దేశ ఫారెక్స్​ రిజర్వులు పెరిగినయ్

దేశ ఫారెక్స్​ రిజర్వులు పెరిగినయ్

న్యూఢిల్లీ: మనదేశ ఫారిన్​ఎక్స్ఛేంజ్​ రిజర్వులు ఈ నెల 11 నాటికి 544.72 బిలియన్​ డాలర్లకు చేరాయి. గత కొన్ని నెలల్లో ఇదే అత్యధికమని ఆర్​బీఐ లెక్కలు చెబుతున్నాయి. నవంబర్ 4 నాటికి దేశ నిల్వలు 529.99 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. రూపాయి భారీ పతనాన్ని ఆపడానికి ఆర్‌‌‌‌‌‌‌‌‌‌బీఐ ఫారెక్స్​ నిల్వలలో కొంత అమ్మింది. దీంతో ఈ ఏడాది ప్రారంభంలో వీటి విలువ దాదాపు 630 బిలియన్ డాలర్లకు చేరింది. రిజర్వ్ బ్యాంక్  ఈ ఏడాది సెప్టెంబర్‌‌‌‌లో 10.36 బిలియన్ డాలర్ల విలువైన విదేశీ కరెన్సీని అమ్మింది. స్పాట్ మార్కెట్‌‌‌‌లో 23.27 బిలియన్ డాలర్లు కొనుగోలు చేసి 33.62 బిలియన్ డాలర్లను విక్రయించినట్లు తెలిపింది. ఆగస్టుతో పోలిస్తే సెప్టెంబర్‌‌‌‌లో అమ్మకాలు 144 శాతం ఎక్కువగా ఉన్నాయి.

సెప్టెంబరులో  డాలర్‌‌‌‌తో రూపాయి విలువ 79.5 నుండి 81.5కిపైగా పడిపోయింది. అక్టోబర్‌‌‌‌లో ఇది రికార్డు స్థాయిలో 83.29కి పడిపోయింది. దీంతో ఆర్​బీఐ రంగంలోకి దిగి కొన్ని డాలర్లను అమ్మింది. ఆర్‌‌‌‌బీఐ నెట్​ ఫార్వర్డ్ డాలర్ హోల్డింగ్‌‌‌‌లు సెప్టెంబర్ చివరి నాటికి 10.42 బిలియన్ డాలర్లుగా ఉండగా, ఆగస్టు చివరి నాటికి 20.16 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. ఇది ఈ సంవత్సరంలో ఇప్పటి వరకు 54 బిలియన్ డాలర్లను అమ్మింది. నవంబర్ 11తో ముగిసిన వారంలో, యూఎస్​ ఇన్​ఫ్లేషన్​ డేటా ఊహించిన దానికంటే తక్కువగా ఉంది. దీంతో రూపాయి విలువ పెరిగింది. సెప్టెంబర్ తర్వాత మొదటిసారిగా డాలర్‌‌‌‌తో రూపాయి మారక విలువ 80 కి చేరింది.