- 7 వికెట్లతో అమెరికాపై గెలుపు
- రాణించిన సూర్య, దూబే
న్యూయార్క్ : టీ20 వరల్డ్ కప్‌లో వరుసగా మూడో విజయంతో ఇండియా సూపర్–8లోకి అడుగుపెట్టింది. అర్ష్‌దీప్ సింగ్ (4/9) సూపర్ బౌలింగ్‌కు తోడుగా సూర్యకుమార్ (49 బాల్స్‌లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 50 నాటౌట్), శివమ్ దూబే (35 బాల్స్‌లో 1 ఫోర్, 1 సిక్స్‌తో 31 నాటౌట్) నిలకడైన బ్యాటింగ్‌తో.. బుధవారం జరిగిన గ్రూప్–ఎ మ్యాచ్‌లో టీమిండియా 7 వికెట్ల తేడాతో అమెరికాను ఓడించింది.
టాస్ ఓడిన యూఎస్‌ఏ 20 ఓవర్లలో 110/8 స్కోరు చేసింది. నితీశ్ కుమార్ (23 బాల్స్‌లో 2 ఫోర్లు, 1 సిక్స్‌తో 27) టాప్ స్కోరర్. స్టీవెన్ టేలర్ (24) మినహా మిగతా వారు నిరాశపర్చారు. తర్వాత ఇండియా 18.2 ఓవర్లలో 111/3 స్కోరు చేసింది. అర్ష్‌దీప్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బౌలింగ్ సూపర్..
ముందుగా బ్యాటింగ్‌కు దిగిన అమెరికన్లు ఎక్స్‌పీరియెన్స్‌తో కూడిన ఇండియా బౌలింగ్ దాడి ముందు నిలవలేకపోయారు. తొలి ఓవర్‌లోనే అర్ష్‌దీప్ (4/9).. జహంగీర్ (0), ఆండ్రీస్ గౌస్ (2)ను ఔట్ చేసి డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. మిగతా బౌలర్లు కూడా మెప్పించడంతో యూఎస్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. రెండో ఓపెనర్ స్టీవెన్, ఆరోన్ జోన్స్ (11) ఇన్నింగ్స్‌ను నిలబెట్టేందుకు ప్రయత్నించగా 18/2తో పవర్‌ప్లేను ముగించింది. 8వ ఓవర్‌లో హార్దిక్ (2/14).. జోన్స్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఈ దశలో వచ్చిన నితీశ్ నిలకడగా ఆడినా, రెండో ఎండ్‌లో సరైన సహకారం లభించలేదు.
10 ఓవర్లలో 42/3 స్కోరుతో కష్టాల్లో పడిన అమెరికాను అర్ష్‌దీప్ మళ్లీ దెబ్బకొట్టాడు. 12వ ఓవర్‌లో అక్షర్ (1/25) స్టీవెన్ వికెట్ తీసి నాలుగో వికెట్‌కు 31 రన్స్ పార్ట్‌నర్‌షిప్ బ్రేక్ చేశాడు. ఆ వెంటనే అర్ష్‌దీప్ వెంటవెంటనే నితీశ్, హర్మీత్ (10)ను ఔట్ చేశాడు. మధ్యలో రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పిన కోరె అండర్సన్ (15)ను 17వ ఓవర్లో పాండ్యా ఔట్ చేయడంతో యూఎస్ కోలుకోలేకపోయింది. శాడ్లీ వాన్ (11 నాటౌట్)
మెరుగ్గా ఆడినా, లాస్ట్ బాల్‌కు జస్దీప్ సింగ్ (2) రనౌటయ్యాడు.
సూర్య నిలకడ..
ఛేజింగ్‌లో ఇండియాను సౌరభ్ నేత్రావల్కర్ (2/4) ఘోరంగా దెబ్బకొట్టాడు. ఇన్నింగ్స్ రెండో బాల్‌కే కోహ్లీ (0)ని డకౌట్ చేసిన అతను తర్వాతి ఓవర్‌లో ఫుల్ లెంగ్త్ బాల్‌తో రోహిత్ (3)ని పెవిలియన్ చేర్చాడు. దీంతో ఇండియా 10/2 స్కోరుతో కష్టాల్లో పడింది. ఇన్నింగ్స్‌ను ఆదుకునే బాధ్యతను తీసుకున్న రిషబ్ పంత్ (18), సూర్యకుమార్ చెరో సిక్స్‌తో టచ్‌లోకి వచ్చారు. దాంతో పవర్‌ప్లేలో ఇండియా 33/2తో నిలిచింది. కానీ 8వ ఓవర్‌లో అలీ ఖాన్ ఝలక్ ఇచ్చాడు. షార్ప్ యాంగిల్ బాల్‌తో పంత్‌ను క్లీన్‌బౌల్డ్ చేశాడు. ఇక్కడి నుంచి సూర్య, దూబే స్ట్రయిక్ రొటేట్ చేస్తూ నిలకడగా ఆడారు.
10 ఓవర్లలో స్కోరును 47/3కి తీసుకెళ్లారు. 11వ ఓవర్‌లో ఫోర్ కొట్టిన దూబే తర్వాత నెమ్మదించాడు. 22 రన్స్ వద్ద సూర్య ఇచ్చిన క్యాచ్‌ను సౌరభ్ డ్రాప్ చేశాడు. దీన్ని సద్వినియోగం చేసుకున్న అతను 14వ ఓవర్లో బౌండ్రీ కొట్టగా.. తర్వాతి ఓవర్లో దూబే సిక్స్‌తో 15 ఓవర్లలో స్కోరు 76/3కి చేరింది. ఇక విజయానికి 30 బాల్స్‌లో 35 రన్స్ చేయాల్సి ఉండగా ఇన్ టైమ్‌లో మూడోసారి ఓవర్ స్టార్ట్ చేయనందుకు అమెరికాకు 5 రన్స్ పెనాల్టీ పడింది. దీంతో విజయసమీకరణం 30 బాల్స్‌లో 30 రన్స్‌గా మారగా, సూర్య 6, 4, 2, 2 బాదాడు. దూబే నాలుగో వికెట్‌కు 67 రన్స్ జోడించి జట్టును గెలిపించారు.
ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో ఇన్నింగ్స్ తొలి బాల్‌కే వికెట్ పడగొట్టిన ఇండియా తొలి బౌలర్ అర్ష్‌దీప్
సంక్షిప్త స్కోర్లు
అమెరికా : 20 ఓవర్లలో 110/8 (నితీశ్ 27, స్టీవెన్ 24, అర్ష్‌దీప్ 4/9, పాండ్యా2/14).
ఇండియా : 18.2 ఓవర్లలో 111/3 (సూర్య 50*, శివమ్ దూబే 31*, సౌరభ్ 2/18).