ఎత్తైన రైల్వే బ్రిడ్జ్లు నిర్మించడంలో ఇండియా గ్రేట్

ఇటుకలతో కట్టిన కట్టడాల్లో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైనది కుతుబ్​ మినార్​. హైట్​ 73 మీటర్లు(239.5 ఫీట్లు). అదే అంత గొప్ప నిర్మాణంగా పేరు తెచ్చుకుంటే దానికి రెట్టింపు ఎత్తులోని పిల్లర్లపై కట్టే బ్రిడ్జిని ఒక్కసారి ఊహించుకోండి.. ఇంకెంత గ్రేట్​ అంటారో. అది కూడా మరెక్కడో లేదు. మన దేశంలోనే ఉంది. ఈశాన్య రాష్ట్రం మణిపూర్​లో ఈ నిర్మాణం పూర్తికావొస్తోంది. వరల్డ్​ టాలెస్ట్ గర్డర్​ రైల్వే బ్రిడ్జిగా త్వరలో సరికొత్త చరిత్ర సృష్టించనుంది. ఈ రికార్డు ఇప్పటిదాకా యూరప్​లోని మాంటెనీగ్రోలో మాలా–రిజెకా వయడక్ట్​ పేరిట ఉంది.

మణిపూర్​లోని నానీ జిల్లాలో ఇజాయి నదిపైన లోయ ప్రాంతంలో ఓ గొప్ప రైల్వే బ్రిడ్జ్​ కడుతున్నారు. ఒక్కో పిల్లర్ హైట్​ 141 మీటర్లు(462.5 ఫీట్లు). మాలా–రిజెకా వయడక్ట్​ ఎత్తు 139 మీటర్లు. దీనికన్నా రెండు మీటర్ల హైట్​లోనే మన రైల్వే బ్రిడ్జి ఉండనుంది. దీన్ని జిరిబామ్​–తుపుల్​–ఇంఫాల్​ రైల్వే లైన్​లో భాగంగా నిర్మిస్తున్నారు. ఈ రైల్వే లైన్​ ఈశాన్యంలోని సెవెన్​​ సిస్టర్​ స్టేట్స్​ని(మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్​, త్రిపుర, అస్సాం, అరుణాచల్​ప్రదేశ్​లను) కలపటమే కాకుండా ఆ ప్రాంతాన్ని ఆసియా దేశాలతోనూ కనెక్ట్​ చేస్తుంది.

రాష్ట్ర రాజధానికి రైలు భాగ్యం

మోడీ సర్కారు యాక్ట్​ ఈస్ట్​ పాలసీలో భాగంగా మణిపూర్​లో తొలిసారిగా బ్రాడ్​ గేజ్​ రైల్వే లైన్​ని నిర్మిస్తోంది. 111 కిలోమీటర్ల పొడవున కడుతున్న ఈ మార్గంలో 45 టన్నెల్స్​ తవ్వకం, బ్రిడ్జిల నిర్మాణం ఏడేళ్ల కిందట మొదలైంది. తొలి దశ పనులు తమెగ్లాంగ్​ జిల్లా జిరిబామ్​ ప్రాంతం నుంచి తూర్పున నానీ జిల్లాలోని తుపుల్ ఏరియా దాక, రెండో దశ పనులు తుపుల్​ నుంచి ఇంఫాల్​ వరకు నడుస్తున్నాయి. మణిపూర్​ రాష్ట్ర రాజధాని ఇంఫాల్​కి ఇప్పటివరకూ రైల్వే కనెక్టివిటీయే లేదు. ఈ లైన్​తో ఆ లోటు తీరిపోతుంది.

బ్రిడ్జ్​ నంబర్​ 164‌‌.. సవాళ్లు లక్షా 94

ఈ రైల్వే లైన్​లో కడుతున్న పలు బ్రిడ్జిల్లో ఇది కీలకమైన బ్రిడ్జి. దీనికి 164వ నంబర్ కేటాయించారు. రైలు పాతిక టన్నుల వరకు యాక్సిల్​–లోడ్​ ఫ్రీట్, గంటకు 120 కిలోమీటర్ల మ్యాగ్జిమం స్పీడ్​తో దూసుకుపోయేలా బ్రిడ్జ్​ను డిజైన్​ చేశారు. బ్రిడ్జి కడుతున్న ప్రాంతం సీస్మిక్​ జోన్​–5 పరిధిలోకి వస్తుంది. అంటే ఇక్కడ భూకంపాలు వచ్చే అవకాశాలు బాగా ఎక్కువ. అందువల్ల ప్రత్యేక చర్యలు చేపట్టారు. సైట్​ స్పెసిఫిక్​ డిజైన్​ స్పెక్ట్రమ్​ని డెవలప్​ చేశారు. భూకంపాలు, భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడకుండా మోడ్రన్​ టెక్నాలజీతో చెక్​ పెట్టారు.

