- 4 వికెట్ల తేడాతో శ్రీలంకపై విజయం
- రాణించిన త్రిష, ఆయుషి
- 7 పాయింట్లతో సూపర్–4లో టాప్ ప్లేస్ సొంతం
కౌలాలంపూర్ : అండర్–19 విమెన్స్ టీ20 ఆసియా కప్‌లో యంగ్ ఇండియా దుమ్మురేపింది. బ్యాటింగ్‌లో హైదరాబాద్ ప్లేయర్ గొంగడి త్రిష (24 బాల్స్‌లో 2 ఫోర్లు, 3 సిక్స్‌లతో 32), బౌలింగ్‌లో లెఫ్టార్మ్ స్పిన్నర్ ఆయుషి శుక్లా (4/10) చెలరేగడంతో.. శుక్రవారం జరిగిన సూపర్–4 ఆఖరి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 4 వికెట్ల తేడాతో శ్రీలంక విమెన్స్‌ను చిత్తు చేసింది. దీంతో గ్రూప్–ఎలో ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లో ఏడు పాయింట్లు సాధించి టాప్ ప్లేస్‌తో ఫైనల్లోకి దూసుకెళ్లింది.
టాస్ నెగ్గిన ఇండియా ఫీల్డింగ్ ఎంచుకోగా, బ్యాటింగ్‌కు దిగిన శ్రీలంక 20 ఓవర్లలో 98/9 స్కోరు చేసింది. మనుడి నానయక్కరా (33) టాప్ స్కోరర్. సుముదు నిసాన్సాల (21) ఫర్వాలేదనిపించినా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత ఇండియా 14.5 ఓవర్లలోనే 102/6 స్కోరు చేసి నెగ్గింది. ఆయుషికి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం జరిగే ఫైనల్లో ఇండియా.. బంగ్లాదేశ్‌తో తలపడుతుంది.
ఆయుషి తిప్పేసింది..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంకేయులను ఆయుషి తన స్పిన్ మ్యాజిక్‌తో దెబ్బతీసింది. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ పురానిక సిసోడియా (2/27) కీలక వికెట్లు తీసి అండగా నిలిచింది. వీళ్త దెబ్బకు టాపార్డర్‌లో సంజన కావింది (9), హిరుణి హన్సిక (2), లిమాన్సా తిలకరత్న (1), దహమి సనేత్మా (5) నిరాశపర్చడంతో లంక 30 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో సుముదు, మనుడి నానయక్కరా ఐదో వికెట్‌కు 22 రన్స్ జత చేసి ఇన్నింగ్స్‌ను గాడిలో పెట్టే ప్రయత్నం చేశారు.
కానీ 10వ ఓవర్‌లో దహమి రనౌట్‌తో ఆశలు గల్లంతయ్యాయి. చివర్లో ఆయుషి టర్నింగ్ బాల్స్‌తో లోయర్ ఆర్డర్‌ను కట్టడి చేసింది. 17వ ఓవర్‌లో వరుస బాల్స్‌లో రష్మిక (8), శశినీ గిమ్హాని (0)ని ఔట్ చేసింది. తన తర్వాతి ఓవర్‌లో ప్రమూది (3)ని పెవిలియన్‌కు పంపింది. చివర్లో తలగునె (2 నాటౌట్), చామోది ప్రభోద(3 నాటౌట్)
షాట్లు ఆడకపోవడంతో లంక చిన్న టార్గెట్‌నే నిర్దేశించింది. షబ్నమ్, ద్రితి చెరో వికెట్ తీశారు.
సూపర్ త్రిష..
చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో ఇండియాకు ఆరంభం నుంచే కష్టాలు ఎదురయ్యాయి. ఇన్నింగ్స్ మూడో బాల్‌కే ఐశ్వరి (0) డకౌటైంది. కమిళిని మెరుగ్గా ఆడినా.. రెండో ఎండ్‌లో సానికా చాల్కే (4) నిరాశపర్చింది. 5/2 స్కోరుతో కష్టాల్లో పడిన ఇండియా ఇన్నింగ్స్‌ను త్రిష అదుకుంది. లంక బౌలింగ్‌ను దీటుగా ఎదుర్కొని మూడు భారీ సిక్సర్లతో రెచ్చిపోయింది. కమిళిని కూడా బౌండ్రీలు రాబట్టడంతో మూడో వికెట్‌కు 63 రన్స్ జతయ్యాయి.
9వ ఓవర్‌లో ప్రభోద (3/16) బౌలింగ్‌లో భారీ షాట్ కొట్టబోయి త్రిష, తర్వాతి ఓవర్‌లో కమిళిని వెనుదిరిగారు. ఆ వెంటనే కెప్టెన్ నికీ ప్రసాద్ (3), భావికా (7) వరుస విరామాల్లో ఔట్ కావడంతో ఇండియా 74/5తో నిలిచింది. అయితే మిథాలి వినోద్ (17 నాటౌట్) వేగంగా ఆడింది. ఆయుషి శుక్లా (1 నాటౌట్)తో కలిసి ఈజీగా జట్టుకు విజయాన్ని అందించింది. శశినీ గిమ్హాని 2 వికెట్లు తీసింది.
సంక్షిప్త స్కోర్లు
శ్రీలంక : 20 ఓవర్లలో 98/9 (మనుడి 33, సుముదు 21, ఆయుషి 4/10). ఇండియా : 14.5 ఓవర్లలో 102/6 (త్రిష 32, కమిళిని 28, ప్రభోద 3/16).