ఐక్యరాజ్యసమితిలో ప్రధాన విభాగమైన భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ దశాబ్దాలుగా పోరాడుతోంది. కానీ, ఎప్పటికప్పుడూ రెండేండ్ల తాత్కాలిక సభ్యత్వానికే పరిమితమవుతోంది. స్వాతంత్య్రం వచ్చిన తొలినాళ్ల నుంచే ముమ్మరంగా ప్రయత్నిస్తున్నా ప్రతిసారి నిరాశే ఎదురవుతోంది. అయినా, పట్టు విడవకుండా భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వానికి భారత్ తీవ్రంగా కృషి చేస్తూనే ఉంది.
కాగా, గత సెప్టెంబర్ 23 నుంచి 28వ తేదీ వరకు న్యూయార్క్‌లోని యూఎన్ఓ 79వ జనరల్ అసెంబ్లీలో ‘సమిట్ ఆఫ్ ది ఫ్యూచర్’ మీటింగ్ జరిగింది. ఇందులో సెక్యూరిటీ కౌన్సిల్లో భారత్కు శాశ్వత సభ్యత్వ హోదా ఇవ్వాలంటూ వీటో పవర్ దేశాలైన బ్రిటన్, ఫ్రాన్స్, అమెరికా సంపూర్ణంగా మద్దతు తెలిపాయి. దీంతో మరోసారి వీటో పవర్ కల్పనపై అంతర్జాతీయంగా భారత్ వార్తల్లో నిలిచింది.
మరోవైపు బ్రెజిల్, జపాన్, జర్మనీ కూడా శాశ్వత సభ్యత్వం కోసం తీవ్రంగానే పోటీ పడుతున్నాయి. కాగా, యూఎన్ చార్టర్‌కు సవరణ చేయకుండా కొత్త దేశాలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం వీలుకాదు. ఇప్పటివరకు భారత్ రెండేండ్ల తాత్కాలిక సభ్యదేశంగా 8 సార్లు ఎన్నికైంది. చివరగా 2021లో ఎన్నికైంది.
నానాజాతి సమితి విఫలంతో యూఎన్ఓ ఆవిర్భావం
మొదటి ప్రపంచ యుద్ధం (1914 –1918) అనంతరం పశ్చిమ దేశాలన్నీ రెండు కూటములుగా విడిపోయాయి. అంతకుముందు వరకు దేశాల మధ్య శాంతి, సామరస్యత, సమగ్రతను పరిరక్షించేందుకు ఎలాంటి అంతర్జాతీయ సంస్థ లేదు. దీంతో భవిష్యత్ లో యుద్ధాల నివారణ, ప్రపంచశాంతే లక్ష్యంగా ఆనాటి అమెరికా అధ్యక్షుడు ఉడ్రోవిల్సన్ 1920లో తొలిసారి ‘నానా జాతి సమితి’అనే సంస్థను నెలకొల్పారు.
మొదటి ప్రపంచ యుద్ధానంతరం కూడా దేశాల మధ్య తలెత్తిన రాజకీయ, ఆర్థికమాంద్య పరిస్థితుల కారణంగా 20 ఏండ్ల కాల వ్యవధిలోనే రెండో ప్రపంచ యుద్ధం వచ్చింది. ఇది 1939–1945 కాలం వరకు కొనసాగింది. ఈ యుద్ధ నియంత్రణలో నానాజాతి సమితి పూర్తిగా విఫలమైంది. దీంతో ప్రత్యామ్నాయంగా పాత సంస్థ పునాదులపైనే ఐరాసను 1945 అక్టోబర్ 24న కొత్త వేదికగా ఏర్పరిచారు. ఇప్పటికీ ఐరాస కీలకపాత్ర కొనసాగుతోంది.
193 సభ్య దేశాలతో కొనసాగుతూ..
ఐక్యరాజ్యసమితి ఏర్పాటైన మొదట్లో 51 సభ్య దేశాలు మాత్రమే ఉండేవి. ప్రస్తుతం 193కు చేరాయి. ఆఫ్రికా ఖండ దేశమైన సూడాన్‌లో దశాబ్దాల అంతర్యుద్ధం, మారణకాండ తర్వాత కొత్తగా ఆవిర్భవించిన దక్షిణ సూడాన్ 2017లో చివరగా చేరింది. ఇక తైవాన్, వాటికన్ సిటీ, టాంగో, నౌరు మినహా ప్రపంచవ్యాప్తంగా సౌర్వభౌమత్వ దేశాలన్నీ ఐరాసలో సభ్యదేశాలుగా ఉన్నాయి. యూఎన్ఓలో జనరల్ అసెంబ్లీ, భద్రతామండలి, ఆర్థిక, సామాజిక మండలి, అంతర్జాతీయ న్యాయస్థానం, సచివాలయం, ధర్మకర్తృత్వ మండలి వంటి ఆరు ప్రధాన విభాగాలు ఉన్నాయి.
