ప్రపంచాన్ని విధానపరమైన సవాళ్లు వెంటాడుతున్న ఆందోళనకర పరిస్థితుల్లో భారతదేశం జీ20 కూటమి అధ్యక్ష పదవిని చేపట్టింది. ప్రపంచ వృద్ధి, వాణిజ్యం మందగించడం, అధిక ద్రవ్యోల్బణం, భౌగోళిక,- రాజకీయ ఉద్రిక్తతలు, రుణ ఒత్తిడి, వాతావరణ మార్పులు, ఇంకా తొలగిపోని మహమ్మారి పీడ లాంటి సవాళ్లను జీ20 దేశాలకు ప్రతికూలతలుగా ఉన్నాయి. ప్రపంచీకరణ అల్లికను అపకేంద్ర బలాలు దిగువకు లాగుతున్న తరుణంలో అంతర్జాతీయ విధాన సహకారాన్ని ప్రోత్సహించడంలో జీ20 ఎంతో కీలక పాత్ర పోషించాల్సి ఉంది. కొనుగోలు శక్తి సామ్యం(పీపీపీ) పరంగా భారతదేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంటే, మార్కెట్ఎక్స్ఛేంజి రేట్లపరంగా ఐదవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా కొనసాగుతున్నది. జీ20 కూటమి ప్రపంచ జీడీపీలో 3.6 శాతం, ‘పీపీపీ’ రీత్యా 8.2 శాతం వాటా కలిగి ఉంది.
జీ20 కూటమి దేశాలతో పోలిస్తే 2023లో భారత జీడీపీ వృద్ధి అత్యధిక స్థాయిలో 6.1 శాతంగా నమోదు కాగలదని ఐఎంఎఫ్ అంచనా వేసింది. ఈ నేపథ్యంలో ఐక్యత, పరస్పర సంధానం దృక్పథంతో బాధ్యతలు, ఆకాంక్షల మధ్య సమతూకం సాధించడం భారత జీ20 అధ్యక్ష ప్రాధమ్యాలలో భాగం. డిజిటల్ సాంకేతికతలో మన ప్రగతి, పురోగమిస్తున్న సాంకేతిక, ఆర్థిక, పర్యావరణ వ్యవస్థ నుంచి పొందిన అనుభవాలతో ఆర్థిక సార్వజనీనత విస్తరణ, ఉత్పాదకత -ఆర్థిక ఏకీకరణ కోసం సాంకేతికత సద్వినియోగం, వాతావరణ మార్పుల ప్రభావాల తగ్గింపుపై ప్రగతిశీల దేశాల సవాళ్లను ఎదుర్కోవడంలో మనల్ని విశిష్ట స్థానంలో నిలిపాయి. అందువల్ల ఈ రంగాల్లో భారత అధ్యక్ష పదవి గణనీయ పాత్ర పోషించగలదని మేం విశ్వసిస్తున్నాం.
డిజిటల్ కరెన్సీ జాగ్రత్తలు
జీ20లోని చాలా దేశాలు వాటి నికర శూన్య ఉద్గార లక్ష్యాలకు గడువు ప్రకటించిన కారణంగా వాతావరణ కార్యాచరణ కోసం సకాలంలో, సముచిత ఆర్థిక వనరుల సమీకరణ కోసం కూడా కృషి చేయాల్సిన అవసరం ఉన్నది. అంతర్జాతీయ పన్ను వ్యవస్థ విషయంలో పన్ను సవాళ్ల పరిష్కారం, సామర్థ్యం పెంపొందించడం, పన్ను పారదర్శకత పెంపు సహా జీ20 సాధించిన గణనీయ పురోగతిని ముందుకు తీసుకెళ్తాం. అలాగే మహమ్మారితో ముడిపడిన ముప్పులు, దుర్బలత్వాల గుర్తింపు -పరిష్కారం సహా కొత్త చిక్కులపై స్పందనాత్మక సంసిద్ధత మెరుగు కోసం జీ20 చోదిత ఆర్థిక- ఆరోగ్య సమన్వయ విస్తరణను కొనసాగిస్తం. ఆర్థిక