రోదసి యాత్రలు చేస్తే తప్పేంది?

రోదసి యాత్రలు చేస్తే తప్పేంది?

చంద్రయాన్ –2 ప్రయోగం వాయిదా పడటంతో ఓ కొత్త వాదన తెరమీదకు వచ్చింది. సంక్షేమాన్ని గాలికొదిలేసి కోట్ల రూపాయలను స్పేస్ రీసెర్చ్ కు కేంద్ర ప్రభుత్వం అనవసరంగా ఖర్చు పెడుతోందన్న వాదన వచ్చింది. అయితే అభివృద్ది చెందుతున్న దేశంగా స్పేస్ రీసెర్చ్ కు ఇండియా డబ్బులు ఖర్చు పెట్టడం నూటికి నూరు శాతం కరెక్టే అంటున్నారు సైంటిస్టులు.

“మనిషి అంతరిక్షంలోకి  వెళ్లకపోతే మానవాళికి ఎన్నటికీ భవిష్యత్ ఉండదు ”ఈ మాట అన్నది ఎవరో కాదు…..స్పేస్ సైంటిస్ట్  స్టీఫెన్ హాకింగ్. ఈ మాటలను స్ఫూర్తిగా తీసుకుంది భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ( ఇస్రో). స్పేస్ రీసెర్చ్ లో తన సత్తా చాటడానికి అనుక్షణం ప్రయత్నిస్తోంది. ఇస్రో పుట్టి  సరిగ్గా 50 ఏళ్లు. అంతరిక్ష పరిశోధనల కోసం 1969 ఆగస్టు 15న ఇస్రోను ప్రారంభించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. జవహర్ లాల్ నెహ్రూ, హోమీ బాబా, విక్రంసారాబాయ్ కలల పునాదులపై ఇస్రో ప్రయాణం మొదలైంది. ఈ ప్రయాణంలో అనేక విజయాలను ఇస్రో తన ఖాతాలో వేసుకుంది. స్పేస్ రీసెర్చ్  లో అంచెలంచెలుగా దూసుకుపోతోంది.

ఈ 50 ఏళ్లలో అమెరికా, రష్యా వంటి అగ్రదేశాలకు దీటుగా ఆకాశవీధిలో ఎన్నో అద్భుతాలు సృష్టించింది. అంతరిక్ష  పరిశోధనల్లో   ఆ దేశాలతో పోటీ పడుతూ రాకెట్ వేగంతో  ముందుకు దూసుకుపోతోంది. స్పేస్ జర్నీ ప్రారంభించిన కొన్నేళ్లలోనే ఆర్యభట్ట ఉపగ్రహానికి ఊపిరిపోసింది. 1975, ఏప్రిల్ 19న అప్పటి సోవియట్ యూనియన్  ఇంటర్ కాస్మోస్  రాకెట్ ద్వారా ఆర్యభట్ట శాటిలైట్ ను రోదసీలోకి  ప్రవేశపెట్టింది. ఆర్యభట్ట ప్రయోగంతో  స్పేస్ రీసెర్చ్ లో  ఇస్రో జైత్రయాత్ర మొదలైంది. ఆ తర్వాత భాస్కర 1, భాస్కర్ 2 శాటిలైట్  ప్రయోగాలతో ఇస్రో మరో అడుగు ముందుకేసింది. ఈ విజయాలు ఇచ్చిన స్ఫూర్తితో మరిన్ని ప్రయోగాలు చేపట్టింది ఇస్రో. చంద్రయాస్ –1 ప్రయోగం సక్సెస్ కావడంతో అందరి దృష్టి  ఇండియా పై పడింది.  ఇస్రో చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి ప్రపంచదేశాలు మాట్లాడుకోవడం మొదలైంది. అసలు చంద్రయాన్– 1 శాటిలైట్  ప్రయోగించడానికి  రెడీ అవుతున్న సందర్భంలో అనేక దేశాలు ఇస్రో ను నిరుత్సాహ పరిచాయి. నలభై ఏళ్ల కిందటే, చంద్రుడి పైకి అనేక దేశాలు యాత్రలు నిర్వహించిన సంగతి గుర్తు చేశాయి.ఈ పరిస్థితుల్లో  చంద్రయాన్ –1 అవసరం ఏమిటన్న ప్రశ్నలు తెరమీదకు వచ్చాయి.అయితే  ఇస్రో సైంటిస్టులు వీటిని పట్టించుకోలేదు. కూల్ గా తమ పని తాము చేసుకుపోయారు. అప్పటివరకు ఎన్నో దేశాలు యాత్రలు చేసినా జాబిల్లి ఉపరితలంపై  నీళ్లకు సంబంధించిన  స్పష్టమైన ఆధారాలు కనుక్కున్న ఘనత చంద్రయాన్ –1 ప్రయోగానికే  దక్కింది. దీంతో చంద్రయాన్ –1 ప్రయోగానికి అంతర్జాతీయంగా పేరు వచ్చింది.అంతేకాదు చాలా తక్కువ ఖర్చుతో  ఇస్రో ఈ మిషన్ ను చేసింది.

