భారతీయులు ఆహారం తీసుకునే విధానం, భారతీయుల ఆహారపు అలవాట్లు అత్యంత ఉత్తమమైనవని వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్ (WWF) నివేదిక విడుదల చేసింది. ఆహార వినియోగంలో ప్రపంచ దేశాలు భారత్ను అనుసరిస్తే 2050 నాటికి పర్యావరణానికి కొంతైనా మేలు చేసినట్టవుతుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ లివింగ్ ప్లానెట్ రిపోర్ట్ అభిప్రాయపడింది. ఆహార వినియోగానికి సంబంధించిన గణాంకాల్లో ఆస్ట్రేలియా, అర్జెంటీనా, అగ్ర రాజ్యంగా చెప్పుకునే అమెరికా చిట్టచివరలో నిలిచాయి. ఈ దేశాలు తిన్నట్టుగా ఆహారం తింటే గ్లోబల్ వార్మింగ్ పరిధి దాటిపోతుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆందోళన వ్యక్తం చేసింది.
అంతేకాదు.. 2050 నాటికి ఇండియాలో మాదిరిగా ఆహారం వినియోగం జరిగితే ఇప్పటి కంటే కేవలం 0.8 శాతం ఎక్కువ భూభాగం మాత్రమే ఆహార ఉత్పత్తులు పండించడానికి అవసరం అవుతుందని డబ్ల్యూడబ్ల్యూఎఫ్ పేర్కొంది. ఇండోనేషియా కూడా ఆహారం వినియోగంలో భేష్ అనిపించుకుంది. ఇండోనేషియాలో తరహాలో అయితే 0.9 శాతం ఎక్కువ భూభాగం మాత్రమే అవసరం అవుతుందని నివేదికలో డబ్ల్యూడబ్ల్యూఎఫ్ వెల్లడించింది.
ఏ దేశంలా తింటే ఎంత ఎక్కువ భూభాగం అవసరం అవుతుందంటే..
- చైనా: 1.7 శాతం
- జపాన్: 1.8 శాతం
- అర్జెంటీనా: 7.4 శాతం
- ఆస్ట్రేలియా: 6.8 శాతం
- అమెరికా: 5.5 శాతం