న్యూఢిల్లీ: టెక్నాలజీ, ప్రొఫెషనల్ సర్వీసెస్ కన్సల్టింగ్, ఫాస్ట్ మూవింగ్ కన్స్యూమర్ గూడ్స్ (ఎఫ్ఎంసీజీ), హెల్త్‌కేర్ ఫార్మాస్యూటికల్స్, బ్యాంకింగ్, ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్సూరెన్స్ (బీఎఫ్ఎస్ఐ), తయారీ వంటి రంగాల్లోని కంపెనీలు గిగ్ వర్కర్లను (టెంపరరీ వర్కర్లు) భారీ ఎత్తున నియమించుకుంటున్నాయి. మనదేశంలో ఫ్రీలాన్స్ నిపుణులకు డిమాండ్ ఆల్ టైమ్ హైకి చేరుకుంది. పూర్తిస్థాయి వైట్ కాలర్ జాబ్ మార్కెట్ నెమ్మదించడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. ‘ఫ్లెక్సింగ్’ అనే గిగ్ ప్లాట్‌ఫారమ్‌లో ఫ్రీలాన్స్ ప్రాజెక్ట్‌ల సంఖ్య జనవరి–-జూన్ కాలంలో వార్షికంగా 25 శాతం పెరిగింది. ఎగ్జిక్యూటివ్ సెర్చ్ సంస్థ సీఐఈఎల్హెచ్ఆర్ వివిధ సెక్టార్‌లలోని 400 పెద్ద, మధ్య చిన్న కంపెనీలలో గిగ్ ఎంప్లాయ్మెంట్పై ప్రత్యేకంగా ఒక సర్వే చేసింది. వీటిలో జూన్ క్వార్టర్లో గిగ్ వర్కర్ల నియామకం ఏడాది క్రితం ఇదే కాలంతో పోలిస్తే 30శాతం నుంచి 55శాతం పెరిగింది.
ఈ రకం ఉద్యోగాలు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న వారిని రెగ్యులర్ పద్ధతిలో నియమించుకోవడం కంటే తాత్కాలిక పద్ధతిలో గిగ్ వర్కర్‌ను నియమించుకోవడం ఈజీ అని కంపెనీలు భావిస్తున్నాయి. ఇలాంటి వారిని తీసుకోవడానికి తక్కువ సమయం పడుతుంది. ప్రత్యేకించి ఒడిదుడుకుల సమయంలో లేదా కొత్త వ్యాపార రంగాలలోకి ప్రవేశించేటప్పుడు కంపెనీలు ఖర్చులను తగ్గించుకోవడంపై దృష్టి పెడతాయి. "కొత్త నైపుణ్యం కోసం ఉద్యోగులకు కంపెనీలోనే అంతర్గతంగా శిక్షణ ఇవ్వడం కొన్నిసార్లు సాధ్యం కాకపోవచ్చు. ఇందుకు సమయం కూడా ఎక్కువ పడుతుంది. నైపుణ్యం కలిగిన ఫ్రీలాన్సర్‌లు, కన్సల్టెంట్‌లు ఈ అంతరాన్ని పూడ్చటంలో సహాయపడతారు. వీరిని ఎప్పుడంటే అప్పుడు తీసుకొని పని అయిపోగానే తొలగించవచ్చు" అని ఫ్లెక్సింగ్ ఫౌండర్ చంద్రికా పస్రిచా అన్నారు.
తక్కువ జీతాలతో తీసుకోవచ్చు
సీఐఈఎల్ హెచ్ఆర్ సీఈఓ ఆదిత్య నారాయణ్ మిశ్రా మాట్లాడుతూ గిగ్ వర్కర్లకు తక్కువ జీతభత్యాలు చెల్లిస్తే సరిపోతుందని, ముఖ్యంగా కరోనా తరువాత వీరి నియామకాలు పెరిగాయని చెప్పారు. 2023 ఆర్థిక సంవత్సరంలో ప్రొఫెషనల్ గిగ్ ఎకానమీలో స్ట్రాటెజీ, మార్కెటింగ్, ఐటీ/టెక్నాలజీ తరువాత హెచ్ఆర్, ఫైనాన్స్‌లకు ఎక్కువ డిమాండ్ ఉంది. మొత్తం ప్రాజెక్టుల్లో వీటికి 70 శాతం వాటా ఉంది. 2024 ఆర్థిక సంవత్సరం మొదటి క్వార్టర్లో టెక్నాలజీ రంగానికి విపరీతంగా డిమాండ్ పెరిగింది. కన్సల్టెంట్ నియామకాలు అంతకు ముందు ఆర్థిక సంవత్సరం కంటే 2023 ఆర్థిక సంవత్సరంలో 125శాతం పెరిగా యి. 2022 ఆర్థిక సంవత్సరంలో ఇవి 25శాతం పెరిగాయి.
ఫ్లెక్సింగ్ డేటా ప్రకారం, అవి ప్రీకొవిడ్ సంఖ్యల (2020 ఆర్థిక సంవత్సరం) కంటే 2021 ఆర్థిక సంవత్సరంలో 11శాతం పెరిగా యి. ఈ ట్రెండ్ 2024 ఆర్థిక సంవత్సరంలో కూడా కొనసాగుతుందని,- 2023 ఏప్రిల్-–జూన్ లో 9,000 సైన్-అప్‌లు జరిగాయని పస్రిచా చెప్పారు. ఆరు క్వార్టర్ల క్రితం వీటి సంఖ్య 2,500 లు మించలేదని చెప్పారు. రిమోట్ వర్కింగ్ వల్ల కూడా గిగ్ ఎంప్లాయ్మెంట్ పెరిగింది. అంతటా డిజిటలైజేషన్ రావడం వల్ల వీళ్ల నియామకాలు ఎక్కువ అయ్యాయి. భవిష్యత్‌పై కచ్చితమైన అంచనాకు రాలేనప్పుడు కంపెనీలు పర్మినెంట్ వర్కర్లకు బదులు టెంపరరీ వర్కర్ల ను నియమించుకోవడానికి ప్రాధాన్యం ఇస్తాయని బ్యాంక్ ఆఫ్ బరోడా చీఫ్ ఎకనమిస్ట్ మదన్ శబ్నవిస్ అన్నారు.