బాధ్యత మరిచిన సమాజం..క్షీణిస్తున్న విలువలు : డా. పి. భాస్కరయోగి

మనదేశం ప్రస్తుతం ప్రపంచంలోని 7 ఆర్థిక అగ్రశక్తుల్లో 4వ స్థానానికి ఎగబాకి, ఎక్కువ వృద్ధి రేటుతో తక్కువ ద్రవ్యోల్బణంతో దూసుకుపోతోంది. అలాగే మన మేధోసంపత్తి ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలకు ఎనలేని సేవలు అందిస్తున్నది. అన్నిటికి మించి మనదేశం కొన్ని ప్రాచీన విలువలు, సంస్కృతులు, భాషలు కలిగి నిత్యనూతనంగా తన స్వరూపం మార్చుకుంటున్నది. అలాగే ప్రపంచంలోని 8 వందల కోట్ల జనాభాలో 140 కోట్లు ఇక్కడే ఉండగా పరిణతి కల్గిన ప్రాచీన సంస్కృతి ఓవైపు, సమన్వయంతో పరుగెత్తుతున్న యువత మరోవైపు మనకు సరిక్రొత్త గౌరవాన్ని కల్గిస్తున్నది. కానీ ఇటీవల రోజూ వస్తున్న ‘వార్తలు’ మనకు ఆందోళన కలిగిస్తూ మన సమాజం వైపు వేలెత్తి చూపుతూ ప్రశ్నిస్తున్నాయి. ఓచోట ఆస్తి కోసం తండ్రినే కొడుకులు చంపేస్తున్నారు. వ్యసనాలకు బానిసైన కొడుకును తండ్రి, వేధించే భర్తను భార్యా పిల్లలు కొట్టి చంపుతున్నారు. మరోచోట వివాహేతర సంబంధాల మోజులో జరుగుతున్న హత్యలు పెచ్చుమీరుతున్నాయి. అలాగే 5 ఏళ్ల చిన్నారిపై 9 ఏళ్ల బాలుడు అత్యాచారం చేస్తున్నాడు. వృద్ధులు కూడా అత్యాచారాలు చేసి వార్తల్లోకి ఎక్కుతుంటే, ఎక్కనివారు ఇంకెందరో!? వరుసకు అన్న అయిన యువకుడు చెల్లెలు వరుస అయిన అమ్మాయిని, తన స్నేహితులతో కలిసి అత్యాచారం చేసే క్రూరత్వం మనం చూస్తున్నాం!  ప్రేమ పేరుతో వేధించే హత్యలు, పరువు హత్యలు, యాసిడ్ దాడులు, మత ప్రేమతో జరుగుతున్న హత్యలు, ఇక ఆస్తి కొరకు అన్నా–-చెల్లి-, అక్కా-–తండ్రి-, తల్లి, బావ – బావమరిది, అల్లుడు-– మామ ఇలా అన్ని సంబంధాలు ధ్వంసం అయిపోయి పశుప్రాయంగా మారి, జరుగుతున్న వరుస హత్యోదంతాలు సున్నిత హృదయాల్లో కల్లోలం రేపుతున్నాయి. దీనంతటికీ బాధ్యులుగా ఎవరిని వేలెత్తి చూపుదాం? అంటే ఒక లక్ష్యం కన్పించడం లేదు. తల్లీ, తండ్రీ, -కుటుంబం, -విద్యావ్యవస్థ, -కులం మొదలైనవి ప్రభావిత అంశాలు. ప్రభుత్వాలు, మీడియా, -సమాజం- అపరిపక్వత,- సామాజిక, ఆర్థిక పరిస్థితులు ఏది కారణం?  అన్నది బిలియన్ డాలర్ల ప్రశ్న.

