మన గ్రహానికి జీవ దాతగా ఆరాధించబడుతున్నాడు. భారతదేశం అపారమైన సౌర శక్తి సామర్థ్యాన్ని కలిగి ఉంది. సౌర శక్తి , గాలి లేదా శబ్ద కాలుష్యంలేని స్వచ్ఛమైన, నిశ్శబ్ద శక్తి వనరు. ఈ సౌరశక్తిని పూర్తిగా ప్రపంచ దేశాలన్నీ కూడా సమిష్టిగా కృషి చేసినట్లయితే, ప్రపంచ ఇంధనశక్తి కొరతను సునాయాసంగా అధిగమించవచ్చు. సూర్యుని అన్‌టాప్డ్ పొటెన్షియల్ అందరికీ తెలిసిందే.మానవాళి ఒక సంవత్సరంలో ఉపయోగించే శక్తి అంతా సూర్యుడి నుంచి భూమికి ఒక గంటలో చేరే శక్తికి సమానం.
సౌరశక్తి వినియోగానికి పిలుపు
భారీగా పెరిగిపోతున్న ప్రపంచ జనాభా ఒకవైపు ఆ జనాభా అవసరాలు తీర్చడానికి ఇంత పెద్ద ఎత్తున ఉన్న డిమాండ్‌కు తగినట్టుగా ఉత్పత్తిని పెంచడం కేవలం సంప్రదాయ పద్ధతుల ద్వారా వాడుతున్న, ఇంధన వనరులకు సాధ్యం కాదు. సంప్రదాయేతర ఇంధన శక్తులైన సౌరశక్తి, పవనశక్తి ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని గరిష్టం చేసుకోవలసిన బాధ్యత, నేడు ప్రపంచ దేశాల అన్నింటి పైన ఉంది. కానీ సౌర శక్తి ద్వారా విద్యుత్ తయారీకి అవసరమైన అవస్థాపన సౌకర్యాలు కానీ, నిధులు కూడా ఆశించిన స్థాయిలో నేటి వరకు జరగలేదు. కానీ అవసరాలను తీర్చుకునే క్రమంలో సురక్షితం కాని పద్ధతుల ద్వారా, పర్యావరణానికి విఘాతం కలిగించే వనరులను సైతం పెద్ద ఎత్తున ఉపయోగించడంతో పర్యావరణ అసమతుల్యత పెరిగింది. ప్రపంచంలో వేగంగా విస్తరిస్తున్న విద్యుత్ ఆధారిత వస్తువులు, సేవలతో భారీగా డిమాండు పెరుగుతూ వస్తుంది. దీనికి సహజ సిద్ధమైన 24 గంటలు అందుబాటులో ఉండే సౌర శక్తిని ప్రపంచ దేశాలన్నీ కూడా కలిసికట్టుగా ఉపయోగించుకోవాలని భారతదేశం పిలుపునిచ్చింది.
ప్రపంచం ప్రకృతి విలయాలతో అసాధారణ పరిస్థితులను ఎదుర్కొంటుంది. వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ (CO2) ను పెంచుతుంది. పునరుత్పాదక ఇంధనం వంటివి అవసరంగా మారాయి. ఎర్నెస్ట్ అండ్ యంగ్ (ఈవై) నివేదిక ప్రకారం, సమన్వయ కృషి కారణంగా, భారతదేశం ప్రస్తుతం 2021 పునరుత్పాదక ఇంధన దేశ ఆకర్షణీయ సూచికలో మూడవ స్థానంలో ఉంది. ప్రస్తుతం గణనీయంగా ఉన్న సోలార్ తయారీ సామర్థ్యం, పాలీసిలికాన్ సౌకర్యాలతో సహా ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో, భారతదేశం ప్రపంచంలోని అతిపెద్ద సోలార్ మాడ్యూల్ తయారీదారుల్లో ఒకటిగా ఉంది.
ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్
ప్రపంచవ్యాప్తంగా సరసమైన, విశ్వసనీయమైన, సురక్షితమైన విద్యుత్తును అందించడానికి అవసరమైన విద్యుత్ ఇంటర్ కనెక్టర్లు, ఛార్జింగ్ పాయింట్లు, ఫ్లెక్సిబుల్ గ్రిడ్లు వంటి కొత్త మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ (ఓఎస్ఓడబ్ల్యూఓజీ) వేగవంతం చేస్తుంది. ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ మూడు దశల్లో పూర్తి చేయాలని యోచిస్తున్నారు. మొదటి దశలో ఆసియా ఖండంలో ఇంటర్ కనెక్టివిటీ ఉంటుంది. రెండవ దశలో ఆఫ్రికాను కలుపుతారు, మూడవ దశలో మొత్తం ప్రాజెక్టును గ్లోబలైజ్ చేస్తారు. ఓఎస్ఓడబ్ల్యూఓజీ చొరవ ద్వారా వివిధ ప్రాంతీయ గ్రిడ్‌లను ఒక సాధారణ గ్రిడ్ ద్వారా కనెక్ట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. సూర్యశక్తి ద్వారా పొందిన పునరుత్పాదక ఇంధన శక్తిని పరస్పరం బదిలీ చేసుకోడానికి ఇది ఎంతగానో దోహదపడుతుంది. ‘ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్’ ఆలోచనను భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ 2018 అక్టోబరులో జరిగిన