- ‘కోల్డ్ ప్లే’ ప్రదర్శనల సక్సెస్‌ను ప్రస్తావించిన ప్రధాని
భువనేశ్వర్: మన దేశంలో కాన్సర్ట్ లకు మంచి స్కోప్ ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ రంగంలో రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు ప్రైవేట్ కంపెనీలు పెట్టుబడులు పెట్టాలని పిలుపునిచ్చారు. కాన్సర్ట్ ఎకానమీకి మరింత బూస్ట్ ఇచ్చేందుకు అవసరమైన సౌలతులు కల్పించాలని సూచించారు. ఒడిశాలోని భువనేశ్వర్ లో జరుగుతున్న ‘ఉత్కర్ష్ ఒడిశా– మేకిన్ ఒడిశా కాన్ క్లేవ్’ ను మోదీ మంగళవారం ప్రారంభించి మాట్లాడారు.
ఈ సందర్భంగా బ్రిటిష్ రాక్ బ్యాండ్ ‘కోల్డ్ ప్లే’.. మన దేశంలో ఇచ్చిన ప్రదర్శనలను ప్రస్తావించారు. ‘‘ఇటీవల ముంబై, అహ్మదాబాద్ లో నిర్వహించిన కోల్డ్ ప్లే కాన్సర్ట్‌కు సంబంధించిన అద్భుతమైన ఫొటోలను మీరు చూసే ఉంటారు. లైవ్ కాన్సర్ట్‌లకు ఇండియాలో మంచి స్కోప్ ఉందని చెప్పడానికి ఆ ఫొటోలే నిదర్శనం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెద్ద పెద్ద ఆర్టిస్టులు.. ఇప్పుడు భారత్ వైపు ఆకర్షితులవుతున్నారు. గత పదేండ్లుగా లైవ్ ఈవెంట్స్‌కు ఆదరణ పెరుగుతున్నది.
సంగీతం, నృత్యం, కథలకు సంబంధించి మన దేశానికి ఘనమైన వారసత్వం ఉన్నది. ఇలాంటి దేశంలో కాన్సర్ట్‌లకు ఎక్కువ ఆదరణ లభిస్తుంది. ఈ రంగంలో పెట్టుబడులు పెడితే కాన్సర్ట్ ఎకానమీ మరింత వృద్ధి చెందుతుంది” అని చెప్పారు.
సప్లై, వాల్యూ చెయిన్ నిర్మించాలి..
మనం వెలికితీస్తున్న ముడి పదార్థాలకు మనమే మరింత వాల్యూ జోడించి వస్తువులను తయారు చేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. మనం ముడి పదార్థాలను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంటే, అవి వస్తువులను తయారు చేసి మనకు దిగుమతి చేస్తున్నాయని చెప్పారు. ఈ విధానాన్ని తాను అంగీకరించనని పేర్కొన్నారు.
‘‘కేవలం ముడి పదార్థాల ఎగుమతితో దేశాభివృద్ధి సాధ్యం కాదు. ముడి పదార్థాల ప్రాసెసింగ్ మన దగ్గరే జరగాలి. సప్లై, వాల్యూ చెయిన్ మనం నిర్మించుకోవాలి. ఈ బాధ్యత ప్రభుత్వంతో పాటు ఇండస్ట్రీపైనా ఉంది” అని మోదీ పేర్కొన్నారు.