
ఒలింపిక్స్‌లో ఇండియా హాకీ టీమ్ మరోసారి మెరిసింది. పూల్–బిలో శుక్రవారం జరిగిన ఆఖరి మ్యాచ్‌లో 3–2తో బలమైన ఆస్ట్రేలియాను ఓడించింది. దీంతో 52 ఏండ్ల తర్వాత మెగా గేమ్స్‌లో కంగారూలపై తొలి విజయాన్ని అందుకుంది. చివరిసారిగా 1972 మ్యూనిక్ గేమ్స్ లో ఇండియా.. ఆసీస్‌పై నెగ్గింది. ఇండియా తరఫున అభిషేక్ (12వ ని.), హర్మన్‌ప్రీత్ సింగ్ (13, 22వ ని.) గోల్స్ చేయగా, టామ్ క్రెయిగ్ (25వ ని.), బ్లాకీ గోవర్స్ (55వ ని.) ఆసీస్‌కు గోల్స్ అందించారు.
తాజా విజయంతో ఇండియా 9 పాయింట్లతో పూల్‌లో రెండో స్థానంతో క్వార్టర్స్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఇండియన్ ఫార్వర్ట్స్ తొలి రెండు నిమిషాల్లోనే ప్రత్యర్థి సర్కిల్‌లోకి దూసుకెళ్లారు. అదే జోరుతో తొలి హాఫ్‌లోనే మూడు గోల్స్ కొట్టారు. స్కోరును సమం చేసేందుకు చివరి వరకు ప్రయత్నించిన ఆసీస్ రెండు గోల్స్‌తోనే సరిపెట్టుకుంది.