రాబోయే కాలంలో సెమీ కండక్టర్​ తయారీ హబ్​గా భారత్​: అశ్వినీ వైష్ణవ్​

  • 2025 ప్రారంభంలోనే తొలి మేడిన్ ఇండియా చిప్

బెంగళూరు: వచ్చే ఏడాది ప్రారంభంలోనే మొదటి మేడిన్​ఇండియా చిప్ లను మైక్రాన్​టెక్నాలజీ తీసుకొస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ తెలిపారు. రాబోయే కాలంలో  ప్రపంచానికి భారత్​ సెమీకండక్టర్​హబ్​గా మారనుందని చెప్పారు. ఈ రంగంలోకి  భారీ పెట్టుబడులు వస్తున్నాయన్నారు. ఇటీవల న్యూయార్క్​లో ప్రపంచంలోనే టాప్​ టెక్​సీఈవోలతో ప్రధాని మోదీ భేటీ అయిన విషయాన్ని ప్రస్తావించారు. 

గత 30–40 ఏండ్లలో ప్రపంచంలోని ఏ దేశంలోనూ ఇంత ఉత్సాహం చూడలేదని 3 కంపెనీల ప్రతినిధులు అన్నారని చెప్పారు. కేంద్రం రూ.1.52 లక్షల కోట్ల పెట్టుబడితో 5 సెమీ కండక్టర్ల తయారీ ప్రతిపాదనలను ఆమోదించింది. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​ఆదివారం  మాట్లాడుతూ.. . సీజీ పవర్​ సెమీ కండక్టర్​ఫెసిలిటీ ఏర్పాటు పనులు కొనసాగుతున్నాయని వెల్లడించారు. అస్సాంలోని టాటా కంపెనీ ఏటీఎంపీ ఫెసిలిటీ పనులు కూడా జరుగుతున్నాయని తెలిపారు. 

మోదీ విజన్​కు సెమీ కండక్టర్​ఇండస్ట్రీ వృద్ధి ఊతం

ప్రధాని మోదీ విజన్​కు సెమీ కండక్టర్​ఇండస్ట్రీ వృద్ధి ఊతంలా నిలుస్తుందని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్​పేర్కొన్నారు. ‘‘సెమీ కండక్టర్​అనేది ఫౌండేషనల్​ఇండస్ట్రీ. ఇందులో తయారయ్యే చిప్​లు వైద్య పరికరాలు, మొబైల్​ఫోన్స్​, ల్యాప్​టాప్స్​, కార్లు, రైళ్లు, టీవీలు.. ఇలా అన్నిచోట్ల వినియోగిస్తారు” అని వివరించారు. సాధారణ పౌరుడికి కూడా టెక్నాలజీని చేరువ చేయడమే కేంద్ర సర్కారు లక్ష్యమని, ఇప్పటివరకూ చేపట్టిన డిజిటల్​ ఇండియా మిషన్​ అయినా.. టెలికాం మిషన్​ అయినా ఇందుకోసమే పనిచేసినట్టు చెప్పారు.