బ్రిడ్జి ఎక్కువ కాలం మన్నేలా ముందుజాగ్రత్తలు తీసుకున్నారు. ఇన్ని టెక్నిక్​లతో రైల్వే బ్రిడ్జిని నిర్మిస్తుండటం ఈశాన్య ప్రాంతంలో ఇదే తొలిసారి. గంటకు 241 కిలోమీటర్ల వేగంతో గాలి వీచినా బ్రిడ్జి చెక్కుచెదరకుండా, సేఫ్టీగా ఉండాలంటే అన్ని విషయాలను అనలైజ్​ చేసి నిర్మించాలి. దీనికోసం స్పెషల్​ స్టడీలు చేయించారు. ఈశాన్య ప్రాంతంలో ఏడాదిలో దాదాపు 6 నెలలు వానలు పడతాయి. చల్లని వాతావరణం నెలకొంటుంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొనే పనులు చేస్తున్నారు. అవి చాలా వరకు పూర్తికావొచ్చాయి.

ఒక్క బిట్​కే రూ.400 కోట్లు

111 కిలోమీటర్ల పొడవున రైల్వే లైన్ నిర్మాణానికి మొత్తం బడ్జెట్​ సుమారు రూ.13,800 కోట్లు అవుతుందని అంచనా. ఇందులో రూ.400 కోట్లను బ్రిడ్జి నంబర్​–164కే (సేఫ్టీ వర్క్​ ఖర్చునీ కలుపుకొని) కేటాయించారు. మిలిటెంట్ల ఎటాక్​లు జరిగే ప్రమాదం ఉండటంతో వాటిని అడ్డుకునే ఏర్పాట్లు కూడా చేశారు. 365 రోజులూ, రోజుకి 24 గంటలూ సెక్యూరిటీ కవర్​ కల్పించనున్నారు. సీసీటీవీలు, రిమోట్​ మానిటరింగ్​ ఇన్​స్ట్రుమెంట్లు, సెన్సర్లతో కట్టుదిట్టమైన భద్రత ఉంటుంది. అయితే.. చీనాబ్​ బ్రిడ్జి మాదిరిగా ఇది బ్లాస్ట్​–ప్రూఫ్​ మాత్రం కాదు.

మూడు ఐఐటీలు చెయ్యేశాయి

బ్రిడ్జి నిర్మాణంలో వాడే ప్రతి వస్తువునీ టెస్ట్​​ చేసి, పాస్​ లేబుల్​ వేసి, గో–అహెడ్​ అనటానికి డెడికేటెడ్​ ల్యాబొరేటరీని, పరికరాలను, మ్యాన్​ పవర్​ను అందుబాటులో ఉంచారు. క్వాలిటీ కంట్రోల్​ సిస్టమ్​ని ఒకటికి రెండు సార్లు చెక్​ చేసి, గ్రీన్​ సిగ్నల్​ ఇవ్వటానికి నార్త్​ ఫ్రంటియర్​ రైల్వే (ఎన్​ఎఫ్​ఆర్​) బయటి సంస్థల సాయం కూడా తీసుకుంది. ఇందులో మూడు(కాన్పూర్​, రూర్కీ, గువాహటి) ఇండియన్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ టెక్నాలజీలు, సిల్చార్​లోని ఎన్​ఐటీ టెక్నికల్​ సపోర్ట్​ అందిస్తున్నాయి. డిజైన్ల ప్రూఫ్​–చెకింగ్​లో తలో చెయ్యేస్తున్నాయి.

మూడు జిల్లాల వాసులకు మురికి నీరే గతి

ఎజేయి నది మణిపూర్​లో ముఖ్యంగా మూడు జిల్లాల్లో ప్రవహిస్తోంది. సేనాపతి, తమెగ్లాంగ్​, నానీ అనే ఈ మూడు జిల్లాల్లో నాగా జాతి ప్రజలే ఎక్కువ. ఈ మార్గంలోని వివిధ గ్రామాల్లో నివసిస్తున్న లక్షా 40 వేల మందికి ఈ నదీ జలాలే ఆధారం. కానీ.. రైల్వే లైన్​ నిర్మాణం వల్ల నీరు పొల్యూట్​ అవుతోంది. అది తాగి జనం రోగాల బారిన పడుతున్నారు. పంటలు పండకపోవటంతో బతుకు దెరువు కోల్పోతున్నారు. ప్రాజెక్టుకి ఎన్విరాన్​మెంటల్​ క్లియరెన్స్​ తప్పనిసరని 2006 నోటిఫికేషన్​ చెబుతున్నా ఫారెస్ట్​ ఆఫీసర్ మాత్రం​ ఒప్పుకోవటం లేదు.