వీటిలో కీలకమైనది భద్రతా మండలి. దీనిలో బ్రిటన్, ఫ్రాన్స్, రష్యా, అమెరికా, చైనా మాత్రమే శాశ్వత సభ్య దేశాలుగా ఉన్నాయి. వీటితో పాటు మరో 10 సభ్య దేశాలు తాత్కాలికంగా ప్రతి రెండేండ్లకోసారి ఎన్నికవుతుంటాయి. ప్రస్తుత యూఎన్ జనరల్ సెక్రటరీ ఆంటోనియో గుటెరస్ 2017లో తొలిసారిగా ఎన్నికై.. ప్రస్తుతం రెండోసారి పదవిలో కొనసాగుతున్నారు.
పెత్తనమంతా ఐదు దేశాలదే..
అంతర్జాతీయంగా సభ్య దేశాల మధ్య సత్సంబంధాలు పెంపొందించడం, యుద్ధాలు రాకుండా చూడడం. సభ్య దేశాల మధ్య తలెత్తిన వివాదాలను శాంతియుతంగా పరిష్కరించడం. స్నేహ సంబంధాలను పెంపొందించడం. అణ్వస్త్ర నిరాయుధీకరణ. దేశాలు పరస్పరం సమగ్రతను గౌరవించుకునేలా చూడడం వంటివి ఐరాస ప్రధాన లక్ష్యాలు. అయితే.. ఏవైనా రెండు సభ్య దేశాల మధ్య శాంతి భద్రతలకు విఘాతం, యుద్ధవాతావరణం ఏర్పడితే.. భద్రతామండలిలోని ఐదు దేశాలకే వీటో (తిరుగులేని) పవర్ ఉంటుంది.
ఒకవేళ అన్ని సభ్య దేశాలకు ఓటింగ్ పెట్టినా.. ఏ ఒక్క శాశ్వత సభ్యదేశం సుముఖత తెలపకపోయినా ఆ ఎన్నిక చెల్లదు. రష్యా – ఉక్రెయిన్ యుద్ధంపై జరిగిన ఓటింగ్ లో భారత్ తటస్థంగా ఉండిపోయింది. భద్రతా మండలిలో 11 సభ్య దేశాలే ఉండేవి. ప్రస్తుతం15కు చేరాయి. వీటిని సాధారణ సభలోని మొత్తం సభ్య దేశాలన్నీ ఓటు హక్కు ద్వారా ఎన్నుకుంటాయి. ఐరాస రూల్స్ పాటించని దేశాలపై భద్రతా మండలి ఆంక్షలు విధిస్తుంది. అవసరమైతే సైనిక చర్యకు కూడా దిగుతుంది.
ఇలా శాశ్వత సభ్య ఐదు దేశాలైన అమెరికా, బ్రిటన్, రష్యా, ఫ్రాన్స్, చైనా పెత్తనం చెలాయిస్తుంటాయి. ఇక భారత్కు వీటో పవర్ హోదా ఇవ్వాలంటే ఈ ఐదు దేశాలూ ఒప్పుకోవాల్సిందే. భారత్కు శాశ్వత హోదా దక్కకుండా ఎప్పటికప్పుడు చైనా తీవ్ర ప్రయత్నాలే చేస్తోంది. భారత్కు శాశ్వత హోదా కల్పన కంటే భద్రతామండలిలో తాత్కాలిక సభ్య దేశాల సంఖ్యను 15 నుంచి 25కు పెంచాలనే అంశాన్ని లేవనెత్తుతోంది.
ఇలా భారత్కు హోదాపై వ్యతిరేకతను చైనా అంతర్జాతీయ వేదికలపై బాహాటంగానే వ్యక్తీకరిస్తోంది. అమెరికా మాత్రం భారత్ హోదాపై చర్చకు తెస్తుంటుంది. కానీ, చివరకు చైనాతో వంతపాడుతూ ఆ రెండు దేశాలు ఏకమవుతుంటాయి. గతంలోనూ ఇలాగే చేశాయి.