చంద్రయాన్ –2 ప్రయోగం చివరి క్షణంలో వాయిదా పడటంతో ఒక విచిత్రమైన వాదన తెర మీదకు వచ్చింది. ప్రజా  సంక్షేమం కోసం పెట్టాల్సిన ఖర్చును ఇండియా వంటి అభివృద్ది చెందుతున్న దేశం అనవసరంగా అంతరిక్ష పరిశోధనలపై  పెడుతోందన్నది ఈ వాదన సారాంశం. ఈ వాదన ఏమాత్రం కరెక్ట్ కాదంటున్నారు  సైంటిస్టులు. మిగతా దేశాలతో పోలిస్తే  ఇస్రో  చాలా తక్కువ బడ్జెట్ తోనే  పరిశోధనలు చేపడుతున్న విషయాన్ని వీరు గుర్తు చేశారు. 2014 లో  ఇస్రో చేపట్టిన మంగళ్​యాన్ ప్రయోగం  ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షించింది.మంగళ్​యాన్ ప్రయోగానికి మన దేశం ఖర్చు పెట్టింది కేవలం రూ. 450 కోట్లు. ఇంత తక్కువ బడ్జెట్ తో ప్రపంచంలోని  ఏ దేశమూ అంగారక గ్రహం పై ప్రయోగం చేపట్టలేదు. సహజంగా  స్పేస్  కు సంబంధించిన ఏ ప్రయోగానికైనా   సైంటిస్టులు అడిగినంత బడ్జెట్ ను కేటాయిస్తాయి ఆయా ప్రభుత్వాలు.  అమెరికా వంటి దేశమైతే  ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు.  ‘నాసా’ కు బిలియన్ డాలర్ల బడ్జెట్ కేటాయిస్తుంది. 2012 లో అంగారక గ్రహం పై నీళ్ల జాడ తెలుసుకోవడానికి  క్యూరియాసిటీ రోవర్ ను నాసా ప్రయోగించింది. ఈ ప్రయోగానికి 12వేల కోట్ల రూపాయలకు పైగా అమెరికా ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అంగారకుడి మీదికి 2014 లో మావెన్ పేరుతో ఓ శాటిలైట్ ను పంపింది అమెరికా. ఈ ప్రయోగానికి అమెరికా ఖర్చు పెట్టింది రూ. 4,500 కోట్లు. స్పేస్ రీసెర్చ్ కు మిగతా దేశాలు వేల, లక్షల కోట్లు ఖర్చు పెడుతుంటే మనం చాలా తక్కువ బడ్జెట్ లో పరిశోధనలు చేపడుతున్నాం. 2019–20 కేంద్ర ప్రభుత్వ బడ్జెట్ లో  స్పేస్ రీసెర్చ్ కు కేటాయించింది రూ. 12,473 కోట్లు మాత్రమే. కిందటేడాది బడ్జెట్ లో రూ. 10, 783 కోట్లు కేటాయించారు. అమెరికా, రష్యా వంటి దేశాల బడ్జెట్ తో పోలిస్తే  ఈ కేటాయింపులు చాలా తక్కువే అంటున్నారు సైంటిస్టులు.

