన్‌‌ (27, 48వ ని), అలీ బషారత్‌‌ (38వ ని), సుఫియాన్‌‌ ఖాన్‌‌ (52వ ని) పాక్‌‌కు గోల్స్‌‌ అందించారు. బుధవారం జరిగే ఫైనల్లో ఇండియా.. పాకిస్తాన్‌‌తో అమీతుమీ తేల్చుకోనుంది.