అధిక జనాభా సవాళ్లు

అధిక జనాభా సవాళ్లు

చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. ఇప్పుడు చైనా జనాభా 142.57 కోట్లు కాగా, భారత జనాభా142.86 కోట్లు. జనాభా పెరుగుదల డెమోగ్రాఫిక్ డివిడెండా? లేదా డిజాస్టరా? అనే ప్రశ్న తలెత్తుతున్నది. జనాభా పెరుగుదల దేశ అభివృద్ధి వ్యూహానికి భారీ చిక్కులను తేవొచ్చు. అయితే అధిక జనాభా భారతదేశానికి ఒక సవాలు, అవకాశం కూడా. అసమానతలను తగ్గించడం, పేదరిక నిర్మూలన, ఆకలి, పోషకాహార లోపాన్ని ఎదుర్కోవడం, ఆరోగ్య సంరక్షణ, విద్యా వ్యవస్థను విస్తరించడం, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాలను పెంచడం వంటి వాటిపై ప్రభావం చూపే జనాభా పెరుగుదలను ఎదుర్కోవడం భారతదేశానికి ప్రధాన సవాలు. యువతకు నైపుణ్యాభివృద్ధిని అందించడం దేశ ప్రగతికి మూలాధారం. దాదాపు90 కోట్ల మంది శిక్షణ పొందిన వ్యక్తులు చైనాలో ఆర్థిక వ్యవస్థను నడుపుతున్నారు. జాతీయ ఆర్థిక వ్యవస్థ స్థాయిని పెంచడానికి అవసరమైన నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తి అది. దేశ ప్రగతికి నైపుణ్యాభివృద్ధి ఎంత ముఖ్యమో ఈ విషయం నొక్కి చెబుతున్నది.

కుటుంబ నియంత్రణ

1952లో కుటుంబ నియంత్రణ కోసం జాతీయ కార్యక్రమాన్ని ప్రారంభించింది మన దేశం. జనాభా స్థిరీకరణ, ఆరోగ్యాన్ని ప్రోత్సహించడం, మాతా శిశు మరణాల రేటును తగ్గించడంపై ఈ కార్యక్రమం దృష్టిసారించింది. కుటుంబ సంక్షేమ లక్ష్యాలను సాధించడానికి, ప్రభుత్వ కట్టుబాట్లను గౌరవించడానికి కుటుంబ నియంత్రణ లక్ష్యాలు రూపుదిద్దుకున్నాయి. అభివృద్ధి చెందుతున్న కాలంలో కుటుంబ నియంత్రణ అనేది ఒక ప్రధాన ఆందోళనగా మిగిలిపోయింది. జనాభా నియంత్రణ లేకుండా, ఏ దేశమైనా, ముఖ్యంగా భారతదేశం ప్రగతి పథంలో ముందుకు సాగడం కష్టమని ఎప్పుడూ భావించేవారు. స్వతంత్ర భారత మొదటి ప్రధానమంత్రి పండిట్ జవహర్‌‌‌‌లాల్ నెహ్రూ1951లో ప్రణాళికా సంఘాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అప్పటి నుంచి నిరంతర జనాభా పెరుగుదల వివరాలు బయటకువచ్చాయి. ధన్వంతి రామారావు భారతదేశంలో కుటుంబ నియంత్రణ రూపశిల్పిగా గుర్తింపు పొందారు.

కుటుంబ నియంత్రణ లేకపోవడం వల్ల దేశంలోని చాలా సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని ఆమె మొదటిసారిగా గ్రహించారు. దేశవ్యాప్త కుటుంబ నియంత్రణ కార్యక్రమాన్ని ప్రారంభించిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో భారతదేశం మొదటి దేశంగా అవతరించడానికి ఆమెనే కారణం. కుటుంబ నియంత్రణకు వ్యతిరేకంగా, మహిళలకు సాధికారత కల్పించి, జనన నియంత్రణ అవగాహన కార్యక్రమాల్లో పురుషులను భాగస్వాములను చేసే వ్యక్తుల ఆలోచనలను మార్చేందుకు ఆమె చాలా కష్టపడ్డారు. ఆమె భారతదేశంలో కుటుంబ నియంత్రణ కార్యక్రమానికి మార్గదర్శకురాలు అయ్యారు.  పేదరికానికి గల కారణాలలో అధిక జనాభా ఒకటి. చిన్న కుటుంబ కట్టుబాటును అంగీకరించేలా ప్రజలను ఒప్పించడమే జనాభా పెరుగుదలను నియంత్రించగల ఏకైక మార్గం. పేదరిక నిర్మూలన, నిరుద్యోగం, అలాగే అభద్రత, అనారోగ్యం శిశు మరణాలకు వ్యతిరేకంగా హామీలు చిన్న కుటుంబ ప్రమాణాన్ని ఆమోదించడానికి తప్పనిసరిగా ఉండాలి. ఎమర్జెన్సీ సమయంలో కుటుంబ నియంత్రణ నిరాదరణకు గురైంది. అప్పటి నుంచి అది రద్దు చేయబడింది. కుటుంబ నియంత్రణ దేశ శ్రేయస్సు కోసం ప్రణాళికల మధ్య ఉన్న నిజమైన,  అంతర్లీన సంబంధాన్ని ప్రజలు గ్రహించాల్సిన అవసరం ఉంది.

