
పోయిన ఏడాది బాలిలో జరిగిన జీ20 సమావేశాలకు తన ఆరేండ్ల కూతుర్ని తీసుకెళ్లింది ఇటాలియన్ ప్రధానమంత్రి జోర్జా మెలోని. అప్పట్లో ఇటాలియన్ మీడియా దాన్నో పెద్ద వార్తగా ఫోకస్ చేసింది. ‘‘తల్లిగా అది నా హక్కు. దాన్నో పెద్ద విషయంగా ఎందుకు చూస్తున్నారు? నేను ప్రధానమంత్రినే కావచ్చు. కానీ ఒక తల్లిని కూడా. నిజానికి నా కూతుర్ని తీసుకుని ఎన్నో అంతర్జాతీయ సమావేశాలకు వెళ్లాను. ప్రపంచంలో ఉన్న చాలామంది లీడర్లు నా కూతురితో సహా నాకు వెల్కం చెప్పారు.
ముఖ్యంగా జపాన్, భారత ప్రధాన మంత్రి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు.జులైలో అధికారిక పర్యటనకు నా కూతురు గినెవ్రాను తీసుకుని వెళ్లా. అప్పుడు యు.ఎస్. ప్రెసిడెంట్ జో బైడెన్ చాలా బాగా నన్ను రిసీవ్ చేసుకున్నారు. అంతెందుకు యూరోపియన్ యూనియన్ సమ్మిట్ అప్పుడు జినెవ్రా, యూరోపియన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ చార్లెస్ మైఖేల్ కూతురు... ఇద్దరూ కలిసి ఆడుకున్నారు. తల్లి లేదా తండ్రి ఎక్కువకాలం పిల్లలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితులు చాలామంది తల్లిదండ్రులకి ఎదురవుతూనే ఉంటాయి. అలాంటప్పుడు దూరంగా వెళ్లినప్పుడు వాళ్లు తల్లిదండ్రుల్ని మిస్ అవ్వకుండా ఏవైనా ఏర్పాట్లు చేయాలి. లేదా వీలైనంత వరకు పిల్లల్ని వదిలి పెట్టకుండా మనతోనే ఉంచుకోవాలి.
అందుకే వీలైనప్పుడు జినెవ్రాను నాతో తీసుకెళ్తా. ఫ్రీ టైంలో తనతో గడుపుతా. ఇలాచేయడం వల్ల ఆ పాపకు కూడా కొత్త ఎక్స్‌పీరియెన్స్ ఉంటుంది. దానికంటే కూడా పాప నాతో ఉంటే నేను మరింత స్ట్రాంగ్‌గా ఫీలవుతా” అని కాస్త గట్టిగానే చెప్పింది 46 ఏండ్ల ఈ ప్రధాని. ఈమె జీవిత భాగస్వామి టెలివిజన్ జర్నలిస్ట్ ఆండ్రియా జియాంబ్రునో.