- 7 వికెట్ల తేడాతో ఘన విజయం
- రాణించిన బౌలర్లు, మంధాన, షెఫాలీ
దంబుల్లా: ఖతర్నాక్ బౌలింగ్, సూపర్ బ్యాటింగ్‌తో పాకిస్తాన్‌ను చిత్తు చేసిన ఇండియా విమెన్స్ ఆసియా కప్ వేటను ఘనంగా ఆరంభించింది. బౌలింగ్‌లో దీప్తి శర్మ (3/20), రేణుకా సింగ్ (2/14), శ్రేయాంక పాటిల్ (2/14), పూజా వస్త్రాకర్ (2/31), బ్యాటింగ్‌లో ఓపెనర్లు స్మృతి మంధాన (31 బాల్స్‌లో 9 ఫోర్లు, 1 సిక్స్‌తో 41), షెఫాలీ వర్మ (29 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 40) మెరుపులతో శుక్రవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో ఇండియా 7 వికెట్ల తేడాతో పాక్‌పై గ్రాండ్ విక్టరీ సాధించింది. టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్‌కు వచ్చిన పాకిస్తాన్ 19.2 ఓవర్లలో 108 రన్స్‌కే కుప్పకూలింది.
ఇండియా బౌలర్ల పేస్, స్పిన్ ధాటిని తట్టుకోలేక పాక్ బ్యాటర్లు విలవిల్లాడారు. ఓపెనర్లు గుల్ ఫెరోజా (5), మంజీబా అలీ (11)ని తన వరుస ఓవర్లలో పెవిలియన్ చేర్చిన వస్త్రాకర్ ఆ జట్టు పతనాన్ని మొదలు పెట్టింది. టాప్ స్కోరర్ సిద్రా అమిన్ (25)తో పాటు ఇమ్రమ్ జావెద్ (0)ను వరుస బాల్స్‌లో ఔట్ చేసిన మరో పేసర్ రేణుక పాక్‌ను కోలుకోలేని దెబ్బకొట్టింది. స్పిన్నర్లు దీప్తి, శ్రేయాంక మిగతా వారి పని పట్టారు. సిద్రాతో పాటు తుబా హసన్ (22), చివర్లో ఫాతిమా సనా (22 నాటౌట్) పోరాటంతో పాక్ అతి కష్టంగా వంద మార్కు దాటింది.
చిన్న టార్గెట్ ఛేజింగ్‌కు వచ్చిన ఇండియా 14.1 ఓవర్లలోనే 109/3 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. ఫామ్‌లో ఉన్న ఓపెనర్లు షెఫాలీ, మంధాన తొలి ఓవర్ నుంచే బౌండ్రీల వర్షం కురిపించారు. తుబా హసన్ వేసిన ఆరో ఓవర్లో మంధాన రెండు ఫోర్లు, షెఫాలీ సిక్స్‌తో విజృంభించగా పవర్ ప్లేలోనే ఇండియా 57/0 స్కోరు చేసింది.తుబా బౌలింగ్‌లో మంధాన హ్యాట్రిక్ ఫోర్లతో అలరించింది.
ఈ జోరు చూస్తుంటే ఓపెనర్లే టార్గెట్‌ను కరిగించేలా కనిపించారు. కానీ, సయెదా అరూబ్ షా వేసిన పదో ఓవర్లో భారీ షాట్‌కు ట్రై చేసిన మంధాన క్యాచ్ ఔట్ అవ్వడంతో తొలి వికెట్‌కు85 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ అయింది. షెఫాలీతో పాటు వచ్చీరాగానే హ్యాట్రిక్ ఫోర్లు కొట్టిన హేమలత (14) కూడా ఔటైనా హర్మన్ (5 నాటౌట్), జెమీమా (3 నాటౌట్) లాంఛనం పూర్తి చేశారు. దీప్తి శర్మకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.
సంక్షిప్త స్కోర్లు
పాకిస్తాన్: 19.2 ఓవర్లలో 108 ఆలౌట్
(సిద్రా 25, ఫాతిమా 22 నాటౌట్, దీప్తి 3/20), రేణుక 2/14, శ్రేయాంక 2/14).
ఇండియా: 14.1 ఓవర్లలో
109/3 (మంధాన 45,
షెఫాలీ 40, సయెదా 2/9).