
టెస్టు క్రికెట్లో భారత్ నంబర్‌వన్
టెస్టు క్రికెట్లో టీమ్ ఇండియా నంబర్‌వన్‌గా నిలిచింది. ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి మరోసారి అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. 121 రేటింగ్ పాయింట్లతో భారత్ నంబర్‌వన్ స్థానం సాధించింది.
ఆసియా బ్యాడ్మింటన్
ఆసియా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో రంకిరెడ్డి సాత్విక్-సాయిరాజ్ - చిరాగ్‌శెట్టి జోడీ చరిత్రాత్మక డబుల్స్ స్వర్ణం సాధించింది. దీంతో బీడబ్ల్యూఎఫ్ తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్ ద్వయం అయిదో ర్యాంకులో నిలిచింది.
ఎస్‌సీవో సమ్మిట్
భారత్ నేతృత్వంలో షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీవో) విదేశాంగ మంత్రుల మండలి సమావేశం గోవా వేదికగా జరిగింది. ఈ కార్యక్రమంలో దాయాది పాక్ విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ పాల్గొన్నారు.
రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్‌కు నవరత్న హోదా
రైల్వేశాఖ ఆధ్వర్యంలోని ప్రభుత్వరంగ సంస్థ రైల్ వికాస్ నిగమ్ లిమిటెడ్(ఆర్‌వీఎన్‌ఎల్)కు కేంద్ర ప్రభుత్వం నవరత్న హోదా ప్రకటించింది. ఈ సంస్థ 2003 జనవరి 24న ఏర్పాటైంది. ఈ సంస్థ ఆథరైజ్డ్ షేర్ కేపిటల్ రూ.3వేల కోట్లు ఉంది.
మణిపూర్‌లో అల్లర్లు
ఈశాన్య రాష్ట్రం మణిపూర్‌లో మెజారిటీ ప్రజలైన మైతై వర్గానికి ఎస్టీ హోదా కల్పించాలనే డిమాండ్‌తో గిరిజనులు, గిరిజనేతరులు(మైతై) మధ్య హింసాత్మక ఘర్షణలు నెలకొన్నాయి. ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించడంతోపాటు, ఘర్షణ జరిగే ప్రాంతంలో ‘కనిపిస్తే కాల్చివేత’కు ఉత్తర్వులు జారీ చేశారు.
కులగణనకు బ్రేక్
కులగణనపై నీతీశ్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ సర్కార్‌కు పట్నా హైకోర్టు స్టే ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం కొనసాగుతున్న సర్వేను తక్షణం నిలిపివేయాలని, ఇప్పటివరకు సేకరించిన డేటాను భద్రంగా ఉంచాలని, ఎవరితోనూ ఆ సమాచారం పంచుకోరాదని పేర్కొంది.
సిద్ధార్థ మొహంతి
లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) చైర్మన్‌గా సిద్ధార్థ మొహంతిని ప్రభుత్వం నియమించింది. 2024 జూన్ వరకు మొహంతి ఈ పదవిలో కొనసాగుతారు. ఆ తర్వాత జూన్ 7, 2025 వరకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, మేనేజింగ్ డైరెక్టర్‌గా కొనసాగుతారు.
మల్లికార్జున ప్రసాద్
మహారత్న సంస్థ కోల్ ఇండియా చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ)గా తెలుగు వ్యక్తి పోలవరపు మల్లికార్జున ప్రసాద్ నియమితులయ్యారు. ప్రస్తుతం సెంట్రల్ కోల్‌ఫీల్డ్స్ సీఎండీగా ప్రసాద్ ఉన్నారు.
అరుణ్ గాంధీ
ప్రముఖ రచయిత, సంఘ సంస్కర్త, జాతిపిత మహాత్మా గాంధీ మనవడు అరుణ్ గాంధీ మహారాష్ట్రలోని కొల్హాపుర్‌లో అనారోగ్యంతో మరణించారు.1934, ఏప్రిల్ 14న దక్షిణాఫ్రికాలోని డర్బన్‌లో మణిలాల్ గాంధీ, సుశీలా మష్రువాలా దంపతులకు అరుణ్ గాంధీ జన్మించారు. ఈయన జర్నలిస్టుగా ఎక్కువ కాలం పని చేశారు.
