- 8 వికెట్ల తేడాతో చిత్తయిన సౌతాఫ్రికా
- రాణించిన సుదర్శన్, శ్రేయస్
జొహానెస్‌బర్గ్: వన్డే వరల్డ్ కప్ ఓటమి తర్వాత ఆడుతున్న తొలి సిరీస్. ఆ ఫైనల్లో ఆడిన వారిలో ముగ్గురే తుది జట్టుతో ఉన్నారు. పేస్‌కు స్వర్గధామం అయిన సౌతాఫ్రికాలో సీనియర్లు జస్‌ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ, మహ్మద్ సిరాజ్ లేకుండానే బరిలోకి దిగారు. ఇలాంటి పరిస్థితుల్లో సఫారీ గడ్డపై ఇండియన్స్ తొలి మ్యాచ్‌లో అద్భుతం చేశారు. యంగ్ పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ (5/37), అవేశ్‌ఖాన్ (4/27) బుల్లెట్లలాంటి బంతులతో బ్యాటర్లను వణికించారు.
బ్రెస్ట్ క్యాన్సర్‌పై అవగాహన కల్పించేందుకు పింక్ కలర్ జెర్సీలతో ఉత్సాహంగా బరిలోకి దిగిన సఫారీల మైండ్‌బ్లాక్ చేశారు. దాంతో ఆదివారం జరిగిన తొలి వన్డేలో 8 వికెట్ల తేడాతో సౌతాఫ్రికాను చిత్తు చేసిన ఇండియా మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో 1–0తో ఆధిక్యం సాధించింది. ఏకపక్షంగా సాగిన మ్యాచ్‌లో టాస్ నెగ్గి బ్యాటింగ్‌కు వచ్చిన సఫారీ టీమ్ అర్ష్‌దీప్, అవేశ్ దెబ్బకు 27.3 ఓవర్లలో 116 రన్స్‌కే కుప్పకూలింది. ఫెలుక్వాయో (33), టోనీ డి జార్జీ (28), మార్‌క్రమ్ (12), షంసీ (11 నాటౌట్) తప్ప మిగతా బ్యాటర్లంతా సింగిల్ డిజిట్‌కే ఔటయ్యారు.
తర్వాత అరంగేట్రం కుర్రాడు సాయి సుదర్శన్ (43 బాల్స్‌లో 9 ఫోర్లతో 55 నాటౌట్), శ్రేయస్ అయ్యర్ (45 బాల్స్‌లో 6 ఫోర్లు, 1 సిక్స్‌తో 52) ఫిఫ్టీలతో రాణించడంతో ఇండియా 16.4 ఓవర్లలోనే 117/2 స్కోరు చేసి ఈజీగా గెలిచింది. అర్ష్‌దీప్‌కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. మంగళవారం గెబెహాలో రెండో వన్డే జరుగుతుంది.
సూపర్ బౌలింగ్
సీనియర్లు లేని సమయంలో అర్ష్‌దీప్, అవేశ్ మ్యాజిక్ చేశారు. తొలుత లెఫ్టార్మ్ బౌలర్అర్ష్‌దీప్ మ్యాజికల్ స్పెల్ వేయగా.. మూడో పేసర్‌గా వచ్చిన అవేశ్ సైతం అదరగొట్టాడు. వీళ్లను ఎదుర్కోలేక సౌతాఫ్రికా క్వాలిటీ బ్యాటింగ్ లైనప్ బోల్తా కొట్టింది. ముఖ్యంగా షార్ట్ ఫార్మాట్‌లో నిలకడ లోపించిన అర్ష్‌దీప్ కెరీర్ బెస్ట్ బౌలింగ్‌తో జట్టులో తన స్థానాన్ని నిలబెట్టుకునే పెర్ఫామెన్స్ చేశాడు. పవర్ ప్లేలోనే నాలుగు వికెట్లతో ఆతిథ్య జట్టు నడ్డి విరిచాడు.
పిచ్‌పై లభిస్తున్న అనూహ్యమైన బౌన్స్‌ను సద్వినియోగం చేసుకుంటూ సీమ్, స్వింగ్‌తో టాపార్డర్ బ్యాటర్లను తీవ్రంగా ఇబ్బంది పెట్టాడు. ఫాస్ట్, ఫుల్ లెంగ్త్ బాల్స్ వేస్తూ బ్యాటర్లు క్రీజు కదలకుండా కట్టడి చేశాడు. రెండో ఓవర్లో బౌలింగ్‌కు వచ్చిన అతను నాలుగో బాల్‌కు ఓపెనర్ రీజా హెండ్రిక్స్ (0)ను బౌల్డ్, ఐదో బాల్‌కు వాండర్ డసెన్ (0)ను ఎల్బీ చేసి హ్యాట్రిక్‌పై నిలిచాడు. ఈ దశలో కెప్టెన్ మార్‌క్రమ్‌తో జతకట్టిన మరో ఓపెనర్ టోనీ.. ముకేశ్ వేసిన ఐదో ఓవర్లో 4,6తో ఎదురుదాడికి దిగాడు.
