తీవ్ర పేదరికం భారత్​లో లేదు : మేధో సంస్థ

వాషింగ్టన్:  భారత్ లో తీవ్ర పేదరికం (ఎక్స్ ట్రీమ్ పావర్టీ) తొలగిపోయిందని అమెరికాకు చెందిన మేధో సంస్థ బ్రూకింగ్స్ ఇనిస్టిట్యూట్ వెల్లడించింది. 2022=23 ఏడాదికి సంబంధించిన ఎక్స్ పెండిచర్ డేటా ఆధారంగా దేశంలో తీవ్ర పేదరికం నిర్మూలన జరిగినట్లుగా ఈ మేరకు ఆ సంస్థ తాజాగా ఓ నివేదికను విడుదల చేసింది. ఇనిస్టిట్యూట్ కు చెందిన ప్రముఖ ఆర్థికవేత్తలు సుర్జిత్ భల్లా, కరణ్ భాషిన్ ఈ మేరకు సంబంధిత వివరాలను నివేదికలో పేర్కొన్నారు. భారత్ లో 2011=12 నుంచి తలసరి వ్యయం ఏడాదికి 2.9 శాతం పెరిగిందని వారు తెలిపారు. పట్టణ ప్రాంతాల్లో వృద్ధి రేటు 2.6 శాతం ఉండగా, గ్రామీణ ప్రాంతాల్లో 3.1 శాతం వృద్ధి రేటు నమోదైందన్నారు. దేశంలోని పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అసమానత్వం కూడా గణనీయంగా తగ్గిందని తెలిపారు. 

పట్టణ అసమానత సూచీ (జినీ కోఎఫీషియెంట్) 36.7 నుంచి 31.9కి తగ్గగా.. గ్రామీణ అసమానత సూచీ 28.7 నుంచి 27.0కు తగ్గిందన్నారు. జినీ సూచీ ఎంత తగ్గితే.. అసమానత్వం అంతగా తగ్గినట్టుగా భావించాలన్నారు. మొత్తంగా వృద్ధి రేటు పెరగడంతోపాటు అసమానత్వం తగ్గడం వల్లే దేశంలో తీవ్ర పేదరిక నిర్మూలన సాధ్యమైనట్టు అభిప్రాయపడ్డారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారత్ లో అధికారికంగా నిర్ణయించిన ‘టెండూల్కర్ పావర్టీ లైన్’ ప్రకారం.. ప్రజల కొనుగోలు శక్తి రోజుకు రూ. 158 కంటే ఎక్కువగా ఉంటే తీవ్ర పేదరికం నుంచి బయటపడినట్టేనని సుర్జిత్, భాషిన్ పేర్కొన్నారు. 

అలాగే దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న జనాభా 2011=12లో 12.2 శాతం ఉండగా.. 2022=23 నాటికి 2 శాతానికి తగ్గినట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో పేదరికం 2.5 శాతానికి తగ్గితే.. పట్టణ ప్రాంతాల్లో ఇది1 శాతానికి తగ్గిందన్నారు. అయితే, ఉచిత రేషన్ వంటి సబ్సిడీలు, ప్రభుత్వ విద్య, వైద్యం వంటి అంశాలను ఇందులో పరిగణనలోకి తీసుకోలేదని పేర్కొన్నారు.