రంగం నియంత్రణకు సంబంధించి సాంకేతిక పరిణామాలతో కలిసి వచ్చే అవకాశాలు, ముప్పులపై మేము దృష్టి సారిస్తాం. క్రిప్టో (డిజిటల్ కరెన్సీ) మార్కెట్లలో పునరావృతమయ్యే గందరగోళం, కొన్నిటి విలువ తగ్గి, మార్కెట్లు విస్తృత పతనం కావడం వంటివి క్రిప్టో కరెన్సీల ఆర్థిక స్థిరత్వంపై ఆందోళనలు, ముప్పులకు దారితీశాయి. కాబట్టి వివిధ అంతర్జాతీయ సంస్థల కృషిని సంశ్లేషించడం ద్వారా ద్రవ్య విధానం, స్థూల ఆర్థిక సమస్యలు, డేటా గోప్యత, మార్కెట్ సమగ్రత, పోటీ విధానం, పన్ను వ్యవస్థ వంటి అంశాల పరిష్కారం ద్వారా జీ20 క్రిప్టో -సంపదపై చర్చను విస్తృతం చేయాల్సిన అవసరం ఉంది. వేగంగా విస్తరిస్తున్న డిజిటల్ ఆర్థిక సేవలు, మూడో పక్షం సేవలపై ఆధారపడే అవసరం పెరగడం తదితరాలు ఆర్థిక వ్యవస్థ కార్యాచరణ, ద్రవ్యత, సాంద్రత వంటి ప్రమాదాలకు గురిచేస్తున్నాయి.
ఇలాంటి చట్రాల్లో అంతర్జాతీయ సహకారాన్ని ప్రోత్సహించేందుకు మేము ప్రయత్నిస్తాం. ఆర్థిక వ్యవస్థ డిజిటలీకరణ ముమ్మరమైన నేపథ్యంలో సైబర్ ముప్పు ఆర్థిక వ్యవస్థకు చేటు తేగలదు. ఈ చైన్‌లో ఎక్కడైనా అంతరాయం ఏర్పడితే మొత్తం ఆర్థిక వ్యవస్థపై దుష్ప్రభావం పడేవిధంగా బహుళ ప్రభావాలకు దారితీయవచ్చు. ఒక గొలుసు ఎంత బలమైనదో అందులోని లంకెల తరహాలో అంతే బలహీనమైనది కూడా. అందుకే జీ20కి మన అధ్యక్షత కాలంలో సైబర్ ముప్పు తప్పించడం, వ్యవస్థల స్థాయి దుర్బలత్వాల తగ్గింపులో ప్రపంచ సహకారం పెరగాలని కూడా మేము ఆకాంక్షిస్తున్నాం.
ప్రపంచం ఆశలకు కొత్త ఊపిరి..
వలస పౌరుల నగదు బదిలీ లావాదేవీలపై వ్యయాన్ని 2030 నాటికి 3 శాతం కన్నా దిగువకు తగ్గించే సుస్థిర ప్రగతి లక్ష్యం(ఎస్‌డీజీ) సాధనకు తోడ్పాటు మా ప్రాధమ్యాలలో ఒకటిగా ఉంది. ఈ దిశగా జాతీయ సత్వర చెల్లింపు వ్యవస్థల పరస్పర చర్యల ద్వారా లావాదేవీల అధిక వ్యయం తగ్గింపు సహా చెల్లింపుల మూలం -గమ్యం మధ్య పరిష్కార సమయం తగ్గించడం కూడా మేం అనుసరించాల్సిన మరో మార్గం. అలాగే ఆర్థిక సార్వజనీనతను ముందుకు నడిపేందుకు ఉత్పాదకత ఫలితాలను అందుకోవటానికి వీలుగా ప్రభుత్వ డిజిటల్‌ల మౌలిక వసతులను సద్వినియోగం చేసుకుంటాం. పటిష్ట, శక్తిమంతమైన డిజిటల్ ఆర్థిక పర్యావరణ వ్యవస్థ రూపకల్పనకు నిర్మాణాత్మక, ఆచరణాత్మక విధాన సిఫారసులు ఆర్థికాభివృద్ధికి తోడ్పడటంతోపాటు ఈ లక్ష్యాలను సాధనకు దోహదం చేస్తాయి.
