కొత్త ఆర్థిక శక్తిగా ఇండియా : డా. కె. లక్ష్మణ్

సాధారణంగా ‘గుజరాతీ’లు వ్యాపార మనస్కులనీ, పిసినారితనం కలిగి ఉంటారని అందరూ అంటుంటారు. అది నిజమే! డబ్బు విలువ తెలిసినవాళ్లు ఎవరైనా అలాగే చేస్తారు. ప్రధాని మోడీ మీద కూడా ‘గుజరాతీ’ల ప్రభావం ఉండొచ్చు. అందరూ రాజకీయపార్టీలను నడుపుతారు. తమ విజయాలకు, వైఫల్యాలకు సంబంధించిన ఫలితాల కోసం పీఆర్​ఓలను, సర్వేలను నమ్ముకుంటారు. కానీ ప్రధాని మోడీ ఎప్పటికప్పుడు తనను తాను పరీక్షించుకోవడానికి ప్రజలనే గీటురాయిగా పెట్టుకుంటారు. ‘కరోనా’ వస్తే ఇండ్లముందు దీపాలు పెట్టడం, చప్పట్లు కొట్టడం అలాంటి పరీక్షే. ఇటువంటి ‘ఖర్చు లేని సర్వే’ లతో ఆ సమయానికి తన పనితీరును అంచనా వేసుకుంటుంటారు. అలాగే ‘మన్ కీబాత్’ మొదలుకొని ఇటీవలి ‘హర ఘర్ తిరంగా’ వరకు కూడా అలాంటివే. నోట్లరద్దు వైఫల్యం అని ప్రతిపక్షాలు, గిట్టని మేధావులు ఆడిపోసుకుంటారు. కానీ బయటి దేశాలకు వెళ్లే ‘నల్లధనం’ ఆగిందని ఎందరికి తెలుసు! అందుకే సామాన్యులు లైన్​లో నిలబడ్డా మోడీ చేసేది ‘రైటు’ అనుకున్నారు. అక్రమ ఎన్జీవోల నిషేధం వల్ల దేశం ఇప్పుడు ‘స్వావలంబన’ వైపు నడుస్తున్నది. దీని ఫలితాలు దీర్ఘకాలంలో కాదు ఇపుడే మనముందుకు వస్తున్నాయి. ప్రపంచంలో పెద్ద దేశాలుగా పేరొందిన అమెరికా, రష్యా, ఫాన్స్, బ్రిటన్, చైనాలాంటి దేశాలు ఆర్థిక సంక్షోభాలతో విలవిలలాడుతున్నా భారత్ తలఎత్తి నిలబడ్డానికి కారణం మోడీ నేతృత్వంలోని కేంద్రం అనుసరించిన విధానాలు అని త్వరలోనే అర్థమవుతుంది. ఇపుడు ప్రపంచవ్యాప్తంగా గణాంకాలు, రిపోర్టులు, చూస్తే భారత్ ఆర్థిక వ్యవస్థ వెయ్యి రెట్లు గొప్పగా ఉందని నిపుణులు చెబుతున్నారు. ఎంతమంది ఆర్థికవేత్తలు ఈ దేశ ఆర్థిక వ్యవస్థను విశ్లేషించినా గత ప్రభుత్వాలు చేసే ఆర్థిక లావాదేవీల అక్రమాలను అరికట్టలేకపోయారు. ఇపుడు అక్రమాలకు అడ్డుకట్టవేస్తుంటే దాన్ని ‘నిర్బంధము, దాడి’ అంటూ కొందరు దుష్ప్రచారం చేస్తున్నారు.

