ఇండియాకు గుడ్​ చాన్స్‌.. ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్లు మంచి రిథమ్‌‌లో ఉన్నారు

ఇండియాకు గుడ్​ చాన్స్‌.. ఐపీఎల్‌‌లో ఆడిన ప్లేయర్లు మంచి రిథమ్‌‌లో ఉన్నారు

ఆసీస్‌‌పై అన్ని ఫార్మాట్లలో గెలిచేందుకు సువర్ణావకాశం

ఫాస్ట్‌‌ బౌలర్లను కాపాడుకోవడం ముఖ్యం

ఆసీస్‌‌ టూర్‌‌పై వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియాతో పోరు అనగానే ఎక్కడాలేని ఉత్సాహంతో చెలరేగిన ఆటగాడు వీవీఎస్‌‌ లక్ష్మణ్‌‌. ఇండియాలో ఆడినా.. ఆసీస్‌‌ గడ్డపై పోటీ పడ్డా తన బ్యాటింగ్‌‌ పవర్‌‌తో ప్రత్యర్థిని కంగారు పెట్టిన మొనగాడు ఈ హైదరాబాదీ.   తన కెరీర్‌‌లో ఆసీస్‌‌పై తిరుగులేని ఆధిపత్యం చెలాయించిన ఈ లెజెండరీ క్రికెటర్‌‌.. విరాట్‌‌ కోహ్లీ కెప్టెన్సీలోని టీమిండియా  కంగారూల గడ్డపై మరోసారి అదరగొడుతుందని అంటున్నాడు.  ఈ టూర్‌‌లో అన్ని ఫార్మాట్లలోనూ ఆసీస్‌‌ను ఓడించేందుకు ఇండియాకు మంచి చాన్స్‌‌ ఉందని చెబుతున్నాడు. కెప్టెన్‌‌ కోహ్లీ చివరి మూడు టెస్టులకు దూరమైనా.. అతని ప్లేస్‌‌ను భర్తీ చేసే టాలెంటెడ్‌‌ ప్లేయర్లు టీమ్‌‌లో చాలా మందే ఉన్నారని చెప్పాడు. రెండున్నర నెలల లాంగ్‌‌ టూర్‌‌లో ఇండియా అవకాశాల గురించి, జట్టు గురించి వీవీఎస్‌‌ మాట్లాడాడు. ఆ వివరాలు అతని మాటల్లోనే..

గోల్డెన్​ చాన్స్​..

ఆస్ట్రేలియా టూర్‌‌లో  అన్ని ఫార్మాట్ల సిరీస్‌‌ల్లో నెగ్గేందుకు  ఇండియాకు మంచి చాన్స్ ఉందని భావిస్తున్నా.  ఈ టూర్‌‌  వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌తో ప్రారంభం కావడం సానుకూలాంశం. అలాగే, ఐపీఎల్‌‌లో ఆడిన మన ప్లేయర్లంతా మంచి రిథమ్‌‌లో ఉన్నారు.  నేను ఆడే రోజుల్లో విదేశాలకు వెళ్లినప్పుడు  వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌తో టూర్‌‌ మొదలైతే బాగుంటుందని అనుకునేవాళ్లం. అక్కడి వాతావరణానికి, పరిస్థితులకు అలవాటు పడేందుకు అది యూజ్‌‌ అవుతుంది. టెస్టు మ్యాచ్‌‌తో పోలిస్తే  వైట్‌‌ బాల్‌‌ క్రికెట్‌‌ కండిషన్స్‌‌ అంతగా ఇబ్బంది పెట్టవు. కాబట్టి టెస్టులు మొదలయ్యే టైమ్‌‌కు ప్లేయర్లంతా  పిచ్‌‌, గ్రౌండ్‌‌, వెథర్‌‌ ఇలా అన్నింటికీ అలవాటు పడతారు. అదే నేరుగా టెస్టులతో పోటీ మొదలు పెడితే.. తొలి మ్యాచ్‌‌లోనే అక్కడి కండిషన్స్‌‌ ఇబ్బంది పెడుతాయి.

