- 106 రన్స్ తేడాతో ఇంగ్లండ్ ఓటమి
- మూడేసి వికెట్లతో దెబ్బకొట్టిన బుమ్రా, అశ్విన్
- 1-1తో సిరీస్ సమం చేసిన రోహిత్ సేన
విశాఖపట్నం: ఇంగ్లండ్ బజ్‌బాల్ సవాల్‌కు టీమిండియా తమ స్పిన్, పేస్ బాల్‌తో చెక్ పెట్టింది. పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా (3/46), స్పిన్నర్ అశ్విన్ (3-/72) సత్తా చాటడంతో సోమవారం ముగిసిన రెండో టెస్టులో ఇండియా 106 రన్స్ తేడాతో ఇంగ్లండ్‌ను ఓడించింది. తొలి టెస్టు ఓటమికి ప్రతీకారం తీర్చుకొని లెక్క సరి చేసింది. 399 టార్గెట్ ఛేజింగ్‌లో ఓవర్‌నైట్ స్కోరు 67/1తో నాలుగో రోజు ఆట కొనసాగించిన ఇంగ్లండ్ 292 రన్స్‌కే ఆలౌటై ఓడింది.
స్టోక్స్‌సేన స్టార్టింగ్ నుంచే దూకుడుగా ఆడినప్పటికీ రెండు సెషన్లలో తొమ్మిది వికెట్లు పడగొట్టిన హోమ్‌టీమ్ ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను 1-–1తో సమం చేసింది. ఓపెనర్ జాక్ క్రాలీ (73) ఫిఫ్టీతో రాణించాడు. బుమ్రా, అశ్విన్‌కు తోడు అక్షర్, కుల్దీప్ కూడా చెరో వికెట్ పడగొట్టి ఇండియాను గెలిపించారు. తొలి ఇన్నింగ్స్‌లో ఇండియా 396, ఇంగ్లండ్ 253 రన్స్ చేయగా.. రెండో ఇన్నింగ్స్‌లో రోహిత్‌సేన 255 స్కోరు చేసింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి తొమ్మిది వికెట్లు పడగొట్టిన బుమ్రాకు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇరు జట్ల మధ్య మూడో టెస్టు ఈ నెల 15 నుంచి రాజ్‌కోట్‌లో జరుగుతుంది.
అటు పరుగులు.. ఇటు వికెట్లు
చేతిలో తొమ్మిది వికెట్లు ఉండగా ఇంకో 332 రన్స్ కోసం నాలుగో రోజు ఛేజ్ కొనసాగించిన ఇంగ్లండ్ దూకుడుగా ఆడింది. కానీ, వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టిన ఇండియా బౌలర్లు వారి జోరును అడ్డుకున్నారు. ఓవర్‌నైట్ బ్యాటర్ రెహాన్ అహ్మద్ (23) తన తొలి బాల్‌నే స్టాండ్స్‌కు పంపేందుకు ట్రై చేశాడు. అక్షర్ బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లు కొట్టాడు. కానీ, ఓ స్ట్రెయిట్ బాల్‌తో అతడిని ఎల్బీ చేసిన అక్షర్ ఇండియాకు బ్రేక్ ఇచ్చాడు. మరో ఎండ్‌లో క్రాలీ బౌండ్రీలతో జోరు చూపెట్టాడు. బుమ్రా బౌలింగ్‌లో అద్భుతమైన కవర్ డ్రైవ్ కొట్టాడు.
తొలి మ్యాచ్ హీరో ఒలీ పోప్ (23) కూడా ఉన్నంతసేపు వన్డే స్టయిల్లో బ్యాటింగ్ చేశాడు. అక్షర్ బౌలింగ్‌లో స్వీప్, ఫ్లిక్ షాట్లతో పాటు క్రీజు దాటొచ్చి మూడు బౌండ్రీలు బాదాడు. అయితే, అశ్విన్ ఎక్స్‌ట్రా బౌన్స్‌తో వేసిన బాల్‌తో అతని బ్యాట్ నుంచి ఎడ్జ్ రాబట్టగా... స్లిప్‌లో రోహిత్ వేగంగా స్పందించి క్యాచ్ అందుకున్నాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన సీనియర్ బ్యాటర్ జో రూట్ (16) తన తొలి మూడు బాల్స్‌లో రివర్స్ స్వీప్ షాట్లతో రెండు బౌండ్రీలు కొట్టాడు. అక్షర్ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా సిక్స్‌తో ఫుల్ ఎటాక్ మోడ్‌లో కనిపించాడు.
అదే ఊపులో అశ్విన్ బౌలింగ్‌లో స్లాగ్ షాట్ ఆడబోయి సింపుల్ క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. అప్పటికే ఫిఫ్టీ పూర్తి చేసుకున్న క్రాలీ వెనక్కు తగ్గలేదు. బెయిర్ స్టో (26)తో కలిసి దాడిని కొనసాగించాడు. కానీ, లంచ్ ముంగిట క్రాలీని కుల్దీప్, బెయిర్‌స్టోను బుమ్రా ఎల్బీగా ఔట్ చేయడంతో ఇంగ్లండ్ 196/6తో తొలి సెషన్ ముగించింది. రెండో సెషన్‌లో కెప్టెన్ బెన్ స్టోక్స్ (11), కీపర్ ఫోక్స్ (36) ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. అయితే, అశ్విన్ బౌలింగ్‌లో శ్రేయస్ అయ్యర్ కొట్టిన డైరెక్ట్ త్రోకు స్టోక్స్ రనౌటయ్యాడు.
చేతిలో మరో మూడు వికెట్లే ఉండగా ఫోక్స్, టామ్ హార్ట్‌లీ (36) ఎటాకింగ్ బ్యాటింగ్‌తో ఎనిమిదో వికెట్‌కు 55 రన్స్ జోడించారు. దాంతో రోహిత్ మరోసారి బుమ్రాను బౌలింగ్‌కు దింపాడు. కెప్టెన్ నమ్మకాన్ని నిలబెట్టిన బుమ్రా ఓ స్లో ఆఫ్ కట్టర్‌తో ఫోక్స్‌ను రిటర్న్ క్యాచ్‌తో ఔట్ చేశాడు. ఆ వెంటనే ముకేశ్ ఓవర్లో షోయబ్ బషీర్ (0) కీపర్‌కు క్యాచ్ ఇవ్వగా.. రివర్స్ ఔట్ స్వింగర్‌తో హార్ట్‌లీని బౌల్డ్ చేసిన బుమ్రా రెండో సెషన్‌లోనే మ్యాచ్‌ను ముగించాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇండియా తొలి ఇన్నింగ్స్:396 ఆలౌట్; ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: 253 ఆలౌట్; ఇండియా రెండో ఇన్నింగ్స్: 255 ఆలౌట్ ; ఇంగ్లండ్ రెండో ఇన్నింగ్స్ (టార్గెట్: 399): 69.2 ఓవర్లలో 292 ఆలౌట్ (క్రాలీ 73, బుమ్రా 3/43, అశ్విన్ 3/72).