అఫ్షాన్
పురుషుల్లో అత్యంత పొట్టి చేతులు కలిగిన వ్యక్తిగా ఇరాన్‌కు చెందిన అఫ్షాన్ గదేర్‌జాదే తాజాగా ప్రపంచ రికార్డుల్లోకి ఎక్కారు. అతడి ఎడమ చేయి 6.7 సెంటీమీటర్లు, కుడి చేయి 6.4 సెంటీమీటర్ల పొడవు ఉన్నాయి.
ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్
68వ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2023లో ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి (ఆలియా భట్), ఉత్తమ దర్శకుడు( సంజయ్ లీలా భన్సాలీ) సహా 9 విభాగాల్లో ‘గంగూబాయి కాఠియావాడి’ అవార్డులు సొంతం చేసుకుంది. ఉత్తమ నటుడిగా - రాజ్ కుమార్ రావు (బదాయి దో) పురస్కారం దక్కింది.
అజయ్ బంగా
ప్రపంచ బ్యాంక్ కొత్త అధ్యక్షుడిగా అజయ్ బంగా నియమితులయ్యారు. ప్రపంచ బ్యాంక్‌కు నాయకత్వం వహించనున్న తొలి భారతీయ అమెరికన్‌గా ఆయన నిలిచారు. జూన్ 2 నుంచి అయిదేళ్లు బంగా పదవిలో కొనసాగుతారని ప్రపంచ బ్యాంక్ వెల్లడించింది.
సెక్రటేరియట్‌కు గోల్డ్ రేటింగ్
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయానికి భారతీయ హరిత భవన మండలి (ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ) ప్రతినిధుల బృందం గోల్డ్ రేటింగ్ ఇచ్చింది. దేశంలోనే గోల్డ్ రేటింగ్ పొందిన తొలి సచివాలయం తెలంగాణ.
చార్లెస్ పట్టాభిషేకం
బ్రిటన్ రాజుగా ఇప్పటికే అధికారికంగా నియమితులైన మూడో ఛార్లెస్‌కు మే 6న పట్టాభిషేకం జరగనుంది. ఆడంబరంగా జరగబోతున్న ఈ వేడుకలో ఛార్లెస్‌తో పాటు ఆయన భార్య కెమిల్లా రాణిగా కిరీటం ధరిస్తారు.
ఆర్మీలో ఎలక్ట్రిక్ జిప్సీలు
ఇండియన్ ఆర్మీ సెల్ కొత్తగా ఎలక్ట్రిక్ జిప్సీ వాహనాలను ప్రవేశపెట్టింది. ఐఐటీ ఢిల్లీ, ట్యాడ్‌పోల్ ఈవీ స్టార్టప్‌లతో కలిసి భారతీయ సైన్యం పాత జిప్సీ వాహనాలను కొత్త ఎలక్ట్రిక్ జిప్సీలుగా మార్చేస్తుంది.
అత్యంత ప్రతికూల ఏడాదిగా 2022
2022 సంవత్సరం మానవాళికి అత్యంత నష్టాన్ని కలిగించినదిగా ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంవో) ప్రకటించింది. యూఎన్ నేతృత్వంలో ‘స్టేట్ ఆఫ్ ది గ్లోబల్ క్లైమెట్ 2022’ విడుదల చేసిన నివేదికలో పేర్కొంది.
మీడియా స్వేచ్ఛలో భారత్ ర్యాంక్
ప్రపంచ మీడియా స్వేచ్ఛా సూచీ-2023లో 161వ స్థానానికి భారత్ పరిమితమైంది. గత ఏడాది 150వ స్థానంలో ఉన్న భారత్ ఇప్పుడు161కి చేరింది. రిపోర్టర్స్ వితవుట్ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్) అనే గ్లోబల్ మీడియా వాచ్‌డాగ్ 180 దేశాలకు ఈ స్వేచ్ఛా సూచీని ప్రచురిస్తుంటుంది. నివేదికలో నార్వే
టాప్‌లో ఉంది.
గురుగ్రహంపై జ్యూస్ పరిశోదన
ఐరోపా అంతరిక్ష సంస్థ ‘జ్యూస్’ వ్యోమనౌకను ప్రయోగించింది. ఇది గురుడి కక్ష్యలో ఉన్న యూరోపా, లిస్టో, గానీమీడ్ చందమామల పైనా పరిశోధనలు సాగించనుంది.