కోహ్లీ అద్భుతమైన కెప్టెన్‌‌

ఆసీస్‌‌తో చివరి మూడు టెస్టులకు కోహ్లీ దూరం కావడం జట్టుకు లోటే. విరాట్‌‌ అద్భుతమైన కెప్టెన్‌‌.  అతను లేకపోవడం జట్టుపై కచ్చితంగా ప్రభావం చూపుతుంది. అదే సమయంలో మరో యంగ్‌‌స్టర్‌‌కు తన టాలెంట్‌‌ను ప్రూవ్‌‌ చేసుకునే చాన్స్‌‌ లభించనుంది. దీన్ని యూజ్‌‌ చేసుకుంటే టీమ్‌‌కు అతను హీరో కాగలడు. ఎందుకంటే ఇంగ్లండ్‌‌, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా లాంటి ప్లేస్‌‌ల్లో  పెర్ఫామ్‌‌ చేస్తే ఆ ప్లేయర్‌‌కు కచ్చితంగా మంచి పేరు వస్తుంది. చివరి మూడు టెస్టుల్లో కోహ్లీ ప్లేస్‌‌ను భర్తీ చేసేందుకు టీమ్‌‌లో చాలా మంది ప్లేయర్లున్నారు.

వాళ్లకు వర్క్‌‌లోడ్‌‌  సమస్యే కాదు

కోహ్లీ, కేఎల్‌‌ రాహుల్‌‌, జడేజా, బుమ్రా, సైనీ ఇలా మంది ప్లేయర్లు అన్ని ఫార్మాట్స్‌‌ ఆడుతున్నారు. అందువల్ల వారి వర్క్‌‌లోడ్‌‌పై చర్చ జరుగుతోంది. అయితే, బ్యాట్స్‌‌మెన్‌‌, స్పిన్నర్ల  విషయంలో వర్క్‌‌లోడ్‌‌ అనేది పెద్ద సమస్యే కాదు. కానీ, ఫాస్ట్‌‌ బౌలర్లను మాత్రం ఫ్రెష్‌‌గా ఉంచేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. లాస్ట్‌‌ టైమ్‌‌  మన ఫాస్ట్‌‌ బౌలర్లు ఆస్ట్రేలియా బ్యాట్స్‌‌మెన్‌‌పై పైచేయి సాధించడం వల్లే సిరీస్‌‌ గెలిచాం. కాబట్టి వాళ్ల వర్క్‌‌లోడ్‌‌, ఫిట్‌‌నెస్‌‌ను మానిటర్‌‌ చేయడం చాలా ముఖ్యం. ఈ సారి అన్ని ఫార్మాట్లు గెలవాలన్నదే ఇండియా టార్గెట్‌‌. అది సాధ్యం కావాలంటే మన  బెస్ట్‌‌ టీమ్‌‌ను బరిలోకి దింపాలి.

పిచ్‌‌లకు అలవాటు పడితే చాలు

నా ఎక్స్‌‌పీరియన్స్‌‌ ప్రకారం టెస్టు క్రికెట్‌‌ ఆడేందుకు బెస్ట్‌‌ ప్లేసెస్‌‌లో ఆస్ట్రేలియా కూడా ఒకటి. అయితే, కరోనా నేపథ్యంలో  ఈ సారి పరిస్థితులు మొత్తం డిఫరెంట్‌‌గా ఉన్నాయి. కానీ, ఒక్కసారి అక్కడి పిచ్‌‌లకు అలవాటు పడితే  ఒక బ్యాట్స్‌‌మన్‌‌గా నీ  షాట్స్‌‌కు నువ్వు వ్యాల్యూ ఇస్తావు. పిచ్‌‌ నుంచి లభించే పేస్‌‌,  బౌన్స్‌‌పై నమ్మకం ఉంచి  నేచురల్‌‌ గేమ్‌‌ ఆడతావు. అయితే, ఆసీస్‌‌ టీమ్‌‌ను వారి గడ్డపై ఓడించాలంటే నీ బెస్ట్‌‌ ఇవ్వాల్సి ఉంటుంది. పాజిటివ్‌‌ మైండ్‌‌సెట్‌‌తో ఉండాలి.  ఆసీస్‌‌లో ఆట ఎప్పుడూ సులభం కాదు. కాబట్టి మెంటల్లీ టఫ్‌‌గా పాజిటివ్‌‌గా ఉండాలి. క్రితం సారి ఇండియా అదే పని చేసింది.

