
ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా(ఏఏఐ) గగన్ (జీపీఎస్ ఎయిడెడ్ జీయో ఆగ్మెంటెడ్ నావిగేషన్ ) పేరుతో సరికొత్త స్వదేశీ ఉపగ్రహ ఆధారిత ఆగ్మెంటేషన్ సిస్టిమ్(ఎస్‌బీఏఎస్) సాంకేతికతను వర్తింపజేయడం ద్వారా విజయవంతంగా భారతదేశం ట్రయల్ నిర్వహించింది. రాజస్తాన్‌లోని కిషన్‌గఢ్ విమానాశ్రయంలో ఇండిగో విమానం దిగుతున్నప్పుడు దేశీయంగా అభివృద్ధి చేసిన ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సిస్టమ్‌ను ఉపయోగించిన ఆసియాలో మొదటి విమానయాన సంస్థగా అవతరించింది. ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఈ ఘనత సాధించిన తొలి దేశం భారత్.
అభివృద్ధి
ఇస్రో, ఏఏఐ సంయుక్తంగా గగన్‌ను అభివృద్ధి చేశాయి. అప్లింక్, రిఫరెన్స్ స్టేషన్లను ఉపయోగించడం ద్వారా ఈ సిస్టమ్ ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను మెరుగుపరచడానికి జీపీఎస్ సిగ్నల్ దిద్దుబాట్లను సరిచేస్తుంది.
గగన్
పౌర విమానయాన అనువర్తనాలకు అవసరమైన సమగ్రత, కచ్చితత్వంతో ఉపగ్రహ ఆధారిత నావిగేషన్ సేవలను అందించే ఉపగ్రహ ఆధారిత వృద్ధి వ్యవస్థ. ఈ వ్యవస్థను ఉపయోగించడం ద్వారా భారత గగనతలంలో మెరుగైన ఎయిర్ ట్రాఫిక్ నిర్వహణను అందించవచ్చు. గగన్ సిగ్నల్ ఇన్ స్పేస్ (ఎస్ఐఎస్) జీశాట్–10, జీశాట్–8 ద్వారా అందుబాటులో ఉంది. కచ్చితమైన ల్యాండింగ్ ప్రయోజనం కోసం విమానం రేడియో నావిగేషన్ సహాయాలపై ఆధారపడాలి. అయినా చిన్న విమానాశ్రయాల్లో ఆధునిక నావిగేషన్ సహాయాల కొరత ఉంది. అందువల్ల అలాంటి విమానాశ్రయాల్లో విజిబిలిటీ అవసరాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కిషన్‌గఢ్ విమానాశ్రయంలో అన్ని సాధారణ ప్రయాణికుల విమానాలకు దృశ్యమానత అవసరం, కానీ గగన్ సాంకేతికతను ఉపయోగించి, ఒక విమానం దాదాపు 800 మీటర్ల దృశ్యమానతతో పనిచేస్తుంది.