పురాణాలే మనకు పాఠాలు

తెల్లారితే పట్టాభిషేకం అని ప్రకటించిన దశరథుడు మనసు మార్చుకుంటే, తండ్రి మాట కోసం వనవాసం బాటపట్టిన శ్రీరాముడు తండ్రిని ఒక్క మాట కూడా అనలేదు. భార్యకిచ్చిన మాటకోసం తనకిష్టమైన రాముడిని అడవికి పంపిన దశరథుడు విలపించి మరణించాడు. భర్త రాజ్య భోగాలను త్యజిస్తే నాకెందుకు ఈ ‘సంపదలు’ అని భర్త దారిన సీతమ్మ నడిస్తే ‘అన్నమార్గమే నా మార్గం’ అని అడవికి వెళ్లిన లక్ష్మణుడు. తన బాగు కోసమే ఈ కుట్రకు తల్లి పాల్పడిందని తెలిసినా ఆ అవకాశాన్ని తిరస్కరించిన భరతుడు రామపాదుకలకు పట్టాభిషేకం చేసి సుపరిపాలన అందివ్వడం ఎందరికి తెలుసు! నాడు ఆచారంలో బహుభార్యత్వం వల్ల సమాజంలో ఏర్పడిన వికృతులను రూపుమాపడానికి ‘ఏకపత్నీవ్రతం’ స్వీకరించిన శ్రీరాముడు ఆ సమాజంపై ఎంతో ప్రభావం చూపడమే కాకుండా ఈ రోజుకూ ఆదర్శంగా నిలవడం రామరాజ్య భావనలో భాగమే. ఇదంతా రామాయణం. ‘పరుల సొమ్ము పాపం’ అని భావించకుండా రాజ్యాధికార మదంతో ‘దుష్టచతుష్టయం’ తో కలిసి అణచివేత ధోరణితో ప్రవర్తించిన దుర్యోధనుడి ఆధ్వర్యంలో జరిగిన పాపకృత్యాలు మహాభారత యుద్ధానికి మూల కారణాలు. నిండు సభలో ద్రౌపదీ వస్త్రాపహరణం కౌరవ వంశ వినాశనానికి దారితీసింది. స్త్రీలను అవమానించే ఏ జాతికీ మనుగడ లేదనీ, సుఖంగా ఉండలేదని ఆ ఘట్టం తెలియజేస్తుంది. ఇతరుల ఆస్తులు, స్త్రీలను అనుభవించాలనే రాక్షస కృత్యాలు దుర్యోధన, కౌరవాది మనస్తత్వాలకు ప్రతీకలు. ఈ రెండింటిని దారిలో పెట్టేందుకు కృష్ణుడు పాండవులను ఆధారం చేసుకొని కురుక్షేత్ర సంగ్రామమే చేయాల్సి వచ్చింది.

సాంకేతికతతో లాభాలున్నా, నష్టాలే ఎక్కువైతున్నాయి

ఇక యువతీ యువకులు మాంసం ఆశకు వెళ్లి ప్రాణం పోగొట్టుకొన్న చేపలాగా స్మార్ట్ ఫోన్ వలలో పడి తర్వాత హనీట్రాప్ వలలో చిక్కుకొని విలవిలలాడుతున్నారు. ఇంటర్నెట్ ఇప్పుడు అందరినీ 'నెట్' లో పడేస్తుంది. అది ప్రతి కుటుంబం నట్టింట్లోకి చేరింది. దానివల్ల లాభాలూ లేకపోలేదు. నష్టాల శాతమే ఎక్కువైంది. మంచి-చెడ్డల భేదాలను గ్రహించలేని వారి చేతిలో అదొక ఆటం బాంబుగా మారింది. ప్రతిరోజూ సినిమాల్లో, సీరియళ్లలో వందలసార్లు రేప్ సీన్లు, మర్డర్ సీన్లు చూస్తున్న యువత సున్నితత్వాన్ని కోల్పోతున్నది. సెలబ్రెటీలపై వీరారాధన పెరిగిపోయింది. కళను కళగా దర్శించండి అన్న గ్రీకు తాత్వికుల మాటను నొక్కి చెపుతున్నా, సినిమావాళ్ళు సింహభాగం బాధ్యతగా ప్రవర్తించడం లేదు. డబ్బు కోసం తమ జ్ఞానం, తెలివితేటలు ఉపయోగిస్తున్నారు. కళాఖండాలను సృష్టించకుండా తెగిపడిన 'మాంసపిండంగా సమాజాన్ని మార్చేస్తున్నారు. కులాలు, మతాలను వాడుకొని ‘దుర్భల రాజకీయం’ చేసి సమాజంపై రుద్దుతున్నారు. ఇది కళా! కాదా! అని విచక్షణతో, వివేకంతో ఆలోచించే సమాజంలో మనం ఉన్నామా? అని విజ్ఞులు ఆలోచించాలి. కొన్ని వర్గాలను వ్యతిరేకిస్తే తమ వర్గం తప్పక చూస్తోందన్న భావన సినిమా సంపాదకుల్లో ఇపుడు ఎక్కువైంది. వాళ్లు అక్రమ సంపాదన, డ్రగ్స్, సెక్స్ రాకెట్ వంటి వాటిలో ఇరుక్కుని నేరస్థులుగా మారాక కూడా ఆయా ఆఫీసుల చుట్టూ, తిరిగేటపుడు హీరోల్లా ఫోజులిస్తున్నారు. దర్యాప్తులు, విచారణలూ వారికి ఓ పాలపులారిటీ తెచ్చిపెడుతున్నాయనే భావన విస్తరిస్తున్నదా?  

