
- నేడు శ్రీలంకతో ఇండియా మూడో వన్డే
- మ. 2.30 నుంచి సోనీలో లైవ్
కొలంబో: శ్రీలంక స్పిన్నర్లను ఎదుర్కోవడంలో ఘోరంగా తడబడుతున్న ఇండియా స్టార్ బ్యాటర్లు మూడో వన్డేపై దృష్టి పెట్టారు. బుధవారం జరిగే ఈ మ్యాచ్‌లో ఎలాగైనా గెలిచి సిరీస్‌ను సమం చేయాలని భావిస్తున్నారు. లేదంటే 27 ఏళ్ల తర్వాత లంక చేతిలో సిరీస్ కోల్పోయిన టీమ్‌గా చెత్త రికార్డును మూటగట్టుకోవాల్సి వస్తుంది. 1997లో చివరిసారి అర్జున రణతుంగ నేతృత్వంలోని లంకేయులు ఇండియాపై 3–0తో సిరీస్ గెలిచారు.
ఆ తర్వాత హోమ్ అండ్ అవే పద్ధతిలో జరిగిన 11 ద్వైపాక్షిక సిరీస్‌ల్లో ఇండియానే విజయకేతనం ఎగరవేసింది. కాబట్టి ఆ రికార్డును పదిలంగా ఉంచాలంటే ఈ మ్యాచ్‌లో గెలిచి సిరీస్‌ను డ్రా చేసుకోవాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని ఈ మ్యాచ్‌పై ఇండియా ఫుల్ ఫోకస్ చేస్తోంది. కెప్టెన్ రోహిత్ శర్మ బ్యాటింగ్‌లో దుమ్మురేపుతున్నా మిగతా సీనియర్లు కోహ్లీ, రాహుల్, శ్రేయస్ వైఫల్యం టీమ్‌ను వెంటాడుతోంది. శుభ్‌మన్ గిల్ ఫర్వాలేదనిపిస్తున్నా బ్యాటింగ్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే సత్తా చాటలేకపోతున్నాడు.
దీంతో ఈ మ్యాచ్ కోసం అతని ప్లేస్‌లో రియాన్ పరాగ్‌ను తీసుకునే చాన్స్ ఉంది. లోయర్ ఆర్డర్‌లో అక్షర్ పటేల్, సుందర్ మెరుస్తున్నా టీమ్‌ను గెలిపించలేకపోతున్నారు. ప్రధానంగా లంక స్పిన్నర్ వాండర్సేను ఎదుర్కోవడంపైనే ఇండియా బ్యాటర్లు ఎక్కువగా దృష్టి సారించారు. బౌలింగ్‌లో సిరాజ్, అర్ష్‌దీప్, కుల్దీప్‌ను కొనసాగించనున్నారు. మరోవైపు తొలి రెండు మ్యాచ్‌ల్లో సూపర్ షో చూపెట్టిన లంకేయులు ఇప్పుడు సిరీస్‌పై గురి పెట్టారు.