మిగతా దేశాల కంటే మెరుగైన వృద్ధి

ఇటీవలి రిపోర్ట్ ఆధారంగా చూస్తే యూఎస్ వృద్ధిరేటు 1.7 శాతం కాగా ద్రవ్యోల్బణం 8.1 శాతం తక్కువ వృద్ధి, ఎక్కువ ద్రవ్యోల్బణంతో ప్రపంచదేశాలకు ప్రమాద ఘంటికలను మోగిస్తున్నది. అలాగే ఇప్పుడు ప్రపంచం మీద స్వారీ చేయాలనుకుంటున్న చైనా 3.3 శాతం వృద్ధి రేటుతో 2.0 శాతం ద్రవ్యోల్బణంతో మధ్యమస్థాయి వృద్ధిరేటు, యూఎస్ ముఖ్య పారిశ్రామిక రంగంలో భాగస్వామ్యం ఉండే జపాన్ 1.5% తక్కువ వృద్ధిరేటుతో, 2.5% ద్రవ్యోల్బణంతో సాగుతున్నది. ప్రపంచాన్ని శాసించిన యూకే 4.4% వృద్ధిరేటుతో 8.0% ద్రవ్యోల్బణంతో తిరోగమనంలో ఉంది. అలాగే ఫ్రాన్స్ 2.4% వృద్ధిరేటుతో, 6.0% ద్రవ్యోల్బణంతో ఉండగా వీటన్నిటికన్నా భారత్ ఎన్నో రెట్లు మెరుగ్గా ఉంది. 7.0 % వృద్ధిరేటు 6.9% ద్రవ్యోల్బణంతో ముందుకు సాగుతున్నది. ప్రపంచంలోని ముఖ్యమైన ఏడు ఆర్థిక సూచీల్లో భారత్ పరిస్థితి వెయ్యి రెట్లు మెరుగ్గా ఉండేందుకు గత 8 ఏండ్లుగా నరేంద్రమోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలే కారణం. ఇండ్లు, మందులు, కార్లు, మోటార్లు, సరికొత్త వసతులు, స్థిరాస్తి రంగం, వ్యవసాయం, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో మాధ్యమిక కొనుగోలు పెరుగుదల కన్పిస్తున్నది. అలాగే యూరప్ ఆర్థిక విధానాలను శాసించే జర్మనీలో ఎలక్ట్రానిక్ వస్తువుల ధరలు ఒక్కసారిగా పెరిగాయని రిపోర్టులు చెబుతున్నాయి. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న శ్రీలంకలో ఇంధనం, ఫర్టిలైజర్, మందుల ధరలు ప్రజలు కొనలేని స్థితికి చేరాయి. తిండి పదార్థాల ధరలు 84% పెరగడంతో అక్కడి ప్రజలు రోడ్లమీదకు వచ్చి ఆందోళన చేస్తే, పాలకులు దేశం విడవాల్సిన పరిస్థితి వచ్చింది. పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితులు చూసి బలూచీలు, సింధు ప్రావిన్సులోని ప్రజలు కొందరు వేరే దేశాలకు వెళ్లిపోతాం అంటున్నారు. ప్రపంచంలో అగ్రగామి దేశాలైన అమెరికా, రష్యాలు సరికొత్త సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. డొనాల్డ్ ట్రంప్ దిగిపోతే తను సరిచేస్తానని అధికారంలోకి వచ్చిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చేతులెత్తేశాడు. రష్యా-– ఉక్రెయిన్ యుద్ధంతో రష్యా ఆర్థిక పరిస్థితి గిడసబారింది.

విన్​ విన్​ పాలసీతో..

చైనా అన్ని దేశాలను తనపై ఆధారపడేలా చేసే మార్కెట్​ను స్పష్టించండతో దానిమీద ఆధారపడిన దేశాలు మెల్లగా చైనా విష కౌగిలిలోకి వెళ్తున్నాయి. శ్రీలంక సముద్ర భాగాన్ని రుణగ్రస్తం చేసి ఆక్రమించింది. అలాగే పాక్​ను తన కబంధహస్తాల్లోకి లాగేసుకొంటున్నది. పాక్​లో వేల కోట్ల పెట్టుబడులతో కబ్జాకు పూనుకుంటున్నది. భారత్ ఇందుకు భిన్నంగా ‘విన్ -విన్ పాలసీ’తో పెట్టుబడి భాగస్వామ్యం కల్పిస్తున్నది. సరికొత్త కల్పనల ద్వారా వివిధ రంగాలకు ఊతమిస్తున్నది. భారత వినూత్న సున్నిత భాగస్వామ్యం ద్వారా వ్యాపారం సాధించే వైపు అడుగులు వేస్తున్నది. ఉత్పత్తి, ఉపాధి, ఏకకాలంలో కలిగిస్తూ అవసర, అత్యవసర రంగాలకు భాగస్వామ్యం మళ్లించడం వల్ల భారత్ పరిపుష్టమైన ఆర్థిక రంగం వైపు అడుగులు వేస్తున్నది. యూస్, యూకే లాంటి సంపన్న దేశాలు విలాసం, వినియోగం వంటి విషయాల్లో క్రమశిక్షణ లేకుండా ప్రవర్తించడం వల్ల వాళ్ల ఆర్థిక స్థితిగతులు స్పీడ్ బ్రేకర్లతో సాగుతున్నాయి.