పుచ్చిపోయిన వ్యవస్థ

విద్యలో విలువలు లేకుండా, డబ్బు పండించే యంత్రాల్లాగా తమ సంతానాన్ని మార్చి విదేశాలకు పంపి దిక్కులేకుండా ఇక్కడ జీవిస్తూ గొప్పలు చెప్పుకొంటున్న వర్గం ఓవైపు, ఉన్నచోటే సరైన దశ-దిశ లేకుండా జీవిస్తున్న మనుషులు మరోవైపు. యధేచ్ఛగా నేరప్రవృత్తితో జీవిస్తున్న యువత మూడోవైపు ఈ సమాజంలో ఎదిగి వస్తుంటే మనల్ని మనమే బోనులో నిలబెట్టుకోవలసిన పరిస్థితి. జీడిబంక సీరియళ్ల కుట్రలు, బిగ్​ బాస్ వెకిలి వ్యవహారాలు, డ్రగ్స్ క్యాసినోలు, క్లబ్బులు, పబ్బులు, కుటుంబ వ్యవస్థను విశృంఖలత్వం నైతిక పతనం వైపు నడిపిస్తున్నాయి. ఇది పుచ్చిపోయిన మన వ్యవస్థను ప్రతిబింబిస్తోంది. మొదటి గురువుగా తల్లి, జీవితం నేర్పే తండ్రి, బ్రతుకు నేర్పే పాఠశాల, తీర్చిదిద్దే సమాజం, అంకుశంతో పొడవాల్సిన ప్రభుత్వాల అన్యమనస్కత.. ఇలా సమాజం పతనం వైపు పరుగెడుతుంటే దిక్కులు చూస్తున్న మనం ఈ దుర్వార్తలు వినాల్సిందే.  ఇప్పటికైనా అనుకరణలు మాని దేశ సంస్కృతీ, సంప్రదాయల ఆచరణకు ప్రాధాన్యం ఇవ్వడం ప్రతి భారతీయుడి బాధ్యతగా మారాలని పరిస్థితులే చెపుతున్నాయి.

పెరుగుతున్న దురాశ

డబ్బు సంపాదనే ధ్యేయంగా ఒకప్పుడు వ్యభిచార గృహాలను నడిపినట్లు అక్రమంగానైనా సరే ధనం సంపాదించడం గొప్ప స్టేటస్ గా మారిపోయింది. దానికోసం వ్యక్తిత్వాలతో పని లేకుండా అన్ని వ్యవస్థలు 'కార్పొరేట్ మేనేజ్మెంట్' లో పని చేస్తున్నాయి. అందరూ అలాంటి వ్యవస్థల్లో పనిచేసి సంపాదనను జస్టిఫై చేసుకుంటున్నారు. చాలా మంది తల్లిదండ్రులు ఎలాగైనా  సంపాదించమని తమ పిల్లలపై ఒత్తిడి చేస్తున్నారు. ఈ పరుగుపందెంలో అనేక తప్పటడుగులు పడుతున్నాయి. బాగా డబ్బుగల వాళ్ల పిల్లలు ‘నాకు సంపాదన అవసరంలేదు, నేను ఎంజాయ్ చేయాలి’ అనుకుంటూ క్లబ్బుల్లో, పబ్బుల్లో పడి పరిచయాలంటూ తిరుగుతున్నారు. ఆ క్రమంలోనే గతంలో ఓ అమ్మాయిని కారులోనే అత్యాచారం చేశారని కేసు నమోదయిన విషయం చూశాం. ఇది మనకు వార్తలలో తెలిసింది. తెలియకుండా ఎన్ని జరుగుతున్నాయో! 

అత్యాశ, అనుకరణ

విపరీతమైన పాశ్చాత్య పోకడలతో సమాజ నిర్మాణం గ్రహించకపోవడం, మన సమాజ డిఎన్ఎను పట్టుకోకపోవడం నేటి సామాజిక అశాంతికి కారణం.  విచక్షణ లేకుండా అన్నింటినీ మనలోకి ఆహ్వానించడం లేదా తిరస్కరించడం అనే విధానం మన అన్ని సంబంధాల కరకట్టలను తెంచేస్తున్నది. అలాగే గుడ్డి 'అనుకరణ' కూడా వ్యక్తి, కుటుంబం అశాంతికి మూలకారణం. ఆస్తులు, డబ్బు, బంగారం, ప్రతిష్ట, గౌరవం మొదలైన విషయాలలో ఇతరులను చూసి అనుకరించడం వల్ల చాలామందిలో ఇది విధ్వంసానికి మూల బిందువుగా మారుతోంది.  మన పెళ్లిళ్లల్లో జరిగే ఆర్భాటాలే ఒక ఉదాహరణ. పెళ్లికున్న పవిత్రతను పోగొట్టి దాన్ని ‘ఈవెంట్ మేనేజ్మెంట్’ గా మార్చాక అది పైన పటారం లోన లొటారంగా మారిపోయింది. వివాహ సంప్రదాయంలో లేని పిచ్చినంతా అనుకరణ దృష్టితో పెంచుకోవడం జరుగుతున్నది.  వరకట్న వేధింపులు ‘నవవధువు బలి’ ఘటన వరకు చేరాయి. లేని గొప్పలతో పెళ్లిళ్లు హంగులతో చేసి అప్పులపాలైన వధువు తండ్రి కూడా వరకట్న వేధింపులకు గురైనట్లే. అలాగే వ్యాపారాలు, వ్యవహారాలు వాళ్లకున్న నియతి పాటించకుండా అందులో దూరిపోయి నష్టాలకు గురై కష్టాలలో చిక్కుకునే వాళ్లనూ చూస్తున్నాం. అత్యాశ ఎక్కువై గొలుసుకట్టు (చైన్ సిస్టం) స్కీమ్ లో చేరి, అసలువాడు జారుకున్నాక లబోదిబోమనడం మనం చూస్తున్నాం. 

- డా. పి. భాస్కరయోగి, సోషల్​ ఎనలిస్ట్​