
- నేడు కువైట్‌తో ఇండియా ఢీ
- కెరీర్‌కు వీడ్కోలు పలకనున్న లెజెండ్ సునీల్ ఛెత్రి
- రా. 7 నుంచి సోర్ట్స్18, జియో సినిమాలో లైవ్
కోల్‌కతా: ఇండియా ఫుట్‌బాల్ లెజెండ్, కెప్టెన్ సునీల్ ఛెత్రి తన19 ఏండ్ల ఇంటర్నేషనల్ కెరీర్‌కు వీడ్కోలు చెప్పడానికి రెడీ అయ్యాడు. గురువారం ఇక్కడి సాల్ట్ లేక్ స్టేడియంలో కువైట్‌తో జరిగే ఫిఫా వరల్డ్ కప్ క్వాలిఫయింగ్ రెండో రౌండ్ మ్యాచ్‌లో ఆఖరిసారి బరిలోకి దిగనున్నాడు. రెండు దశాబ్దాలుగా అద్భుత ఆటతో ఇండియన్ ఫుట్‌బాల్ ముఖచిత్రంగా మారిన 39 ఏండ్ల ఛెత్రి తన ఆఖరాటతో దేశాన్ని గెలిపించాలని చూస్తున్నాడు.
అతనికి విజయంతో వీడ్కోలు పలకాలని తోటి ఆటగాళ్లు కూడా కృతనిశ్చయంతో ఉన్నారు. ఛెత్రిని గ్రౌండ్‌లో చివరిసారి చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియానికి పోటెత్తే అవకాశం ఉంది. క్వాలిఫయంగ్ టోర్నీలో మూడో స్టేజ్ చేరేందుకు ఈ మ్యాచ్‌లో విజయం ఇండియాకు కీలకం కానుంది. తొమ్మిది గ్రూపుల్లోని టాప్2 టీమ్స్ మూడో స్టేజ్ చేరుకుంటాయి. ప్రస్తుతం గ్రూప్–ఎలో ఛెత్రిసేన 4 మ్యాచ్‌ల్లో 4 పాయింట్లతో రెండో ప్లేస్‌లో ఉండగా.. అఫ్గానిస్తాన్ (4 పాయింట్లు), కువైట్ (3 పాయింట్లు) 3,4వ స్థానాల్లో ఉన్నాయి.
గత నవంబర్‌లో కువైట్‌ను ఓడించిన జట్టు ఈసారి కూడా అదే రిజల్ట్‌ను రిపీట్ చేస్తే మూడో రౌండ్ బెర్తును దాదాపు ఖాయం చేసుకోనుంది. ఇండియా తరఫున 150 మ్యాచ్‌ల్లో 94 గోల్స్ కొట్టిన ఛెత్రి ఈ పోరును తన ఆఖరాటగా కాకుండా ఇండియా, కువైట్ మధ్య కీలక మ్యాచ్‌గా చూస్తానని, జట్టును గెలిపించేందుకు కృషి చేస్తానని చెప్పాడు.