రైల్వే లైన్​ నిర్మాణ పనుల కారణంగా తాగు, సాగు నీరు కలుషితమవుతున్న విషయాన్ని మణిపూర్​ స్టేట్​ పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​(ఎంఎస్​పీసీబీ), ఎన్​ఎఫ్​ఆర్, రైల్వే మినిస్ట్రీల​ దృష్టికి తెచ్చినా మౌనం పాటిస్తున్నాయి. నేషనల్​ గ్రీన్​ ట్రిబ్యునల్​(ఎన్జీటీ)లోని ఈస్టర్న్​ జోన్​(కోల్​కతా) బెంచ్​లో మూడేళ్ల కిందట కేసు ఫైల్​ చేశారు. మణిపూర్​ సర్కార్​ని, సెంట్రల్​ ఎన్విరాన్​మెంట్​, ఫారెస్ట్​ అండ్​ క్లైమేట్​ ఛేంజ్​ మినిస్ట్రీని బాధ్యుల్ని చేశారు. ప్రభుత్వ సంస్థలేమో తమపై వస్తున్న ఆరోపణలను తోసిపుచ్చుతున్నాయి.

సొరంగం పొడవే పదిన్నర కిలోమీటర్లు

జిరిబమ్​–తుపుల్​–ఇంఫాల్​ రైల్వే లింక్​లో భాగంగా నిర్మించే 45 సొరంగాల్లో ఒకదాని పొడవు ఏకంగా 10.54 కిలో మీటర్లు. ఇది ఇండియన్​ రైల్వే నెట్​వర్క్​లో అత్యంత పొడవైంది. దీనికి పక్కన సర్వీస్​ టన్నెల్స్​ కూడా ఉంటాయి. మెయింటనెన్స్, ఎమర్జెన్సీ వంటి పరిస్థితులు తలెత్తినప్పుడు ఇబ్బంది రాకుండా ఈ ఏర్పాట్లు చేశారు. సొరంగాల తవ్వకంలో ఎన్​ఏటీఎం(న్యూఆస్ట్రేలియన్​ టన్నెలింగ్​ మెథడ్​) వాడుతున్నారు. ఈ రైల్వే బ్రిడ్జి పొడవు 703 మీటర్లు. బ్రిడ్జి పిల్లర్లను హైడ్రాలిక్​ ఆగర్స్​ సాయంతో నిర్మిస్తున్నారు.

ఇజాయి నదికి ముప్పు

ఏదైనా కొత్త సదుపాయం అందుబాటులోకి వస్తే ప్రజలకు మరింత ప్రయోజనం కలగాలి కానీ ఉన్న వసతికే ఎసరు పెడితే ఎలా? ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్​లోని జనాలు కూడా ఇదే అడుగుతున్నారు. అయితే.. ఈ ప్రశ్నకు జవాబు చెప్పేవారే కరువయ్యారు. అక్కడ నిర్మిస్తున్న బ్రాడ్​ గేజ్ రైల్వే లైను​.. ఎజేయి నదికి ముప్పులా మారింది. సమస్యను పర్యావరణ కార్యకర్తలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకి చెప్పినా ఫలితం లేకుండా పోతోంది. ఎన్జీటీ, ఎన్​ఎఫ్​ఆర్​, పొల్యూషన్​ కంట్రోల్​ బోర్డ్​ల దృష్టికి తెచ్చినా పట్టించుకున్న నాథుడు లేడు.

 

టాలెస్ట్​ రైల్వే పిల్లర్​

ప్రపంచంలోని అతిపెద్ద రైల్వే నెట్​వర్క్​ల్లో ఒకటైన ఇండియన్​ రైల్వేస్​.. బ్రిడ్జిల నిర్మాణంలో తనకుతానే సాటి అని నిరూపించుకుంటోంది. వరల్డ్​ లెవెల్లో రికార్డులు సృష్టిస్తోంది. కాశ్మీర్​లోని చీనాబ్​ నదిపై 359 మీటర్ల ఎత్తులో కడుతున్న బ్రిడ్జి నేలపై నుంచి లెక్కిస్తే హైట్​పరంగా ప్రపంచంలోనే ఎత్తైంది. మణిపూర్​లోని ఇజాయి నదిపై నిర్మిస్తున్న బ్రిడ్జి గర్డర్ల (పిల్లర్ల) హైట్​పరంగా టాలెస్ట్​ బ్రిడ్జిలా నిలవనుంది. చీనాబ్​ బ్రిడ్జి ఈఫిల్​ టవర్​ కన్నా 35 మీటర్లు ఎత్తులో ఉండగా మణిపూర్​ బ్రిడ్జి కుతుబ్​ మీనార్​ (73 మీటర్ల) కన్నా డబుల్ ఉంటుంది.