ఇంత పోటీ మంచిదే

టీమిండియాలో ఇప్పుడు పోటీ పెరిగింది.  టీమ్‌‌లో ప్లేస్‌‌ కోసం చాలా మంది పోటీ పడడం మంచి విషయం.  మూడు  ఫార్మాట్లకూ  అంత మంది ప్రతిభావంతులు అందుబాటులో ఉండ డం మన అదృష్టం. అన్ని ఫార్మాట్లలోనూ బ్యాలెన్స్‌‌, కంపోజిషన్‌‌, కాంపిటీషిన్‌‌ ఎక్స్‌‌లెంట్‌‌గా ఉంది. అన్ని డిపార్ట్‌‌మెంట్లూ బలంగా ఉన్నాయి.

బబుల్‌‌లో ఉండడం చాలెంజే

కరోనా నేపథ్యంలో ప్లేయర్లంతా బయో బబుల్‌‌లో కట్టడి అవుతున్నారు. ఒక బబుల్‌‌ నుంచి మరోదానిలోకి వెళ్లడం కచ్చితంగా సవాలే. అయితే,  మొన్నటి ఐపీఎల్‌‌లో సెక్యూర్‌‌ బబుల్‌‌లో ఉండడం ప్లేయర్ల అదృష్టం. ఎందుకంటే  మిగతా ప్రపంచం మొత్తం కరోనాతో ఇబ్బంది పడుతున్న టైమ్‌‌లో బబుల్‌‌ పరిమితుల్లో వాళ్లు స్వేచ్ఛగా తిరిగారు.  ఇంట్లో ఖాళీగా కూర్చోవడం కంటే తాము ప్రేమించే క్రికెట్‌‌ ఆడినందుకు ప్లేయర్లంతా లక్కీ. కాబట్టి మరో బబుల్‌‌కు అడ్జస్ట్‌‌ అయ్యే టైమ్‌‌లో సైకలాజికల్‌‌గా వాళ్లేమీ ఇబ్బంది పడరని అనుకుంటున్నా. అయితే,  ఇంత లాంగ్‌‌ టూర్‌‌లో  ముందుకెళ్తున్నప్పుడు.. ముఖ్యంగా మూడో టెస్టు (జనవరి7), నాలుగో టెస్టు (జనవరి 15) సమయంలో  కొంత ఇబ్బంది తప్పదు. ప్లేయర్లు అలసిపోకుండా ఫ్రెష్‌‌గా ఉండేందుకు కోచింగ్‌‌ స్టాఫ్‌‌ స్మార్ట్‌‌గా పని చేయాల్సి ఉంటుంది.

కోహ్లీ నిర్ణయాన్ని గౌరవించాలి

నాకు కూతురు పుట్టినప్పుడు నేను కొన్ని రంజీ మ్యాచ్‌‌లకు దూరమై నా భార్యకు తోడుగా ఉన్న విషయం బాగా గుర్తుంది. తొలిసారి తండ్రి కాబోతుండడం జీవితంలో చాలా ముఖ్యమైన అనుభూతి. ఇలాంటి అనుభూతిని ఆస్వాదించేందుకు పెటర్నిటీ లీవ్‌‌ తీసుకున్న  కోహ్లీ నిర్ణయాన్ని మనం గౌరవించాలి.