Paris Olympics 2024: భళా హాకీ టీమ్.. ఒలింపిక్స్‌లో భారత్‌కు మరో మెడల్

పారిస్ ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టు అదరగొట్టింది. గురువారం(ఆగష్టు 08) జరిగిన కాంస్య పతక పోరులో స్పెయిన్‌ను ఓడించి దేశానికి మరో మెడల్ అందించింది. ఉత్కంఠభరిత మ్యాచ్‌లో హర్మన్‌ సేన 2-1 తేడాతో స్పెయిన్‌పై విజయం సాధించింది. తొలుత 1-0తేడాతో వెనుకబడ్డ.. అనంతరం వరుసగా రెండు గోల్స్ వేసి పతకాన్ని ముద్దాడింది. దీంతో, పారిస్ ఒలింపిక్స్‌లో భారత్ పతకాల సంఖ్య 4కు చేరింది. కాగా, ఒలింపిక్స్‌లో భారత హాకీ జట్టుకు ఇది 13వ పతకం.

తొలి క్వార్టర్స్‌లో ఇరు జట్లు గోల్‌ చేయకపోగా.. రెండో క్వార్టర్‌ ఆరంభంలో స్పెయిన్‌ ఆటగాడు మార్క్ మిరల్లెస్ గోల్‌ వేసి 1-0 ఆధిక్యంలో నిలిపాడు. కొద్దిసేపటికే కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ అద్భుత గోల్‌తో భారత్‌ ఖాతా తెరిచేలా చేశాడు. అనంతరం మూడో క్వార్టర్‌లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. ఆ సమయంలో హర్మన్‌ప్రీత్‌ పెనాల్టీ కార్నర్‌ను గోల్ గా మలిచి భారత్‌ను 2-1 తేడాతో ఆధిక్యంలో నిలిపాడు. చివరి క్వార్టర్‌లో గోల్ చేయడానికి స్పెయిన్ ఆటగాళ్లు చేసిన ప్రయత్నాలన్నింటినీ భారత గోల్ కీపర్ శ్రీజేష్ అడ్డుకున్నాడు. ఆఖరి 10 నిమిషాల ఆట హోరాహోరీగా సాగింది.