- ప్రాణనష్టంపై మోదీ సంతాపం
న్యూఢిల్లీ: కొండచరియలు విరిగిపడడంతో అతలాకుతలమైన పపువా న్యూగినియా దేశానికి భారత్ మిలియన్ డాలర్ల తక్షణ ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. ఈ నెల 24న పపువా న్యూగినియాలోని ఎంగా ప్రావిన్స్‌లో కొండచరియలు విరిగిపడి.. సమారు 2,000 మంది సజీవ సమాధి అయ్యారు. ఈ విషాదంపై ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం వ్యక్తం చేశారు.
అలాగే, కష్టకాలంలో ఉన్న ఆ దేశానికి సహాయం అందించడానికి భారత్ సిద్ధమని చెప్పారు. ఈ క్లిష్ట సమయంలో ఆ దేశ ప్రజలకు భారత్ సంఘీభావంగా నిలుస్తుందని విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు. 2018లో సంభవించిన భూకంపం, 2019, 2023లో అగ్నిపర్వతాలు విధ్వంసం సృష్టించిన సమయంలోనూ భారత్ పపువా న్యూగినియాకు అండగా నిలిచిందని విదేశాంగ శాఖ తెలిపింది.