ఆర్థిక స్వావలంబన

గత సెప్టెంబర్ మాసాంతానికి వివిధ దేశాల్లో ఆహారపదార్థాల ధరలు పెరుగుదలను కొన్ని రిపోర్టులు చూసి ఆర్థికవేత్తలే ముక్కున వేలేసుకుంటున్నారు. యూఎస్ +25, జర్మనీలో +33, యూకేలో +18, భారత్​లో +1 శాతం పెరిగాయి. ఇండ్ల ధరలు యూఎస్ +21, జర్మనీలో +21, యూకేలో +30 ఉంటే భారత్​లో కేవలం +6 మాత్రమే పెరిగాయి. అలాగే ఇటీవల మెటా, ట్విట్టర్, ఇతర సాప్ట్​వేర్ కంపెనీలు, పరిశ్రమలు ఉద్యోగులను తొలగిస్తున్నాయి. అనవసర ఖర్చుల కింద చూపిస్తూ ఎన్నో పేరుమోసిన లేదా అనామక కంపెనీలు తమ ఉద్యోగులను నిర్దాక్షిణ్యంగా తొలగించేస్తున్నాయి. ఉన్నవారిపై భారం పెంచుతున్నాయి. కానీ భారత్ సరాసరి ప్రత్యక్ష, పరోక్ష రంగంలో నెలకు15 లక్షల ఉద్యోగాల కల్పన చేయడం ఆశ్చర్యం కలిగించే విషయంగా చెప్పొచ్చు. ప్రైవేట్, ప్రభుత్వ రంగాల్లో ఇలాంటి స్థిరకల్పన వల్ల ‘నిరుద్యోగం’ పెద్ద ఎత్తున నియంత్రించే బృహత్తర ప్రయత్నం ఇది. ఎవరు ఎన్ని విమర్శలు గుప్పించినా ‘ధీరుల్ విఘ్ననిహన్యమానులగుచున్’ అన్నట్లుగా ‘నమో టీమ్’ ధృఢ సంకల్పంతో చేస్తున్న ఈ దేశభక్తి యజ్ఞాన్ని ప్రపంచ దేశాల నిపుణులు గౌరవిస్తున్నారు. మోడీని ప్రశంసిస్తూ అమెరికా సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ(సీఐఏ) డైరక్టర్ బాల్బర్న్ ‘రష్యా-– ఉక్రెయిన్ మధ్య అణుయుద్ధం జరగకుండా మోడీ ఆపారు’ అని ప్రశంసించారు. కరోనా తర్వాత అనేక అభివృద్ధి చెందిన దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోగా భారత్ మాత్రం క్రమశిక్షణ, పరస్పర సహకారం, అవినీతి లేని పరిపాలన, సుపరిపాలన, ప్రజా భాగస్వామ్యం, జవాబుదారీతనంతో కూడిన కొత్త ఆర్థిక శక్తిగా అవతరించడం భారత ప్రజలకు శ్రేయోదాయకం.

జీ 20కి నాయకత్వం వహించే స్థాయి

140 కోట్లకు పైగా జనాభా ఉన్న ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను చక్కబెట్టడం, నిలకడగా ఉంచడం అంత ఈజీ కాదు. ఎస్ అండ్ సీ అనే గ్లోబల్ రేటింగ్ ఏజెన్సీ ఇటీవల ఓ సర్వే రిపోర్ట్ ఇచ్చింది. యూఎస్, యూరోపియన్ దేశాలు రాబోయే కాలంలో ఆర్థిక సంక్షోభాలు ఎదుర్కోబోతున్నాయి. ఒక్క భారత్ మాత్రమే ఈ ప్రమాదం నుంచి తప్పించుకొనే అవకాశం ఉందన్నది ఆ సర్వే సారాంశం. రష్యాలాంటి అగ్రదేశం ఉక్రెయిన్​తో యుద్ధం చేసి తమ ఆర్థిక శక్తిని ధ్వంసం చేసుకుంటుండగా, పాక్, శ్రీలంక వంటి దేశాలు మునుపెన్నడూ లేని ఆర్థిక సంక్షోభం ఎదుర్కొంటున్నాయి. పెట్రోల్ మొదలుకొని నిత్యావసర వస్తువుల వరకు ఆయా దేశాల్లో తీవ్ర ఆందోళన ఉంది. మరోవైపు 2005 తర్వాత అమెరికా అనుసరించిన ఆర్థిక విధానాలు ఆ దేశానికే శాపం అయి కూర్చున్నాయి. ప్రపంచంపై వాళ్ల ఆర్థిక ఆధిపత్యం తగ్గడంతో అక్కడి వనరులను ఎవరూ అడగని స్థితి వచ్చింది. మరీ ముఖ్యంగా మనలాంటి ఎక్కువ జనాభా గల దేశాలు ‘పెద్ద వినియోగదారులు’గా అక్కడి వ్యాపార వ్యవస్థలు భావించేవి. ప్రధాని మోడీ తీసుకున్న కఠిన ఆర్థిక నియమాల వల్ల దేశం ఇపుడు స్వావలంబన దిశగా వెళ్తున్నది. ఐఎంఎఫ్ మేనేజింగ్ డైరెక్టర్ ‘క్రిస్టిలీనా జార్జువా’ ఇదే విషయాన్ని నొక్కి చెబుతూ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆర్థికమాంద్యం అనే చీకటిలో వెలుగుదివ్వెగా భారత్ మాత్రమే కన్పిస్తున్నదని వ్యాఖ్యానించారు. ప్రపంచలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్న యూఎస్, యూరోపియన్ యూనియన్, చైనా దేశాల పరిస్థితి కూడా ‘మేడిపండు’ చందంగా ఉంది. 6.1% శాతం వృద్ధిరేటుతో భారత్ దూసుకుపోయేందుకు ప్రభుత్వం అనుసరించిన విధానాలే కారణం. నిర్మాణాత్మక సంస్కరణలు, డిజిటలైజేషన్ అనే రెండు కారణాల వల్ల భారత్ తన అస్థిత్వం నిలబెట్టుకొని ఆర్థికమాంద్యం నుంచి స్వీయరక్షణ పొందింది. కాబట్టే భారత్ జీ20కి నాయకత్వం వహించే స్థాయికి చేరింది.

- డా. కె. లక్ష్మణ్,రాజ్యసభ సభ్యులు, ఓబీసీ మోర్చా జాతీయ అధ్యక్షులు