భారత్,ఇంగ్లండ్ జట్ల మధ్య చివరిదైన ఐదో టెస్టు మార్చి 7న (గురువారం) ధర్మశాలలో ప్రారంభం కానుంది. టీమిండియా ఇప్పటికే 3-1తో సిరీస్ గెలిచింది. రేపు జరగనున్న మ్యాచ్ లోనూ గెలిచి టెస్ట్ ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో టాప్ ర్యాంక్ ను పదిలపర్చుకోవాలని చూస్తుంది. మరోవైపు ఇంగ్లాండ్ చివరి మ్యాచ్ లో టీమిండియాను మట్టికరిపించి ఆధిక్యాన్ని తగ్గించాలని భావిస్తుంది. ఐదో టెస్ట్ కోసం ఇప్పటికే ఇంగ్లాండ్ తమ ప్లేయింగ్ 11 ను ప్రకటించగా.. భారత్ ఈ మ్యాచ్ లో ముగ్గురు ఫాస్ట్ బౌలర్లతో దిగే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
సాధారణంగా భారత పిచ్ లపై ముగ్గురు ఫాస్ట్ బౌలర్లను ఆడించడం అరుదుగా జరుగుతుంది. ఈ సిరీస్ లో ఇప్పటివరకు జరిగిన నాలుగు టెస్టుల్లో భారత్ ఇద్దరు సీమర్లతోనే బరిలోకి దిగింది. అయితే ధర్మశాల పిచ్ ఫాస్ట్ బౌలింగ్ కు అనూకూలిస్తుంది. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని టీమిండియా ఐదో టెస్టులో బుమ్రా, సిరాజ్, ఆకాష్ దీప్ లను ఆడించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అదే జరిగితే కుల్దీప్ యాదవ్, జడేజా, అశ్విన్ ఒకరికి బెంచ్ కు పరిమితం కావాల్సి వస్తుంది. అశ్విన్ 100వ టెస్టు ఆడుతుండటంతో కుల్దీప్ యాదవ్ పైనే వేటు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఒకవేళ ఇద్దరు పేసర్లతోనే బరిలోకి దిగితే నాలుగో టెస్టులో రాణించిన ఆకాష్ దీప్ పై వేటు పడటం ఖాయంగా కనిపిస్తుంది. బ్యాటింగ్ విభాగంలో పడికల్, రజత్ పటిదార్ లలో ఎవరికి అవకాశం దక్కుతుందో ఆసక్తికరంగా మారింది. ఈ సిరీస్ లో భాగంగా హైదరాబాద్ లో జరిగిన తొలి టెస్టులో ఓడిపోయిన తర్వాత వైజాగ్, రాజ్ కోట్, రాంచీ టెస్టులో వరుస విజయాలు సాధించింది.