యూఎన్ఓపైనా విమర్శలు ఎక్కువే..
ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల మధ్య నెలకొన్న సంక్షోభాలను నివారించడంలో ఐరాస విఫలం చెందుతూనే ఉందని, కేవలం ఐదు శాశ్వత సభ్య దేశాలే దాన్ని నియంత్రిస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు సందర్భానుసారం విమర్శిస్తుంటారు. వీటో అధికారాలే పెద్ద అవరోధంగా తయారయ్యాయని, అతిక్రమణలకు పాల్పడే దేశాలపై ఆంక్షలు విధించకుండా ఆ దేశాలే అడ్డుకుంటాయనే ఆరోపణలు చేస్తుంటారు. ఇక దేశాల మధ్య తలెత్తిన
వివాదాలను పరిష్కరించడం కూడా యూఎన్ఓకు సవాలుగా మారింది. రష్యా– ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియా దేశాల మధ్య నెలకొన్న అంతర్యుద్ధాలు, ఉత్తర కొరియా, దక్షిణ కొరియా మధ్య ఉద్రిక్తతలు, భారత్, పాకిస్తాన్ మధ్య సరిహద్దు వివాదాలు, చైనా సామ్రాజ్య కాంక్ష విస్తరణ వంటి అంశాల్లో ఐరాస తీవ్రంగా విఫలం చెందిందనే అభిప్రాయాలు లేకపోలేదు. భారత్ కు ఒకవేళ శాశ్వత సభ్య దేశ హోదా దక్కితే మిగతా శాశ్వత దేశాల ఆగడాలకు అంతర్జాతీయంగా అడ్డుకట్ట పడే వీలుంటుందని, అందుకే ఆ దేశాలు ఎప్పటికప్పుడు అడ్డుకుంటున్నాయనే విమర్శలు అంతర్జాతీయ రాజకీయ నిపుణుల నుంచి వినిపిస్తున్నాయి.
దేశాధినేతలు, ప్రముఖుల మద్దతు
భారత్ కు వీటో పవర్ పై అంతర్జాతీయంగా దేశాధినేతలు, ప్రముఖుల మద్దతు పెరుగుతూ వస్తోంది. తాజాగా, వీటో పవర్ కలిగిన బ్రిటన్ ప్రధాని కైర్ స్టార్మర్.. ‘బ్రెజిల్, ఇండియా, జపాన్, జర్మనీలకు శాశ్వత సభ్యత్వ హోదా ఇచ్చేందుకు మద్దతును ఇస్తున్నాను’ అని పేర్కొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మెక్రాన్.. ‘యూఎన్ సెక్యూరిటీ కౌన్సిల్ లో భారత్ , జర్మనీ, జపాన్ , బ్రెజిల్ కు శాశ్వత హోదా కల్పనకు తమ దేశం మద్దతు ఇస్తుంది’ అని చెప్పారు.
అమెరికా విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ కూడా.. భారత్, జపాన్, జర్మనీలకు భద్రతా మండలిలో శాశ్వత సభ్యులుగా చేర్చడానికి అమెరికా మద్దతు ఇస్తుందని పేర్కొన్నారు. వీరే కాకుండా ప్రముఖంగా టెస్లా వ్యవస్థాపకుడు, ట్విట్టర్(ఎక్స్) అధినేత ఎలాన్ మస్క్, ఇజ్రాయెల్ వెంచర్ క్యాపిటలిస్ట్ మైఖేల్ ఐసెన్ బర్గ్, యూఎన్ ప్రస్తుత ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్, బ్రిటన్ మాజీ ప్రధాని డేవిడ్ కామెరూన్ వంటివారు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు.
వీరి మద్దతుతో భారత్‌కు వీటో పవర్ దక్కేందుకు మార్గం సుగమం అయినట్టు కనిపిస్తోంది. కానీ.. ఏంటనేది ఈ నెల 24న ఓటింగ్ లో తేలనుంది. ఈసారి భద్రతా మండలిలో విస్తరణ జరిగినా.. భారత్ కు శాశ్వత సభ్యత్వ హోదా దక్కక పోతే.. మరో 25 ఏండ్ల దాకా ఎదురుచూడాలి. దశాబ్దాలుగా భారత్ నిర్విరామ పోరు ఈసారైనా ఫలించి శాశ్వత హోదా దక్కాలని ఆశిద్దాం.
- వేల్పుల సురేష్,సీనియర్ జర్నలిస్ట్