ప్రోత్సాహక చర్యలు అవసరం

అదే సమయంలో జనాభా పెరుగుదల ఒక అవకాశాన్ని ఇస్తుంది. ఇండియా జనాభాలో 68 శాతం మంది15 ఏండ్ల నుంచి 64 సంవత్సరాల మధ్యలో ఉన్నవారే. జనాభాలో 7 శాతం మంది మాత్రమే 65 ఏండ్లు పైబడిన వారు. అంటే భారతీయ జనాభాలో అత్యధికులు యువకులే. ఇది స్వాగతించదగినదే అయినప్పటికీ, ఇది ప్రభుత్వానికి తన అదనపు బాధ్యతను గుర్తు చేస్తున్నది. యువశక్తిని ఉత్పాదక శక్తిగా మార్చుకుంటేనే దేశ ప్రగతి సాధ్యపడుతుంది. నిరుద్యోగ రేటు రికార్డు స్థాయిలో 65 ఏండ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో, భారతదేశం ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా చైనాను అధిగమించడం యాదృచ్చికం. ఆరోగ్య సంరక్షణ, విద్య, ఉపాధి కోసం యువతకు అవసరమైన వాతావరణం ప్రభుత్వ గురుతర బాధ్యతను సూచిస్తున్నది. భారతీయ జనాభా అనూహ్యంగా విపరీతంగా పెరిగింది. 1950 నుంచి దాదాపు ఒక బిలియన్ కంటే ఎక్కువ మంది పెరిగినట్లు. మరోవైపు అత్యధిక జనాభా కలిగిన దేశంగా పేరుగాంచిన చైనాలో..1960 తర్వాత మొదటిసారిగా జనాభా తగ్గడం మొదలైంది. జనాభా నియంత్రణ చర్యలను రూపొందించడం భారతదేశానికి కూడా అవసరం. భారతదేశంలో అధిక జనాభా ఉన్న నేపథ్యంలో వాతావరణ మార్పు, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ, విద్యావకాశాలు, ఉపాధి మార్గాలను సృష్టించడం వంటి పెద్ద సవాళ్లను ఎదుర్కోవడానికి వ్యూహాలను రూపొందించడం ఇప్పుడు ఇండియా ముందు ఉన్న ప్రధాన సమస్య. 

చిరు వ్యాపారాలు, చిన్న, సూక్ష్మ పరిశ్రమలకు మద్దతు ఇవ్వడంతోపాటు, కొత్తగా పరిశ్రమలు స్థాపించాలనుకునే వారికి, ఉన్నవాటిని విస్తరించాలనుకునేవారికి సహాయపడే ఫ్లాగ్‌‌‌‌షిప్ ప్రోగ్రామ్‌‌‌‌లపై భారత ప్రభుత్వం దృష్టి పెట్టాలి. యువత, మహిళలు, ఎస్సీ, ఎస్టీ పారిశ్రామికవేత్తలకు వ్యాపారపరమైన ఆర్థిక మద్దతు అందించాలి. ఇలాంటి చర్యలు భారతదేశంలో వ్యవస్థాపకత, చిన్న వ్యాపారాలను ప్రోత్సహిస్తాయి. ఇది దేశంలోకి విదేశీ పెట్టుబడులను ఆకర్షించడానికి కూడా సాయపడుతుంది. ఇండియా జనాభా నియంత్రణ అంశాన్ని విస్మరించడానికి లేదు. చైనా అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఉన్నప్పటికీ, దాని జనాభా పెరుగుదలను చెక్ చేసుకోగలిగింది. ఫలితంగా అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్‌‌‌‌కు చైనా స్థానం కల్పించింది. భారతదేశం కూడా జనాభా నియంత్రణ చర్యలను కొనసాగించాలి. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి భారతదేశం జనాభా నియంత్రణ విధానాలపై శ్రద్ధ చూపింది. ఎక్కడో ఒక చోట, రాజకీయాలు జనాభా నియంత్రణ విధానాన్ని పక్కకు పెట్టాయి.. ఈ అధిక జనాభా దాని ఫలితమే! 

- పర్సా వెంకట్, పొలిటికల్ ​ఎనలిస్ట్