అమెరికా చేసిన పనికి ఇండియాకు ఇబ్బంది

పశ్చిమాసియాలో తమలో తాము తగువులాడుకునే దేశాలు ఇండియాతో స్నేహంగానే ఉంటాయి. ఇరాన్​ మన దేశానికి ఆయిల్​ సరఫరాలో చాలా సాయపడుతుంది. అమెరికా ఆంక్షలనుసైతం ఎదిరించి ఆయిల్​ని ఎగుమతి చేసింది. ఈ నేపథ్యంలో ఇరాన్​ ఇస్లామిక్​ రివల్యూషనరీ గార్డ్స్​ కార్ప్స్​ (ఐఆర్సీసీ)కి చెందిన అల్​–ఖుద్స్​ ఫోర్స్ కమాండర్​ ఖాసిం సులేమానీని అమెరికా హతమార్చింది. దీని ప్రభావం మన దేశంపైకూడా ఉంటుందంటున్నారు.

ఇరాన్​ సుప్రీం లీడర్​ అలీ ఖమేనీకి చాలా దగ్గరివాడుగా సులేమానీకి పేరుంది. అల్–ఖుద్స్​ ఫోర్స్​ అనేక దేశాల్లో జరిపిన హింసాకాండలన్నీ సులేమానీ ప్లాన్​ చేసినవేనని అమెరికా ఆరోపణ. ఢిల్లీలో ఒక ఇజ్రాయెల్​ దౌత్యాధికారి కారుపై దాడితోపాటుగా సిరియా, లెబనాన్​, జర్మనీల వరకు సులేమానీ చాలా చేయించాడని చెబుతోంది. 2012 ఫిబ్రవరిలో ఢిల్లీలోని ఇజ్రాయెల్​ డిప్లమాట్ ​కారుపై బాంబు అటాక్​ జరగ్గా ఇద్దరు గాయపడ్డారు. ఇది ఐఆర్జీసీ మిలిటెంట్లు జరిపిన పనిగా అప్పట్లో ఢిల్లీ పోలీసులు గుర్తించినట్లు వార్తలు వచ్చాయి. ఈ దాడి సమయంలోనే బ్యాంకాక్​,  టిబిలిసి (జార్జియా) నగరాలపైకూడా ఐఆర్జీసీ దాడులు జరిపింది.

పోయినేడాది ఇరాన్​పై అమెరికా ఆంక్షలు

ఇరాన్​ నుంచి ఆయిల్​ దిగుమతి చేసుకునే ఇండియా, చైనా, జపాన్​ దేశాలపైకూడా ఆంక్షలు విధిస్తానని హెచ్చరించింది. అయినా మన దేశానికి చమురు సరఫరా ఆగలేదు. అయితే ఇప్పుడు ఇరాన్​పై నేరుగానే అమెరికా కాలు దువ్వుతోంది కాబట్టి, మరోసారి ముప్పయ్యేళ్లనాటి గల్ఫ్​ వార్​ పరిస్థితులు ఎదురయ్యేలా ఉంది. అదే గనుక జరిగితే ఇండియా చమురు బిల్లు బాగా పెరిగే ప్రమాదముంది. అలాగే గల్ఫ్​లో పనిచేస్తున్న ఇండియన్​ కార్మికులంతా కట్టుబట్టలతో స్వదేశానికి రాక తప్పదు. వాళ్లు ఏటా పంపుతున్న కోట్లాది రూపాయలను నష్టపోవడమే కాకుండా, మన దేశం ఆయా దేశాలతో చేస్తున్న బిజినెస్​కూడా దెబ్బ తింటుంది.

గల్ఫ్​లో చోటుచేసుకునే ఎలాంటి పరిణామమైనా ఇండియాని ఇన్​ఫ్లూయెన్స్​ చేస్తుంది. ఇరాన్​ కమాండర్​ సులేమానీని హతమార్చిన వెంటనే ఆయిల్​ బ్యారెల్​ ధర మూడు డాలర్లు పెరిగిపోయింది. సౌదీలోని అరామ్​కో రిఫైనరీపై డ్రోన్​ అటాక్​ జరిగినప్పుడుకూడా ఇదే విధంగా ధర పెరిగింది. ప్రస్తుతం ఆయిల్​ బ్యారెల్​ ధర 69.16 డాలర్లకు (సుమారుగా రూ.4,963) చేరింది. . అంతర్జాతీయంగా ముడి చమురు ధర పెరిగితే… సహజంగానే ఇండియాలో పెట్రో ఉత్పత్తుల రేట్లన్నీ పెరుగుతాయి. ఈ దశలో దిగుమతుల ఖర్చు పెరిగితే ఇన్​ఫ్లేషన్​కి దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే జనాలు ధరలు పెరుగుతున్నాయని ఆందోళగా ఉన్నారు.

ఆర్థికంగానూ నష్టమే!

గల్ఫ్​ దేశాల్లో పనిచేస్తున్న ఇండియన్లు తమ సంపాదనలో కొంత భాగాన్ని ఇంటికి పంపిస్తుంటారు. అలా ఏటా నాలుగు కోట్ల డాలర్లు (సుమారుగా రూ.288 కోట్లు) వరకు ఇండియాకి వస్తుంది. మన దేశానికి వస్తున్న సొమ్ములో సగానికి పైగా (53.5 శాతం) ఆరబ్​ ఎమిరేట్స్​, సౌదీ అరేబియా, ఖతార్​, కువాయిట్​, ఒమన్​ వంటి గల్ఫ్​ దేశాల నుంచే వస్తోంది.  ఇదంతా అక్కడి ఇండియన్​ కార్మికులు పోగొట్టుకుని సొంత ఊళ్లకు వట్టి చేతులతో రావలసి వస్తుంది.

గల్ఫ్​లో 80 లక్షల ఇండియన్లు

జనరల్​ సులేమానీ హత్యతో గల్ఫ్​ దేశా ల్లో చాలా టెన్షన్​ ఏర్పడే సూచనలు కన బడుతున్నాయి. ఆయా దేశాల్లో తెలం గాణకు చెందినవారు సహా చాలా రాష్ట్రా లకు చెందిన ఇండియన్లు పెద్ద సంఖ్యలో పనిచేస్తున్నారు. సుమారుగా 80 లక్షల మంది వరకు పనిచేస్తుంటారని అంచనా. వీళ్లందరికీ ఉపాధి సమస్య ఎదురవుతుంది. దాదాపు 30 ఏళ్ల క్రితం కువాయిట్​ని ఇరాక్  ఆక్రమించిన సందర్భంలో అక్కడ లక్షకు పైగా ఇండియన్లు చిక్కుకుపోయారు. స్పెషల్​ విమానాల ద్వారా వాళ్లందరినీ ఢిల్లీకి తీసుకు రావలసి వచ్చింది. ఇప్పుడుకూడా అలాంటి పరిస్థితి ఎదురైతే కష్టమన్న ఉద్దేశంతో… కొన్ని రాష్ట్రాలవాళ్లు వెనక్కి వచ్చేస్తున్నట్లు తెలుస్తోంది.