ఈ వాతావరణం నడుమ అంతర్జాతీయ సమస్యల పరిష్కారానికి అంతర్జాతీయ సమన్వయంతోనే పరిష్కారం అన్వేషించాలన్న ఉద్దేశంతో ఆవిర్భవించిన జీ20. ఆ సూత్రానికి అనుగుణంగా తన కృషిని కొనసాగిస్తుంది. ఈ మేరకు సుస్థిర, సమ్మిళిత వృద్ధిపై తన కర్తవ్య నిర్వహణలో భాగంగా ప్రధాన ఆర్థిక వ్యవస్థలను ఒకే వేదికపైకి తేవడం ద్వారా ప్రపంచం ఆశలకు కొత్త ఊపిరులూదుతుంది. ప్రతి సంక్షోభం ఒక అవకాశమే కాబట్టి, కొత్త సవాళ్లను ఎదుర్కోవడానికి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు గల అనేక గ్యాప్‌లను పూడ్చటానికి, జీ20 బాధ్యతను నెరవేర్చే క్రమంలో ప్రపంచ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టే దిశగా ప్రపంచ విధాన సహకార పునరుద్ధరణకు సిద్ధమవ్వాల్సిందే. ఆ మేరకు ‘వసుదైక కుటుంబం’ నినాదంపైనే సమాన, సార్వజనీన మానవ పురోగమనం ఆధారపడి ఉంటుంది.
బెంగళూరులో ఎఫ్ సీబీడీల సమావేశం
భారత జీ20 అధ్యక్షతకు సంబంధించి తొలి ద్రవ్య సమీక్ష(ఎఫ్‌టి) కార్యక్రమం కింద ఆర్థిక రంగ, కేంద్ర బ్యాంకుల డిప్యూటీ(ఎఫ్‌సీబీడీ)ల సమావేశం బెంగళూరులో 2022 డిసెంబరు 13 నుంచి-15 తేదీల్లో జరుగుతుంది. ఈ సందర్భంగా భారత ప్రాధమ్యాలు, వాటితో ముడిపడిన కార్యాచరణ క్రమం మొదలుకాబోతున్నది. ఈ ‘ఎఫ్‌టి’లో అంతర్జాతీయ ద్రవ్య నిర్మాణం, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, మౌలిక సదుపాయాల పెట్టుబడులు, సుస్థిర ఆర్థిక సాయం, అంతర్జాతీయ పన్ను వ్యవస్థ, ఆరోగ్య -ఆర్థిక, ద్రవ్య రంగాల నియంత్రణ అంశాలు, ఆర్థిక సార్వజనీనతలపై దృష్టి సారించే 8 రకాల సముదాయక కార్యాచరణ భాగంగా ఉంటుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జీ20 అధ్యక్ష బాధ్యతను స్వీకరిస్తూ- “జీ20 కూటమి భాగస్వాములతో మాత్రమేగాక దక్షిణార్థ గోళంలో తమ గళం వినిపించలేని, మాతో అడుగు కలిపి నడిచే దేశాలతో సంప్రదింపుల ద్వారా భారత జీ20 అధ్యక్ష ప్రాధమ్యాలకు రూపమిస్తాం” అని ప్రకటించారు. భారతదేశపు కీలక ‘ఎఫ్‌టి’ ప్రాధమ్యాలు కూడా ఆయన ప్రకటించిన నిబద్ధతను ఆచరణాత్మకం చేసేవిగా ఉంటాయి. ఈ మేరకు అంతర్జాతీయ ఆర్థిక భద్రత వ్యవస్థలు, ప్రపంచ రుణ దుర్బలత నిర్వహణ, ఆహారం-, ఇంధన అభద్రతలోని స్థూల, ఆర్థికపరమైన చిక్కులపై అంచనా, సుస్థిర భవిష్యత్ నగరాలకు ఆర్థిక సాయం తదితరాలు ఇందులో భాగమవుతాయి.
- అజయ్ సేథ్, కార్యదర్శి, కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ
- డా. మైకేల్ దేవవ్రత పాత్ర, డిప్యూటీ గవర్నర్, ఆర్బీఐ