గతంలో ప్రపంచంలో ఎప్పుడైనా, ఎక్కడైనా ఉద్రిక్తతలు, భూకంపాలు, సంక్షోభాలు, అంతర్యుద్ధాలు జరిగినా ప్రధాని నరేంద్ర మోడీ సదా ఆపన్నహస్తం అందిస్తూనే ఉన్నారు. ఒకప్పుడు భారతదేశంలో ఏ విపత్తు సంభవించినా ఇతర దేశాల ఆపన్నహస్తం కోసం ఎదురు చూపులు చూసేవాళ్ళం. కానీ నేడు ప్రపంచంలోనే భారత్ ఒక గొప్ప శక్తిగా అవతరించి భారత్ ఆపన్న హస్తం కోసం నేడు ప్రపంచం ఎదురుచూస్తుండటం పెద్దన్న దిశగా భారత్ ముందుకు వెళ్లడం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ విషయం.
ఆపరేషన్ కావేరీ
గడిచిన వారం నుంచి ఆఫ్రికా దేశమైన సూడాన్‌లో సైన్యం, పారామిటలరీ మధ్య భీకర యుద్ధం జరుగుతోంది. ఈ అల్లర్లలో ప్రజలు భయాందోళనకు గురవుతూ బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. ఆధిపత్యం కోసం జరుగుతున్న పోరులో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తినటానికి తిండే కాదు తాగటానికి గుక్కెడు నీరు కూడా దొరకటంలేదు. ఎటు నుంచి ఏ బాంబు వచ్చి మీద పడుతుందో..ఏ తూటా ఎటు నుంచి దూసుకొచ్చి ప్రాణాలు తీస్తుందోననే భయంతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని బ్రతుకుతున్నారు. ఇందులో సుమారు 3వేల మంది భారతీయులు ఈ అంతర్యుద్ధంలో చిక్కుకున్నారు. ఆ దేశంలో ప్రతికూల పరిస్థితులు నెలకొన్న ఈ నేపథ్యంలో సూడాన్‌లో చిక్కుకుపోయిన భారత పౌరులను రక్షించేందుకు కేంద్రం ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికగా ‘ఆపరేషన్ కావేరీ’ని ప్రారంభించి భారత పౌరులను ఇండియాకు తరలిస్తున్నారు. దానిలో భాగంగా.. ఇప్పటివరకు 670 మంది భారతీయులను స్వదేశానికి తరలించారు. మిగతా వారిని కూడా క్షేమంగా భారతదేశానికి తరలించడానికి నిరంతరాయంగా కృషిచేస్తుంది. సహాయక చర్యల కోసం రెండు సీ-130 వాయుసేన విమానాలు, మూడు నావికాదళ నౌకలు .. ఐఎన్ఎస్ సుమేధ, ఐఎన్ఎస్ తేగ్, ఐఎన్ఎస్ తర్కష్‌ను ఉపయోగిస్తున్నారు. యుద్ధ సమయంలో డీజిల్,పెట్రోల్ కొరత సహా తరలింపు ప్రక్రియలో అనేక సవాళ్లు ఎదురవుతున్నాయి. అయినప్పటికీ భారతీయుల కోసం ఖార్తుం నుంచి బస్సులు ఏర్పాటు చేశారు. ఖార్తుం నుంచి పోర్ట్ సూడాన్ కు, అక్కడి నుంచి జెడ్డాకు, అక్కడి నుంచి భారత్ కు.. ఇలా తరలింపు ప్రక్రియ సాగుతోంది.
ఆపరేషన్ దోస్త్
‘మానవ సేవయే, మాధవ సేవ’ అనే నినాదాన్ని స్ఫూర్తిదాయకంగా మోడీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనేక పర్యాయాలు ఆపరేషన్ల ద్వారా భారతీయులు ఏ విపత్తులో చిక్కుకున్నా వారిని సురక్షితంగా స్వదేశానికి తీసుకు రావడం జరిగింది. గతంలో ప్రకృతి ప్రకోపానికి టర్కీ, సిరియాలు అతలాకుతలమయ్యాయి. దాదాపు 40 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాది భవనాలు కూలిపోయి లక్షలాది మంది నిరాశ్రయులయ్యారు. భూకంపం కుదిపేసిన సమయంలో రిక్తహస్తాలతో సహాయం కోసం ఎదురుచూస్తున్న టర్కీ, సిరియా ప్రజలకు మేము ఉన్నాము అంటూ మొట్టమొదట స్పందించింది భారత్. భూకంప బాధితులకు సహాయక చర్యలు అందించేందుకు మోడీ ‘ఆపరేషన్ దోస్త్’ నూ ప్రారంభించి మానవతా దృక్పథంతో అనేకమంది ప్రాణాలను రక్షించారు. అత్యంత క్లిష్టమైన ఈ ఆపరేషన్ కోసం152 మంది సభ్యులతో కూడిన ముగ్గురు నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ బృందాలు, ఆరు శునకాలు భూకంప ప్రభావిత ప్రాంతానికి వెళ్లాయి. 99 మందితో కూడిన వైద్య బృందం హటేలోని ఇస్కెండరున్ లో 30 పడకల ఆసుపత్రిని ప్రారంభించారు.
