మాన్యుఫ్యాక్చరింగ్​లో మనమే పవర్ హౌస్

మాన్యుఫ్యాక్చరింగ్​లో మనమే పవర్ హౌస్
  • అన్ని రంగాల్లో ఎగుమతులు పెరిగినయ్: మోదీ 
  • మేకిన్ ఇండియా సూపర్ సక్సెస్
  • ఈ పండుగలకు మన ఉత్పత్తులనే కొనాలని ప్రజలకు పిలుపు

న్యూఢిల్లీ: మాన్యుఫ్యాక్చరింగ్ సెక్టార్ లో మన దేశం పవర్ హౌస్ గా మారిందని ప్రధాని మోదీ అన్నారు. ఆటోమొబైల్, టెక్స్ టైల్, ఏవియేషన్, ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్.. ఇలా ఏ రంగం తీసుకున్నా ఏటేటా ఎగుమతులు పెరుగుతున్నాయని చెప్పారు. ఇదంతా దేశంలో ఉన్న యువ శక్తితోనే సాధ్యమైందని, ఇప్పుడు ప్రపంచమంతా మనవైపే చూస్తున్నదని తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ ప్రోగ్రామ్ లో మోదీ మాట్లాడారు. ‘మేకిన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రారంభించి పదేండ్లు పూర్తయిన సందర్భంగా దాని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

‘‘మేకిన్ ఇండియా క్యాంపెయిన్ సూపర్ సక్సెస్ అయింది. దీని వల్ల పేదలు, మధ్య తరగతి ప్రజలు లబ్ధి పొందుతున్నారు. ఎంఎస్ఎంఈలకూ మేలు జరుగుతున్నది. మేకిన్ ఇండియా సక్సెస్ లో చిరు వ్యాపారుల నుంచి పెద్ద పరిశ్రమల వరకు పాత్ర ఉన్నది” అని పేర్కొన్నారు. ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్ మెంట్స్ (ఎఫ్ డీఐ) క్రమంగా పెరుగుతున్నాయని, మేకిన్ ఇండియా సక్సెస్ కు ఇదే నిదర్శనమని అన్నారు. ఈ పండుగల సీజన్ లో మన దేశంలో తయారైన ఉత్పత్తులనే కొనుగోలు చేయాలని ప్రజలకు పిలుపునిచ్చారు. కాగా, నీటి సంరక్షణ ప్రాముఖ్యాన్ని మోదీ ప్రస్తావించారు.

ఇది ఎమోషనల్ ఎపిసోడ్.. 

ఈ ఎపిసోడ్ తనకెంతో ప్రత్యేకమైనదని ప్రధాని మోదీ ఎమోషనల్ అయ్యారు. ‘‘మన్ కీ బాత్ ప్రోగ్రామ్ ప్రారంభించి పదేండ్లు పూర్తవుతున్నది. ఇది పదేండ్ల కింద అక్టోబర్ 3న (దసరా) ప్రారంభమైంది. ఈ ఏడాది నవరాత్రుల మొదటి రోజు (అక్టోబర్ 3)తో పదేండ్లు పూర్తవుతుంది. ఈ జర్నీని నేను ఎప్పటికీ మరిచిపోలేను. శ్రోతలే ఈ కార్యక్రమానికి యాంకర్లు. నేను చెప్పేది వింటూ కోట్లాది మంది నన్ను ప్రోత్సహించారు. దేశం నలుమూలల్లోని సమాచారాన్ని వాళ్లే నాకు అందించారు” అని చెప్పారు. ‘‘సాధారణంగా మసాలా లేని కంటెంట్​ను ప్రజలు పట్టించుకోరనే అభిప్రాయం సమాజంలో ఉంది. కానీ ఆ అభిప్రాయాన్ని ‘మన్ కీ బాత్’ మార్చేసింది” అని పేర్కొన్నారు.