2024–25లో జీడీపీ గ్రోత్​ 6.4 శాతం.. ఇది నాలుగేళ్ల కనిష్టం

2024–25లో జీడీపీ గ్రోత్​ 6.4 శాతం.. ఇది నాలుగేళ్ల కనిష్టం

న్యూఢిల్లీ: మన దేశ ఆర్థిక వృద్ధి రేటు 2024–25లో నాలుగేళ్ల కనిష్టం 6.4 శాతానికి పడిపోతుందని కేంద్ర ప్రభుత్వం అంచనా వేసింది. మాన్యుఫాక్చరింగ్​, సర్వీసెస్​ సెక్టార్లు నెమ్మదించడం ఇందుకు కారణమని పేర్కొంది. కొవిడ్ ​సంవత్సరం (2020–21) తరువాత జీడీపీ ఇంత తక్కువగా ఉండటం ఇదే మొదటిసారి. అప్పుడు గ్రోత్​రేట్​5.8 శాతంగా నమోదయింది. 2021–22లో 9.7 శాతం, 2022–23లో ఏడు శాతం, 2024 మార్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 8.2 శాతంగా నమోదయింది.

తాజా అంచనాలు ఆర్​బీఐ జీడీపీ గ్రోత్ ​అంచనా 6.6 శాతం కంటే తక్కువగా ఉన్నాయి. వచ్చే నెల ఒకటో తేదీన ప్రవేశపెట్టబోయే బడ్జెట్​ తయారీకి ఈ అంకెలను ఉపయోగించుకుంటారు. గత ఆర్థిక సంవత్సరంలో తయారీ రంగం ఔట్​పుట్ ​9.9 శాతం కాగా, ఈసారి 5.3 శాతానికి తగ్గుతుందని అంచనా. సర్వీస్​ సెక్టార్ ​గ్రోత్​ 6.4 శాతం నుంచి 5.8 శాతానికి తగ్గుతుందని భావిస్తున్నారు. సాగురంగ వృద్ధి మాత్రం 1.4 శాతం నుంచి 3.8 శాతానికి పెరుగుతుందని అంచనా వేశారు.