అంతర్జాతీయ సౌర కూటమి (ఐఎస్ఏ) మొదటి సమావేశంలో ప్రతిపాదించారు. సరిహద్దులు దాటి సౌర విద్యుత్ సరఫరాను అనుసంధానం చేయాలని పిలుపునిచ్చారు. మే 2021 లో, బ్రిటన్, భారతదేశం గ్రీన్ గ్రిడ్స్ ఇనిషియేటివ్, వన్ సన్ వన్ వరల్డ్ వన్ గ్రిడ్ చొరవ ద్వారా కలవడానికి అంగీకరించాయి. నవంబర్ 26 లో గ్లాస్గోలో యూకే ఆతిథ్యమిస్తున్న సీఓపీ–2021 శిఖరాగ్ర సమావేశంలో సంయుక్తంగా జీజీఐ-ఓఎస్జీఓజీని ప్రారంభించాయి. జాతీయ సరిహద్దులను దాటే ఖండాంతర స్థాయి గ్రిడ్లతో అనుసంధానించిన ఉత్తమ ప్రదేశాల్లో పెద్ద సౌర విద్యుత్ కేంద్రాలు, పవన క్షేత్రాల తయారీని పర్యవేక్షించడానికి మినిస్టీరియల్ స్టీరింగ్ గ్రూప్ ఏర్పాటు చేయబడుతుంది. ఈ మినిస్టీరియల్ స్టీరింగ్ గ్రూపులో ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, భారతదేశం, బ్రిటన్, అమెరికా ఉన్నాయి. ఆఫ్రికా, గల్ఫ్, లాటిన్ అమెరికా, ఆగ్నేయాసియా నుంచి కూడా ప్రతినిధులు ఉంటారు. గ్లోబల్ గ్రిడ్ నిర్మించడానికి, పునరుత్పాదక వనరులను కలిగి ఉన్న ప్రదేశాల్లో సౌర, గాలి, నిల్వ, ఇతర పునరుత్పాదక ఇంధన ఉత్పత్తిలో పెట్టుబడి పెట్టడం, పునరుత్పాదక శక్తి జనరేటర్లను కనెక్ట్ చేయడానికి సుదూర క్రాస్-బోర్డర్ ట్రాన్స్మిషన్ లైన్లను నిర్మించడం, పవర్ సిస్టమ్‌లను ఆధునీకరించడం, అత్యాధునిక సాంకేతికతలను అభివృద్ధి చేయడం జరగాలి.
ఇనిషియేటివ్ కు సవాళ్లు
వన్ సన్, వన్ వరల్డ్, వన్ గ్రిడ్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్. కానీ ఇది పూర్తిస్థాయిలో అమలు కావడానికి అనేక సవాళ్లు కూడా ఉన్నాయి. తరచూ ప్రకృతి వైపరీత్యాలు సంభవించే దేశాల్లో స్థిరమైన గ్రిడ్‌ను నిర్వహించడం చాలా కష్టమైన పని. సైబర్ దాడులు విద్యుత్ ప్రవాహానికి అంతరాయం కలిగించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది. పేద, ధనిక దేశాల మధ్య పునరుత్పాదక శక్తి అయ్యే ఖర్చును భరించగలిగే శక్తి సమాన స్థాయిలో ఉండకపోవడం కూడా ఒక ప్రధానమైన అడ్డంకి. ఎందుకంటే దేశాల అనుసంధానానికి అవసరమైన ప్రసార లైన్లను ఏర్పాటు చేయడానికి గణనీయమైన మూలధన వ్యయం అవసరం మవుతుంది. దేశాల మధ్య సహకారాన్ని పెంపొందించుకోవడానికి అవసరమైన అంతర్జాతీయ చట్టాలను రూపొందించుకోవాల్సిన అవసరం ఉంది.ఇంధన శక్తిపై ప్రతి దేశం స్వయంశక్తిపై ఆధారపడాలని బలంగా భావిస్తున్న నేటి కాలంలో ఈ ప్రయత్నం ఎంతమేరకు ప్రయోజనం అందించగలదో వేచి చూడాల్సిందే.
మిలియన్ల కొద్ది ఉద్యోగాలు
ఒక సూర్యుడు, ఒక ప్రపంచం, ఒక గ్రిడ్ కార్యక్రమం పారిస్ ఒప్పందం లక్ష్యాన్ని చేరుకోవడానికి దేశాలకు వీలు కల్పిస్తుంది.ఈ ప్రయత్నాలు గ్రీన్ పెట్టుబడులను ప్రేరేపించగలవు, మిలియన్ల కొద్ది ఉద్యోగాలను సృష్టించగలవు. సూర్య శక్తిని పంచుకోవడం ద్వారా, మనం మరింత శాంతియుతమైన, సంపన్నమైన ప్రపంచాన్ని నిర్మించడంలో సహాయపడగలం. ఇది సుస్థిర ప్రపంచ అభివృద్ధికి కూడా దారి తీస్తుంది. శాటిలైట్ డేటాను ఉపయోగించి భూమిపై వివిధ దేశాల సౌర సామర్థ్యం గురించి తెలియజేయడానికి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో), సోలార్ కాలిక్యులేటర్ అప్లికేషన్‌ను భారత్ అభివృద్ధి చేస్తోంది. మార్చి 2014, జూలై 2019 మధ్య, సౌర విద్యుత్ సామర్థ్యం 2.6 GW నుంచి 30 GW వరకు 11 రెట్లు ఎక్కువ విస్తరించింది. ఇది సౌరశక్తి సామర్థ్యాన్ని మరింతగా పెంచింది. భవిష్యత్ కోసం భారీ పెట్టుబడి అవకాశాలను ఆకర్షించింది.
చిట్టెడ్డి కృష్ణారెడ్డి
అసిస్టెంట్ ప్రొఫెసర్ హైదరాబాద్ సెంట్రల్ వర్శిటీ