వసుదైక కుటుంబం భావనతో
వసుదైక కుటుంబం భావనతో విశ్వ గురువుగా భారత ప్రభుత్వం ‘వ్యాక్సిన్ మైత్రి’ పేరుతో ప్రపంచ దేశాలకు భారీ సంఖ్యలో వాక్సిన్ డోసులతో పాటు, మందులు, వైద్య పరికరాలను అందించింది. 150 దేశాలకు కరోనా సంబంధిత వైద్య, ఇతర సహాయ సహకారాలు భారత ప్రభుత్వం అందించింది. ‘వందే భారత్ మిషన్’ ద్వారా పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం ప్రపంచంలోనే అతి పెద్దది. 2018లో భారీ భూకంపం, సునామీ ధాటికి సర్వంకోల్పోయిన ఇండోనేసియా ప్రజల కోసం భారత్ ఆపరేషన్ సముద్ర మైత్రి పేరుతో ఆపన్నహస్తం అందించింది. 2020లో తుఫాను కారణంగా ప్రభావితమైన మడగాస్కర్కు సహాయం చేయడానికి భారత నావికాదళం ‘ఆపరేషన్ వనిల్లా’ ను ప్రారంభించింది. నేపాల్ భూకంపాలతో పాటు మాల్దీవ్స్‌కు చేయూతనివ్వడానికి తొలుత ముందుకొచ్చింది ఇండియానే. 2019 కొలంబోలో జరిగిన బాంబు పేలుళ్లలో అనేక మంది తమ ప్రాణాలు కోల్పోయినపుడు శ్రీలంక ప్రజలకు భారత్ అండగా నిలిచింది.
ఒక భూమి, ఒక కుటుంబం భారతీయ భావన
శతాబ్దానికి ఒకసారి ప్రపంచవ్యాప్తంగా విపత్తులు, మహమ్మారులు తలెత్తి భయానక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో, విశ్వమానవాళిలో నిరాశ, నిస్పృహ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నా వారు, పరాయి వారు అనే భేదం లేకుండా.. అందరూ మనవారే అనుకునే ఉదార ప్రవర్తన కలవారికి ఈ ప్రపంచమే ఒక కుటుంబంలా కనిపిస్తుంది. ఇదే..వసుదైవ కుటుంబం అనే సూక్తి. ప్రపంచమంతా ఒకే కుటుంబం అనే భారతీయ భావనకు ప్రధాని నరేంద్ర మోడీ మరోసారి పెద్ద పీట వేశారు. ఈ ఏడాది భారత్ లో జరగబోయే జీ-20 సదస్సు కోసం.. ‘ఒక భూమి, ఒక కుటుంబం, ఒక భవిష్యత్తు’ అనే మంత్రం ప్రపంచ సంక్షేమానికి మార్గం సుగమం చేస్తుంది. ఇది 130 కోట్ల మంది భారతీయులకు గర్వకారణం వసుదైక కుటుంబం భావనకు ప్రతిబింబం.
ఆపరేషన్ గంగా
దేశం కాని దేశం.. ఒక వైపు బాంబులు, మరోవైపు మిసైల్ మోత ఎటు వెళ్తే ఏమి జరుగుతుందోనన్న భయంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నప్పుడు అగ్రరాజ్యాలు, మిగిలిన దేశాలు ఉక్రెయిన్లో ప్రతికూలంగా పరిస్థితుల దృష్ట్యా తమ పౌరులను తరలించే కార్యక్రమాన్ని నిలిపివేశాయి. కానీ, భారతీయ విద్యార్థుల పరిస్థితి గమనించిన ప్రధాని నరేంద్ర మోడీ ‘ఆపరేషన్ గంగా’ పేరుతో విపత్కర సమయంలో, భయం లేదు మేమున్నాం అంటూ భరోసా ఇచ్చి దేశ పౌరులను సురక్షితంగా స్వదేశానికి తీసుకొని వచ్చారు. నేడు అదే స్ఫూర్తితో ప్రపంచంలో ఏ విపత్తు వచ్చినా త్రివర్ణ పతాకంతో భారత సహాయక బృందాలు రాగానే పరిస్థితి చక్కబడగలదన్న భరోసా ఆపన్నులలో కలుగుతుంది. యావత్తు ప్రపంచం కరోనాతో విలవిలలాడుతున్న వేళ భారత్ ప్రపంచ దేశాలకు ఆపన్నహస్తం అందించి గొప్ప మనసును చాటుకున్నది.
- డా. కె. లక్ష్మణ్,రాజ్యసభ సభ్యులు,బీజేపీ ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు