చైనాకు చెక్​ పెడ్తున్న ఇండియా!

ప్రపంచాన్ని శాసించాలనుకున్న చైనాకు ఇండియా అన్ని విషయాల్లో చెక్​పెడుతూ వస్తున్నది. ఆర్థికంగా పరిస్థితులను మెరుగుపరుచుకోవడంతోపాటు దేశ ఎగుమతులను పెంచుతున్నది. సమర్ధమైన దౌత్య నిర్ణయాలతోనూ ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్నది. మున్ముందు ఈ వృద్ధి ఇలాగే కొనసాగే అవకాశం ఉంది.  చైనా ప్రపంచాన్ని తన గుప్పిట్లో ఉంచుకోవాలనే ఉద్దేశంతో 2000లలో రెండు అంశాలపై ప్రధానంగా దృష్టి పెట్టింది. ఒకటి చౌకగా వస్తువులను తయారు చేయడం, ప్రపంచంలోని మిగతా దేశాల తయారీని నిలువరించడం. ఏ వస్తువు తీసుకున్నా, కొన్నా అది చైనాది అయి ఉండాలనేది దాని లక్ష్యం. స్పూన్ల నుంచి స్టీల్ మెషినరీ దాకా, సోలార్ ప్యానెల్స్​నుంచి షిప్​కంటెయినర్ల వరకు చైనా చౌకగా తయారు చేస్తున్నది. 10 టన్నుల నుంచి 20 టన్నుల సామర్థ్యం గల కంటెయినర్ల తయారీలో చైనాదే 60 శాతం వాటా. ప్లాస్టిక్ వస్తువుల్లో కూడా 55 శాతం ఉత్పత్తి  చైనాదే. ఫలితంగా ఇండియా సహా అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్, దక్షిణ అమెరికా, ఆఫ్రికా దేశాల్లో ప్లాస్టిక్, స్టీల్ పరిశ్రమలు ఇబ్బందుల్లో పడ్డాయి. ఇండియాలో ప్రైవేటు స్టీల్ ఫ్యాక్టరీలపై దెబ్బపడింది. లక్ష కోట్లు నిరర్థక ఆస్తులు తయారయ్యాయి. అలాగే ఫార్మాలో బేసిక్ డ్రగ్ ముడి పదార్థాలు(ఏపీఐ) తయారీని ఒక్క  చైనా తప్ప ప్రపంచంలో మిగతా అన్ని దేశాలు మానేశాయి. అలా 2005 నుంచి 2010 దాకా ప్రపంచ పరిశ్రమను మలుపు తిప్పిన చైనా, 2010 తర్వాత మరో వ్యూహం అవలంబించింది. భారీ పరిశ్రమల నుంచి చిన్న పరిశ్రమల వరకు వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టింది. ప్రతి దేశంలో కొత్త కంపెనీలకు ఫైనాన్స్ చేసి చౌకగా పెద్ద వాటాలు కొట్టేసింది. మిలటరీ పరంగానూ అమెరికాను, రష్యా ను సవాలు చేసే స్థితికి చేరింది. 2015 నాటికి చైనా ఇండియాకు అతి పెద్ద సప్లయర్​గా మారింది. అమెరికా, ఆఫ్రికా దేశాలకు కూడా చైనా డబ్బు, చైనా వస్తువుల అవసరం బాగా ఏర్పడింది. 

చైనాకు నష్టాలు తప్పలేదు

2016 లో మన ప్రభుత్వం దేశంలో, ముఖ్యంగా శివకాశిలోని టపాసుల పరిశ్రమను కాపాడాలని చైనా టపాసుల దిగుమతిపై నిషేధం విధించింది. ఫలితంగా చైనాకు రూ.2000 కోట్ల దెబ్బ పడింది. స్టీల్​దిగుమతి విషయంలోనూ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. 2016 సెప్టెంబర్ లో ఉక్కు పరిశ్రమ బాగా దెబ్బతిన్నది. చైనా స్టీల్ దిగుమతిపై ఇండియా డంపింగ్ చార్జి(డ్యూటీ) వేసింది. దీంతో 2018 నుంచి మన దేశ స్టీల్ అమ్మకం బాగా పెరిగి చైనాకు దాదాపు రూ.30 వేల కోట్ల స్టీల్ వ్యాపారం పోయింది. 2018 నుంచి అమెరికా కూడా ఇండియా లాగే చైనా దిగుమతులు తగ్గించాలని డంపింగ్ చార్జి వేసింది. 2019 నుంచి ఇండియాలో ‘మేక్​ఇన్​ఇండియా’ నినాదం మొదలైంది. ఫార్మాకి కావాల్సిన ముడి సరుకులు, ఆటోమొబైల్ విడి భాగాలు ఇండియాలోనే చేసేలా పీఎల్ఐ స్కీమ్స్​ ప్రవేశపెట్టింది. దీంతో 2021 నాటికి ఇండియాకు ఆటోమొబైల్ విడిభాగాలు పంపడం చైనా బాగా తగ్గించింది. దేశంలో కొత్తగా ఉత్పాదన మొదలుపెట్టే కంపెనీలకు ఇన్​కమ్​ట్యాక్స్​15 శాతం చేసింది. చైనా, కొరియా, సింగపూర్, మలేషియాలో కూడా ఇన్​కమ్​ట్యాక్స్15 శాతమే. దాంతో సింగపూర్, అమెరికన్ కంపెనీలు చైనాతో సమానంగా ఇండియాలో పెట్టుబడులు పెట్టడం ప్రారంభించాయి.  2020 నాటికి ప్రైవేటు భాగస్వామ్యంతో రక్షణ రంగంలో లక్ష కోట్ల పెట్టుబడులు ఇండియాకు వచ్చాయి. 10 ఇండియన్ కంపెనీల మిలటరీ దళాలకు కావాల్సిన అన్ని ఆయుధాలు, చివరకు ఇజ్రాయిల్ ​సాయంతో సబ్ మెరైన్​ చేసే స్థాయికి ఇండియా చేరుకుంది. ఫలితంగా సరిహద్దుల్లో అప్పుడప్పుడు సందడి చేయడం తప్ప చైనా ఏమీ చేయలేక పోయింది.

పీఎల్ఐ స్కీమ్​తో..

2022 నాటికి ఇండియా – చైనా వాణిజ్యం మూడు లక్షల కోట్ల నుంచి లక్ష కోట్లకు పడి పోతుందని అంచనా. అంటే చైనాలో అనేక పరిశ్రమలు మూతబడతాయి. ఇండియా, జపాన్, ఆస్ట్రేలియా, అమెరికా సభ్యులుగా ఉన్న క్వాడ్​కూటమితో సముద్ర జలాల్లో చైనా దూకుడును తగ్గించింది. ప్రొడక్షన్​లింక్డ్​ఇన్సెంటీవ్(పీఎల్ఐ)​ స్కీమ్​ ప్రారంభించిన తర్వాత ఇండియాకు అమెరికా నుంచి కంపెనీలు రావడం పెరిగింది. చైనాకు ఇది మరో దెబ్బ. ఇండియా చైనాను బాగా నియంత్రిస్తున్నదని ప్రపంచ దేశాలు గుర్తిస్తున్నాయి. ఇండియా చైనాను దెబ్బకొడుతున్న తీరును ప్రపంచంలో మరి కొన్ని దేశాలు సైలెంట్​గా అనుసరిస్తున్నాయి. ఈ పరోక్ష యుద్ధంలో ఇప్పటికి చైనాపై ఇండియాదే పైచేయి.

ఎగుమతుల్లో రికార్డు

ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటీవ్ పథకం ప్రకారం కంపెనీ అమ్మకాలలో ప్రభుత్వం 5 శాతం బెనిఫిట్ ఇస్తున్నది. దీనికి టాక్స్ ఉండదు. ఈ స్కీమ్ ప్రకారం రక్షణ రంగంలో 17 ప్రైవేట్ కంపెనీలు ప్రొడక్షన్ మొదలు పెట్టాయి . 2021–-22లో అవి మొత్తం రూ.12,980 కోట్ల రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేశాయి. ఇందులో ప్రైవేట్ కంపెనీల ఎగుమతుల విలువ రూ.7800 కోట్లు. ఇది ఒక రికార్డు. ఎప్పుడూ దిగుమతి చేసుకోవడం తప్ప 2016 దాకా పెద్దగా ఎగుమతులు చేయలేని ఇండియాను చూసి ప్రపంచ దేశాలు ఆశ్చర్యపోతున్నాయి. విశాఖ పట్నం షిప్ యార్డులో సొంత సబ్ మెరైన్  చేయడం మరో గొప్ప ప్రత్యేకత. రష్యా అమెరికాల మీద ఆధార పడటం క్రమంగా తగ్గుతున్నది. 2021–22 సంవత్సరంలో ఇండియా రూ.5 వేల లోపు ధర కలిగిన మొబైళ్లను 4,40,00,000 ఎగుమతి చేయడం చైనాకు కంటగింపుగా మారింది. తాజాగా సెమి కండక్టర్(ఎలక్ట్రికల్ వెహికల్స్ కి) బ్యాటరీలు తయారు చేయడానికి ఓ పెద్ద కంపెనీ రావడం మరో మలుపు. గవర్నమెంట్ లెక్కల ప్రకారం ఇండియాలో 43 కోట్ల మంది యూపీఐ ద్వారా పేమెంట్లు చెల్లిస్తున్నారు. దాంతో టాక్స్ కట్టే వారి సంఖ్య పెరుగుతోంది. బట్టల దుకాణాల్లో కూడా ఆన్ లైన్ పేమెంట్స్​ జరుగుతుండటంతో వేల మంది ఇన్ కమ్ టాక్స్ కడుతున్నారు, జీఎస్టీ  వసూళ్లు రికార్డు స్థాయిలో ఉంటున్నాయి. ఇలా ఇండియా మిగతా దేశాలకు ఏ మాత్రం తగ్గగుండా దూసుకుపోతున్నది.

- శ్రీకంఠా వెంకటాచలపతి
రిటైర్డ్​ బ్యాంక్ ​మేనేజర్