అర్ష్‌దీప్ బౌలింగ్‌లోనూ సిక్స్ కొట్టాడు. కానీ, అదే ఓవర్లో షార్ట్ లెంగ్త్ బాల్‌తో అతడిని అర్ష్‌దీప్ వెనక్కుపంపాడు. తన తర్వాతి ఓవర్లోనే మరో అద్భుత డెలివరీతో క్లాసెన్ (6)ను బౌల్డ్ చేయడంతో పవర్‌ప్లేలోనే సఫారీ టీమ్ 52/4తో కష్టాల్లో పడింది. ఆ తర్వాత అవేశ్ షో మొదలైంది. 11వ ఓవర్లో వరుస బాల్స్‌లో మార్‌క్రమ్, వియాన్ ముల్డర్ (0)ను ఔట్ చేసి ప్రత్యర్థికి డబుల్ షాకిచ్చాడు. అవేశ్ బాల్‌ను మార్‌క్రమ్ వికెట్ల మీదకు ఆడుకోగా.. లెగ్ కట్టర్‌కు ముల్డర్ వికెట్ల ముందు దొరికిపోయాడు.
ఆపై అవేశ్ లెంగ్త్, బౌన్స్‌ను అర్థం చేసుకోలేక డేవిడ్ మిల్లర్ (2) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. షార్ట్ లెంగ్త్ బాల్‌ను కేశవ్ మహారాజ్ (4) నేరుగా రుతురాజ్ చేతుల్లోకి కొట్టాడు. దాంతో చెరో నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్న అర్ష్‌దీప్, అవేశ్ ఐదో వికెట్ కోసం పోటీ పడ్డారు. 73/8తో నిలిచిన సఫారీ టీమ్ వందలోపే ఆలౌటయ్యేలా కనిపించింది. అయితే, టెయిలెండర్ ఫెలుక్వాయో కొద్దిసేపు ప్రతిఘటించాడు. బర్గర్ (7) సపోర్ట్‌తో స్కోరు వంద దాటించాడు. చివరకు ఓ ఫుల్ లెంగ్త్ బాల్‌తో ఫెలుక్వాయోను ఎల్బీ చేసిన అర్ష్‌దీప్ ఐదు వికెట్ల స్పెల్ ఖాతాలో వేసుకున్నాడు. కుల్దీప్ బౌలింగ్‌లో బర్గర్ బౌల్డ్ అవ్వడంతో సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ముగిసింది.
100 బాల్స్‌లోనే
కొత్త కుర్రాడు సాయి సుదర్శన్, సీనియర్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ మెరుపులతో చిన్న టార్గెట్‌ను ఇండియా అలవోకగా ఛేజ్ చేసింది. తొలి ఇంటర్నేషనల్ మ్యాచ్‌లోనే సుదర్శన్ తన టాలెంట్ చూపెట్టాడు. ఎదుర్కొన్న తొలి బాల్‌కే ఫోర్ కొట్టిన అతను మంచి డ్రైవ్స్‌తో పాటు బ్యాక్ ఫుట్‌పై షార్ట్ బాల్స్‌ను ఈజీగా పుల్ చేశాడు. స్పిన్నర్లనూ పక్కాగా ఎదుర్కొన్నాడు. షంసీ బౌలింగ్‌లో కొట్టిన ఆన్ డ్రైవ్ ఫోర్ అందరినీ ఆకట్టుకుంది.
ఓపెనర్ రుతురాజ్ (5) ఫెయిలైనా వన్‌డౌన్‌లో వచ్చిన శ్రేయస్‌తో కలిసి ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. మరోవైపు అయ్యర్ సైతం తన క్లాస్ చూపెట్టాడు. ఈ ఇద్దరూ క్రమం తప్పకుండా బౌండ్రీలు రాబట్టారు. ఈ క్రమంలో ఫెలుక్వాయో వేసిన 16వ ఓవర్లో సింగిల్‌తో సాయి ఫిఫ్టీ పూర్తి చేసుకోగా.. అదే ఓవర్లో వరుసగా 4, 6 కొట్టిన అయ్యర్ కూడా ఫిఫ్టీ దాటాడు. తర్వాతి బాల్‌కు తను ఔటైనా తిలక్ (1 నాటౌట్)తో కలిసి సాయి లాంఛనం పూర్తి చేశాడు. టార్గెట్‌ను ఇండియా కేవలం వంద బాల్స్‌లోనే ఛేజ్ చేయడం విశేషం.