Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరింపు

Bangladesh: భారత్-బంగ్లాదేశ్ సరిహద్దుల్లో భారీగా సైన్యం మోహరింపు

ఢాకా: భారత్, -బంగ్లాదేశ్ సరిహద్దుల్లో సైన్యం భారీగా మోహరించింది. కూచ్‌బెహార్, పెట్రాపోల్ సరిహద్దుల్లో భద్రత పెంచారు. సరిహద్దుల్లో బలగాలను బీఎస్ఎఫ్ అప్రమత్తం చేసింది. బంగ్లాదేశ్‌లో ఎమర్జెన్సీ తరహా పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో బీఎస్ఎఫ్ అలర్ట్ అయింది. రిజర్వేషన్ల అంశంపై బంగ్లాదేశ్లో జరుగుతున్న ఆందోళనలు తీవ్ర రూపం దాల్చిన సంగతి తెలిసిందే. 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. బంగ్లాదేశ్లో దేశవ్యాప్త కర్ఫ్యూ విధించారు. కర్ఫ్యూ ఆదేశాలను బేఖాతరు చేసిన నిరసనకారులు వేల సంఖ్యలో ఢాకా వీధుల్లోకి చేరుకుని హింసాత్మక చర్యలకు పాల్పడటంతో పరిస్థితి పూర్తిగా అదుపు తప్పింది. బంగ్లాదేశ్ ప్రధాని కార్యాలయంలోకి కూడా నిరసనకారులు ప్రవేశించడంతో షేక్ హసీనా ప్రాణ భయంతో ప్రధాని పదవికి రాజీనామా చేసి దేశం విడిచి వెళ్లిపోయారు.

భారత్లోని అగర్తలకు ఆర్మీ హెలికాఫ్టర్లో ఆమె చేరుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. ఇదిలా ఉండగా.. బంగ్లాదేశ్ ప్రధాని పదవికి షేక్ హసీనా రాజీనామా చేశారని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ నిర్ధారించారు. ఇక.. ఢాకా నుంచి అగర్తలే ఎందుకంటే.. ఈ రెండు ప్రాంతాల మధ్య దూరం చాలా తక్కువ. రోడ్డు మార్గమైతే 130 కిలోమీటర్లు మాత్రమే. ఇక.. హెలికాఫ్టర్ అయితే నిమిషాల వ్యవధిలోనే ఢాకా నుంచి అగర్తలకు చేరుకోవచ్చు. అగర్తలకు షేక్ హసీనా చేరుకున్నప్పటికీ అక్కడి నుంచి ఆమె మరో దేశానికి వెళ్లే అవకాశం ఉన్నట్లు తెలిసింది.