స్వీట్లు కూడా మూడు రంగులతో.. త్రివర్ణంతో తియ్యని వేడుక

స్వీట్లు కూడా మూడు రంగులతో.. త్రివర్ణంతో తియ్యని వేడుక

పుట్టిన రోజు, పెళ్లి రోజు, పండుగ.. ఇలా ప్రతి అకేషన్​కి స్వీట్స్‌‌ ఉండాల్సిందే. అయితే, దేశమంతా స్వీట్లు తినిపించుకుంటూ శుభాకాంక్షలు తెలుపుకునే పండుగ స్వాతంత్ర్య దినోత్సవం. ఆ రోజు ఎటు చూసినా మూడు రంగులే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. స్వీట్లు కూడా మూడు రంగులతో మురిపిస్తుంటాయి. మీరు కూడా ఫుడ్ కలర్ వాడకుండా, ఇంట్లోనే హెల్దీగా స్వీట్స్ చేసుకోవాలి అనుకుంటున్నారా? మరింకేం.. ఇవిగో మూడు రంగుల్లో మూడు వెరైటీలు మీకోసం...

  • కోకోనట్ పుడ్డింగ్


కావాల్సినవి :
కొబ్బరి పాలు – రెండు కప్పులు, మొక్కజొన్న పిండి – పావు కప్పు
చక్కెర – అర కప్పు, ఉప్పు – చిటికెడు 
తయారీ :  పచ్చి కొబ్బరి ముక్కల్ని మెత్తగా గ్రైండ్ చేయాలి. అందులో కొన్ని నీళ్లు పోసి కలపాలి. ఆ తర్వాత వడకడితే కొబ్బరి పాలు వస్తాయి. పావు కప్పు పాలు పక్కకు తీయాలి. అందులో మొక్క జొన్న పిండి వేసి కలిపి పక్కన పెట్టాలి. ఒక పాన్​లో మిగతా పాలు పోసి, అందులో చక్కెర, ఉప్పు వేసి కలపాలి. అవి కాగేటప్పుడు మొక్కజొన్న పిండి కలిపిన పాలు కూడా వేసి కలపాలి. ఆ మిశ్రమం దగ్గర పడ్డాక ఒక గిన్నెలోకి తీసుకోవాలి. రెండు గంటలు ఫ్రిజ్​లో పెట్టి, ఆ తర్వాత తీసి, తింటే చాలా బాగుంటుంది.

 

  • క్యారెట్ మైసూర్ పాక్


కావాల్సినవి :
శనగపిండి – ముప్పావు కప్పు
క్యారెట్ పేస్ట్ – అర కప్పు
చక్కెర – అర కప్పు
నీళ్లు, నూనె – సరిపడా
పాల పొడి – పావు కప్పు
నెయ్యి – ఒక టీస్పూన్
దాల్చిన చెక్క పొడి – పావు టీస్పూన్
తయారీ : క్యారెట్లు కడిగి ముక్కలుగా కోయాలి. వాటిని మిక్సీజార్​లో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక గిన్నెలో శనగపిండి, నూనె, పాల పొడి వేసి కలిపి, పక్కన పెట్టాలి. ఒక పాన్​లో చక్కెర వేసి, అందులో నీళ్లు పోయాలి. క్యారెట్​ పేస్ట్​ కూడా వేసి కాగబెట్టాలి. ఆ మిశ్రమం ఒక ఉడుకు రాగానే, అందులో శనగపిండి మిశ్రమాన్ని వేసి కలపాలి. ఆ తర్వాత నెయ్యి, దాల్చిన చెక్క పొడి వేసి కలపాలి. ఒక గిన్నెలో నెయ్యి పూసి, క్యారెట్ మిశ్రమాన్ని వేయాలి. దానిపై డ్రైఫ్రూట్స్ చల్లి, చల్లారాక  మైసూర్​పాక్​లా ముక్కలు కోయాలి. అంతే.. ఆరెంజ్ కలర్​లో టేస్టీ, హెల్దీ మైసూర్​ పాక్ రెడీ. 

  • పచ్చి బటానీ – పిస్తా బర్ఫీ

కావాల్సినవి :
పచ్చి బటానీ – ఒక కప్పు
పిస్తా తరుగు – అర కప్పు
నెయ్యి – మూడు టేబుల్ స్పూన్లు
చక్కెర – ముప్పావు కప్పు
కోవా – రెండు కప్పులు
దాల్చిన చెక్క పొడి –  ముప్పావు టీస్పూన్
తయారీ : మిక్సీ జార్​లో పచ్చి బటానీలు వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. ఒక పాన్​లో నెయ్యి వేడి చేసి, అందులో బటానీ పేస్ట్​ వేసి కలపాలి. అందులో కోవా కూడా వేసి బాగా కలపాలి. తర్వాత చక్కెర వేసి కలపాలి. చివరిగా, దాల్చిన చెక్క పొడి, పిస్తా తరుగు వేసి కలపాలి. ఆ మిశ్రమాన్ని నెయ్యి పూసిన గిన్నెలో వేసి, పైన పిస్తా తరుగు చల్లాలి. చల్లారాక, 
బర్ఫీల్లా కోయాలి. 

  • మన కిచెన్‌‌లో బ్రిటిష్ రుచులు

బ్రిటిష్ వాళ్లు మన దేశాన్ని రెండు వందల ఏండ్లకుపైనే పరిపాలించారు. 1947లో తిరిగి వెళ్తూ.. ఎన్నో గుర్తులను ఇక్కడ వదిలేశారు. మన ఆహార అలవాట్లు, కల్చర్‌‌‌‌ నుంచి రాజ్యాంగం వరకు అన్నింటిలోనూ వాళ్ల మార్క్‌‌ కనిపిస్తుంటుంది. ముఖ్యంగా మన ఫుడ్‌‌పై బ్రిటిషర్ల ఎఫెక్ట్‌‌ ఇప్పటికీ  ఉంది. అంతేకాదు విదేశీయులు మనల్ని పాలించడం వల్ల మనదేశంలో కొత్త వంటకాలు కూడా పుట్టుకొచ్చాయి.

  • ఛాయ్‌‌

ఛాయ్‌‌ని మనకు పరిచయం చేసింది బ్రిటిషర్లే అయినా.. తేయాకు మాత్రం మనదే. కానీ.. చాలామందికి ఈ విషయం తెలియదు. బ్రిటిషర్లు రాకముందు నుంచే అస్సాంలోని అడవుల్లో, బీడు భూముల్లో తేయాకు చెట్లు బాగా పెరిగేవి. బ్రిటిషర్లు ఆ ప్లేసుల్లోనే టీ తోటలను ఏర్పాటు చేశారు. టీతో పాటు వాళ్లు కాఫీ, విస్కీ, జిన్ లాంటి ఆల్కాహాల్‌‌ కూడా ఇండియన్స్‌‌కి పరిచయం చేశారు.