పేదరిక నిర్మూలన, సుపరిపాలన ద్వారా దేశాన్ని ఏ విధంగా అభివృద్ధి పథంలో నడిపించాలో ప్రధాని మోడీ గత ఎనిమిదేండ్లుగా నిరూపిస్తున్నారు. ఈ ఎనిమిదేండ్ల కుటుంబ రహిత, అవినీతి రహిత పరిపాలన దేశ ప్రగతికి వెన్నెముకగా నిలిచింది. దేశంలో బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వివిధ మార్పులు నవ భారత నిర్మాణానికి పునాదులు వేశాయి. గత 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలోని రహదారుల అభివృద్ధి, విస్తరణతో పోలిస్తే.. మోడీ అధికారంలోకి వచ్చిన ఈ ఎనిమిదేండ్లలో 73 శాతం పెరగడం విశేషం. దేశాన్ని ప్రపంచంలో ఒక అద్భుత శక్తిగా నిలబెట్టిన ఘనత మోడీదే. కరోనా లాంటి విపత్కర పరిస్థితులను ధీటుగా ఎదుర్కొని, ప్రపంచానికి వ్యాక్సిన్లు అందించిన ఘనత భారత ప్రభుత్వానిదే. రష్యా– ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంలో భారత్ తటస్థ వైఖరి ప్రత్యేకంగా నిలిచింది.
370 ఆర్టికల్ రద్దు
2014 కంటే ముందు కాంగ్రెస్ పాలనా కాలంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఎలాంటి అభివృద్ధి ఉండేదో దేశానికి తెలియనిది కాదు. కానీ కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఈశాన్య రాష్ట్రాల రూపు రేఖలు మారిపోయాయి. ఈశాన్య రాష్ట్రాలే కాదు యావత్ భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తోంది. 370 అధికరణను రద్దు చేసి జమ్మూ కాశ్మీర్ లో ప్రశాంత వాతావరణాన్ని సృష్టించే కీలక నిర్ణయం తీసుకున్నది మోడీ ప్రభుత్వమే. విద్య, వైద్యం, ఆరోగ్యం, రవాణా వ్యవస్థ, పరిశ్రమల స్థాపన, ఉద్యోగాల కల్పన, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో విప్లవాత్మక మార్పులు, రక్షణ రంగంలో తిరుగులేని శక్తిగా నిలవడం లాంటి మార్పులెన్నో ఈ ఎనిమిదేండ్లలో జరిగాయి. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం కారణంగా ప్రస్తుత సంక్షోభం సమయంలో కూడా, గోధుమలు, ఇతర ఆహార ధాన్యాల సరఫరా కోసం ప్రపంచం భారతదేశం వైపు చూస్తోంది. వ్యవసాయ ఎగుమతులను ప్రోత్సహించేందుకు వాణిజ్య శాఖ ప్రయత్నాలను కొనసాగిస్తోంది. నేడు ప్రపంచ ఆహార భద్రతకు హామీ ఇవ్వడంలో భారత్ నిర్ణయాత్మకమైన పాత్ర వహించే దశకు చేరుకుంది.
వృద్ధి రేటు పెరిగింది
2004 నుంచి 2014 మధ్య పదేండ్ల కాంగ్రెస్ పాలన కాలంలో 6. 7శాతంగా ఉన్న వృద్ధి రేటు ప్రస్తుతం 8.7 శాతానికి పెరిగింది. మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం, ఇతర వసతుల కోసం మోడీ ప్రభుత్వం ఇప్పటికే 91 లక్షల కోట్ల రూపాయలను కేటాయించింది. చివరి రెండు సంవత్సరాలు దేశంలో 80 కోట్ల మందికి ఉచితంగా రేషన్ బియ్యం పంపిణీ చేసింది. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 50 కోట్ల మంది ప్రజలు ప్రయోజనం పొందారు. దేశంలో దాదాపు 9 కోట్ల నల్లా కనెక్షన్లు అందాయి. సాధారణ ప్రజల అభివృద్ధి, సాధికారత కోసం గరీబ్ కళ్యాణ్ యోజన, జన్ ధన్ యోజన, ఉజ్వల యోజన, స్వనిధి యోజన, కిషన్ సమ్మాన్ యోజన, ముద్ర లాంటి అనేక పథకాలను ప్రవేశపెట్టి ప్రజలకు ఆదాయాన్ని సృష్టించడమే లక్ష్యంగా పనిచేస్తున్నారు ప్రధాని మోడీ. అఫ్గానిస్తాన్ సంక్షోభ సమయంలో అక్కడ చిక్కుకున్న 700 మంది భారతీయులను ‘ఆపరేషన్దేవి శక్తి’తో దేశానికి తీసుకురావడం ప్రత్యేకంగా నిలిచింది. కరోనాతో ఏర్పడిన ఆర్థిక సంక్షోభం, ద్రవ్యోల్బణంలతో అగ్రరాజ్యాలే అతలాకుతలం అవుతుంటే, భారత ప్రభుత్వం మాత్రం తన ఆర్థిక వ్యవస్థను సత్వరం గాడిలో పెట్టగలిగింది.
మహిళా సాధికారత కోసం
మోడీ ప్రభుత్వం మహిళా సాధికారత కోసం పనిచేస్తోంది. అందులో భాగంగానే ఉజ్వల పథకం కింద 9 కోట్ల మంది మహిళలకు ఎల్పీజీ కనెక్షన్లు అందించింది. జన్ ధన్ యోజన ద్వారా 25 కోట్ల మంది మహిళలు ఖాతాలు తెరిచారు. ముద్ర యోజన లబ్ధిదారుల్లో 68 శాతం కంటే ఎక్కువ మహిళలే ఉన్నారు.చరిత్రలో ఎప్పుడు లేని విధంగా నరేంద్రమోడీ మహిళలకు కేంద్ర మంత్రివర్గంలో అధిక ప్రాధాన్యతనిచ్చారు. కీలకమైన శాఖలను కూడా అప్పగించి దేశ ప్రగతిలో మహిళలను భాగస్వాములను చేశారు.
- డా. పద్మ,
జాతీయ కార్యవర్గ సభ్యురాలు,
బీజేపీ మహిళా మోర్చా