Paris Olympics 2024: ముగిసిన ఒలిపింక్స్ పోటీలు.. పతకాల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే..?

Paris Olympics 2024: ముగిసిన ఒలిపింక్స్ పోటీలు.. పతకాల పట్టికలో భారత్ స్థానం ఎంతంటే..?

పారిస్‌ ఒలింపిక్స్‌లో అథ్లెట్ల పోరాటం ముగిసింది. చివరిదైన బాస్కెట్‌బాల్ ఫైనల్స్ పోటీల్లో అమెరికా మహిళలు.. ఫ్రాన్స్‌ను ఓడించి పతకాల పట్టికలో అగ్రస్థానంలో నిలిచారు. 40 స్వర్ణాలతో చైనా, అమెరికా దేశాలు సమంగా ఉన్నప్పటికీ, ఎక్కువ రజత పతకాల ఆధారంగా అమెరికన్లు టాప్‌లో నిలిచారు. ఈసారి విశ్వక్రీడల్లో వందకు పైగా ఒలింపిక్ పతకాలు సాధించిన ఏకైక దేశం.. అమెరికా(40 గోల్డ్+ 44 సిల్వర్+ 42 బ్రాంజ్= 126 పతకాలు) మాత్రమే.

ఈ ఒలింపిక్స్‌ క్రీడల్లో 91 పతకాలతో డ్రాగన్ దేశం చైనా(40 గోల్డ్) రెండో స్థానంలో ఉండగా.. జపాన్(20 గోల్డ్), ఆస్ట్రేలియా(18 గోల్డ్) మూడు, నాలుగు స్థానాల్లో నిలిచాయి. ఈ పతకాల పట్టికలో భారత్ 71వ స్థానంలో నిలిచింది. కాగా, ఒకే ఒక్క పతకం సాధించిన పాక్ మనకంటే, తొమ్మిది స్థానాలు ముందు నిలిచింది. జావెలిన్ విభాగంలో అర్షద్ నదీమ్ సాధించిన పసిడితో 62వ స్థానంలో నిలిచింది. 

117 అథ్లెట్లు.. 6 పతకాలు

ఈసారి విశ్వక్రీడల్లో భారత్‌ తరఫున 16 క్రీడాంశాల్లో 117 మంది పోటీపడగా.. కనీసం 10 నుంచి 15 పతకాలైనా వస్తాయని అభిమానులు ఆశించారు. కానీ, అభిమానుల ఆశలు ఫలించలేదు. ఊరించి ఊరించి చివరికి ఆరు పతకాలతో సరిపెట్టుకుంది మన దేశం. ఇందులో ఐదు కాంస్యాలు, ఒక రజత పతకం ఉన్నాయి. 

భారత​​​​​​ పతక విజేతలు

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు మొత్తం ఆరు పతకాలు సాధించగా, అందులో మూడు షూటింగ్‌లో వచ్చినవే. అయితే, అత్యుత్తమ మెడల్ రజతం.. పురుషుల జావెలిన్ విభాగంలో వచ్చింది. 

  • నీరజ్ చోప్రా: రజతం (పురుషుల జావెలిన్ త్రో ఈవెంట్) 
  • మను భాకర్: కాంస్యం (మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్)
  • మను భాకర్, సరబ్‌జోత్ సింగ్: కాంస్యం (10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్)
  • స్వప్నిల్ కుసాలె: కాంస్యం (పురుషుల 50 మీటర్ల రైఫిల్ 3 పొజిషన్స్ ఈవెంట్‌)
  • భారత హాకీ జట్టు: కాంస్యం
  • అమన్ సెహ్రావత్: కాంస్యం (పురుషుల 57 కేజీల ఫ్రీస్టైల్ రెజ్లింగ్ ఈవెంట్‌)

ఈ ఆరింటిని కలిపి ఇప్పటివరకు జరిగిన అన్ని ఒలింపిక్స్‌లో కలిపి భారత్ మొత్తం 41 పతకాలు సాధించింది.