- పతకాల సిక్సర్
- రెండో రోజు ఇండియాకు 6 మెడల్స్
- తొలి గోల్డ్ అందించిన షూటర్లు
- విమెన్స్ క్రికెట్ టీమ్‌కూ గోల్డ్
- రోయర్లకు మరో రెండు బ్రాంజ్
హాంగ్జౌ: ప్రతిష్టాత్మక ఆసియా గేమ్స్‌లో ఇండియా జోరు కొనసాగుతోంది. సోమవారం రెండు గోల్డ్, నాలుగు బ్రాంజ్‌తో ఆరు మెడల్స్ కైవసం చేసుకుంది. రెండో రోజు కూడా షూటర్లు, రోయర్ల హవా నడిచింది. షూటింగ్‌లో అమ్మాయిలు రెండు పతకాలతో ఇచ్చిన శుభారంభాన్ని కొనసాగిస్తూ రెండో రోజు అబ్బాయిలు గోల్డ్ సహా మూడు మెడల్స్ రాబట్టారు. మెన్స్ 10మీ. ఎయిర్ రైఫిల్ టీమ్ ఈవెంట్‌లో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన రుద్రాంక్ష్ పాటిల్, ఐశ్వరి ప్రతాప్ సింగ్ తోమర్, దివ్యాన్ష్ పన్వర్‌తో కూడిన ఇండియా టీమ్ గోల్డ్ నెగ్గింది. ఫైనల్లో ఇండియా త్రయం 1893.7 స్కోరుతో టాప్ ప్లేస్ సాధించింది. దాంతో 1893.3 స్కోరుతో ఆగస్టులో చైనా టీమ్ నెలకొల్పిన వరల్డ్ రికార్డును బ్రేక్ చేసింది. కొరియా 1890.1 స్కోరుతో సిల్వర్ నెగ్గగా, చైనా 1888.2 స్కోరుతో బ్రాంజ్ రాబట్టింది. టీమ్ గోల్డ్‌లో భాగమైన ప్రతాప్ సింగ్ అనంతరం 10మీ. ఎయిర్ రైఫిల్ వ్యక్తిగత విభాగంలో 228.8 స్కోరుతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ గెలిచాడు. రుద్రాంక్ష్ (208.7) నాలుగో ప్లేస్‌లో నిలిచి కొద్దిలో మెడల్ కోల్పోయాడు. ఇక, మెన్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ టీమ్ ఈమెంట్‌లో ఆదర్శ్ సింగ్, అనీశ్, విజయ్‌వీర్ సిద్ధుతో కూడిన ఇండియా 1718 స్కోరుతో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ మెడల్ గెలిచింది. దాంతో, షూటింగ్‌లో ఇప్పటిదాకా వచ్చిన మెడల్స్ సంఖ్య ఐదుకు చేరింది.
ఉషులో మెడల్ ఖాయం
ఉషులో ఇండియాకు పతకం ఖాయమైంది. విమెన్స్ 60 కేజీ ఉషు (సాండ)లో రోషిబినా దేవి సెమీస్ చేరుకొని కనీసం బ్రాంజ్ ఖాయం చేసుకుంది.
క్వార్టర్ ఫైనల్లో రోషిబినా 3–0తో కజకిస్తాన్‌కు చెందిన ఐమన్ కర్శ్యిగను చిత్తు చేసింది. గత ఎడిషన్‌లోనూ దేవి బ్రాంజ్ మెడల్ గెలిచింది. మరోవైపు మెన్స్ 60 కేజీలో సూర్య భాను ప్రతాప్ ప్రిక్వార్టర్స్‌లో 2–1తో ఉజ్బెకిస్తాన్‌కు చెందిన ఇస్లోంబెక్‌ను ఓడించి క్వార్టర్స్ చేరాడు. కానీ, 65 కేజీ కేటగిరీ కేటగిరీలో విక్రాంత్ బలియన్ ప్రిక్వార్టర్స్‌లోనే ఓడిపోయాడు.
ఆసియా గేమ్స్‌లో తొలి రోజు ఐదు మెడల్స్ వచ్చినా.. ఒక్క బంగారు పతకం లేదన్న లోటు కనిపించింది. ఆ లోటును పూడుస్తూ రెండో రోజు ఇండియన్స్ రెండు గోల్డ్ మెడల్స్‌తో డబుల్ ధమాకా మోగించారు. అంచనాలను అందుకున్న షూటర్లు ఈ ఎడిషన్‌లో తొలి గోల్డ్ అందించగా.. విమెన్స్ క్రికెట్ టీమ్ అలవోకగా బంగారు పతకాన్ని అందుకుంది. రోయర్లు మరో రెండు మెడల్స్ తెచ్చిపెట్టారు. మొత్తంగా రెండో రోజు ఇండియా ఆరు మెడల్స్‌తో సిక్సర్ కొట్టింది.
రోయర్లకు మొత్తం ఐదు..
గత ఎడిషన్ ఆసియా గేమ్స్‌లో మూడు మెడల్స్ గెలిచిన ఇండియా రోయింగ్ టీమ్ ఈసారి ఐదు మెడల్స్‌తో మెప్పించింది. తొలి రోజు మూడు పతకాలు రాబట్టిన రోయర్లు రెండో రోజు రెండు బ్రాంజ్ మెడల్స్ సాధించారు. సత్నామ్ సింగ్, పర్మీందర్ సింగ్, జకర్ ఖన్, సుఖ్‌మీత్ సింగ్‌తో కూడిన మెన్స్ క్వాడ్రపుల్ స్కల్స్ టీమ్ 6 నిమిషాల 08.61 సెకండ్ల టైమ్‌తో మూడో ప్లేస్‌తో బ్రాంజ్ గెలిచింది. చైనా (6:02.65 సె), ఉజ్బెకిస్తాన్ (6:04.64సె) గోల్డ్, సిల్వర్ సాధించాయి. ఇక, మెన్స్ ఫోర్ ఈవెంట్‌లో జస్వీందర్ సింగ్, భీమ్ సింగ్, పునీత్ కుమార్, ఆశిష్ గొలియన్‌తో కూడిన ఇండియా టీమ్ 6 నిమిషాల 10.81 సెకండ్లతో బ్రాంజ్ గెలిచింది.