మన ప్రయోగాలతో బోలెడంత ఫారిన్ ఎక్స్ఛేంజ్

ఇస్రో చేపడుతున్న  ప్రయోగాలను చిన్న చూపు చూడటం కూడా కరెక్ట్ కాదంటున్నారు సైంటిస్టులు. ఈ ప్రయోగాలతో  మనకు బోలెడంత ఫారిన్ ఎక్స్ఛేంజ్ వస్తోన్న విషయాన్ని  వీరు గుర్తు చేశారు. స్పేస్ లోకి మనం పంపే రాకెట్ ల ద్వారా మిగతా దేశాలు వారికి చెందిన శాటిలైట్ లను కూడా పంపుతుంటాయి.ఇలా పంపినందుకు ఆయా దేశాల నుంచి మనకు పెద్ద మొత్తంలో  ఫారిన్ ఎక్స్ఛేంజ్ వస్తుంది. వీటన్నిటితో పాటు మన అంతరిక్ష పరిశోధనలకు సంబంధించి  ఎస్టాబ్లిష్ మెంట్ ఖర్చు కూడా తక్కువే. ‘ ఇస్రో ’ ప్రారంభమయ్యే నాటికి అమెరికా, అప్పటి సోవియట్ రష్యాలు ఆల్రెడీ  స్పేస్ రీసెర్చ్ లో ఎస్టాబ్లిష్ అయ్యాయి. అమెరికా లో  ‘ నాసా ’ ఉంది. సోవియట్ రష్యాకు కూడా సొంత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఉంది.

సంక్షేమం, సైన్స్​ వేర్వేరు అంశాలు

ప్రజా సంక్షేమం కోసం పెట్టాల్సిన సొమ్మును  అంతరిక్ష  పరిశోధనలకు పెడుతున్నారన్న వాదనను సైంటిస్టులు తోసిపుచ్చుతున్నారు. సంక్షేమం, అంతరిక్ష పరిశోధన….రెండింటినీ వేర్వేరుగా చూడాలన్నారు. ఈ రెండింటినీ కలగలిపి చూడటం కరెక్ట్ కాదన్నది సైంటిస్టుల వాదన. సంక్షేమం అనేది ఒక సోషల్ ఇష్యూ.  సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడానికి చేయడానికి ఏ ప్రభుత్వం దగ్గరైనా అనేక ఉపాయాలు ఉంటాయి. అభివృద్ది కార్యక్రమాలు ఉంటాయి. ఉపాధి కల్పించే పథకాలు ఉంటాయి. అభివృద్ది పథకాలు సజావుగా అమలు చేస్తే  ప్రజల ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే సంపద  పోగవుతుంది. ఫలితంగా ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఈ అంశాలను పక్కన పెట్టి అసలు బడ్జెట్ అంతా స్పేస్ రీసెర్చ్ కే ఖర్చు పెడుతున్నారన్న వాదన కరెక్ట్ కాదంటున్నారు  సైంటిస్టులు. ఈ సందర్భంగా  చంద్రయాన్ –2 ప్రయోగానికి  ఇస్రోకు కేటాయించిన బడ్జెట్ కేవలం రూ. 978 కోట్లు అనే విషయాన్ని  వీరు గుర్తు చేశారు.  అంతరిక్ష పరిశోధనలకు మిగతా దేశాలు పెడుతున్న ఖర్చుతో  పోలిస్తే ఇది చాలా తక్కువ అమౌంట్ అన్నది  సైంటిస్టుల వాదన.

ఎందుకంత  ఆసక్తి ?

రోదసీలో ఎన్ని గ్రహాలున్నా  జాబిల్లిపై  పరిశోధనలకు సైంటిస్టులు ఆసక్తి చూపుతుంటారు. దీనికి ప్రధాన కారణం రోదసీలో భూమికి అత్యంత దగ్గరగా ఉన్న గ్రహం జాబిల్లే. మరిన్ని  అంతరిక్ష  ప్రయోగాలకు అవసరమైన టెక్నాలజీని అందిపుచ్చుకోవడానికి  జాబిల్లిపై ప్రయోగాలు ఉపయోగపడతాయి.