హైదరాబాద్ జూలోని జంతువులన్నీ సేఫ్

హైదరాబాద్ జూలోని జంతువులన్నీ సేఫ్
  • నాగ్​పూర్ లో మూడు పులులు, చిరుత చనిపోవడంతో జాగ్రత్తలు 
  • ప్రతిరోజూ జంతువులకు మల, మూత్ర పరీక్షలు 
  • పులులు, సింహాలు, చిరుతలకు వేడి నీళ్లతో శుభ్రం చేసిన ఆహారం
  • యానిమల్​కీపర్స్​కు రెగ్యులర్​హెల్త్ చెకప్స్ 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ఓ వైపు మనుషులను హ్యూమన్ మెటాన్యూమో వైరస్(హెచ్ఎంవీపీ) భయపెడుతుండగా.. జంతువులను ఏవియన్​ఇన్ఫ్లుయేంజా వైరస్(బర్డ్ ఫ్లూ)​ వణికిస్తున్నది. గత నెలలలో బర్డ్ ఫ్లూ కారణంగా నాగపూర్​గోరెవాడ రెస్క్యూ సెంటర్ లో మూడు పులులు, ఓ చిరుత చనిపోగా, కేంద్రం దేశంలోని జూపార్క్ అధికారులను అలర్ట్​ చేసింది. బర్డ్​ ఫ్లూ సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. దీంతో హైదరాబాద్ లోని నెహ్రూ జూలాజికల్ పార్క్​ లో జంతువులు, పక్షులకు బర్డ్ ఫ్లూ రాకుండా అధికారులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు.

ఇక్కడ 22 పులులు, 19 సింహాలు, ఆరు చిరుతలున్నాయి. ముఖ్యంగా పులులు, సింహాలు, చిరుతలు, పక్షులు, ఇతర క్షీరదాల ఆరోగ్యం, ఆహారం, శుభ్రత విషయంలో చాలా కేర్​తీసుకుంటున్నారు. ప్రస్తుతానికి అయితే జూలో ఉన్న జంతువులు అన్నీ పూర్తి ఆరోగ్యంగానే ఉన్నాయని క్యూరేటర్​​వసంత తెలిపారు. 

జంతువులకు వేడి చేసిన ఆహారం  

పచ్చి మాంసం, బర్డ్​ ఫ్లూ సోకిన మాంసం తినడం వల్ల, వలస పక్షుల వల్ల జంతువుల్లో బర్డ్​ ఫ్లూ సోకే ప్రమాదం ఉండడంతో అధికారులు పులులు, సింహాలు, చిరుతలకు పచ్చి మాంసాన్ని ఇవ్వకుండా వేడి నీళ్లలో వేసి తీసి ఇస్తున్నారు. పక్షుల ఎన్​క్లోజర్లను అన్ని వైపులా ఓపెన్​చేయకుండా సందర్శకులకు కనిపించేలా మాత్రమే తెరిచి పెడుతున్నారు. వలస పక్షుల రాకతో బర్డ్​ఫ్లూ రాకుండా ఉండేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు. పక్షులు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్​ కలిపి ఇస్తున్నారు. ప్రతి రోజూ జంతువుల మల, మూత్ర శాంపిల్స్ సేకరించి ల్యాబ్​కు పంపిస్తున్నారు.

షెడ్యూల్ ప్రకారం మూడు నెలలు, ఆరు నెలలకు ఒకసారి బ్లడ్​శాంపిల్స్​సేకరిస్తామని చెప్తున్నారు. యానిమల్ కీపర్స్​ కు కూడా రెగ్యూలర్​గా హెల్త్ చెకప్​ లు నిర్వహిస్తున్నారు. పులులు, సింహాలు, చిరుతల ఎన్​ క్లోజర్ల వద్ద ఉండే యానిమల్ కీపర్లను ఇతర ఎన్​క్లోజర్ల వద్దకు వెళ్లకుండా చూస్తున్నారు. ఎన్​ క్లోజర్లకు మాస్కులు, గ్లౌజులు పెట్టుకుని వెళ్లేలా ఆదేశాలు జారీ చేశారు. శానిటైజర్లు తప్పకుండా ఉపయోగించాలని కోరుతున్నారు. జంతువుల ఎన్​ క్లోజర్లలో రెగ్యూలర్​గా ఇసుక మార్చడం, బ్లీచింగ్​ పౌడర్, పసుపుతో ఎన్ క్లోజర్లను క్లీన్​చేస్తున్నారు. 

నాగ్​పూర్​లో ఏం జరిగిందంటే..

మహారాష్ట్రలోని చంద్రాపూర్​జూలో కొన్ని పులులు, చిరుత మనుషుల మీద దాడి చేస్తుండడడంతో గత డిసెంబర్​లో నాగ్​పూర్​లోని గోరెవాడ రెస్క్యూసెంటర్ కు తరలించారు. అక్కడ వివిధ లక్షణాలు, జ్వరంతో బాధపడిన పులులు డిసెంబర్​చివరి వారంలో చనిపోయాయి. అవి చనిపోయిన తర్వాత శాంపిల్స్​ను మధ్యప్రదేశ్​ లోని భోపాల్ లో ఉన్న ఐసీఏఆర్​నేషనల్ ఇన్​స్టిట్యూట్​ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్​డిసీజెస్​ కు పంపించారు. ఈనెల 2వ తేదీన ల్యాబ్​రిపోర్ట్స్​ రాగా పులులన్నీ హెచ్5ఎన్​1 వైరస్​ బర్డ్​ఫ్లూ కారణంగా చనిపోయాయని తేలింది.

ఈ ఘటనతో కేంద్ర ప్రభుత్వం మహారాష్ట్ర అంతటా హై అలర్ట్ ప్రకటించింది. రెస్క్యూసెంటర్ లో ఉన్న మిగతా జంతువులకు కూడా పరీక్షలు నిర్వహించారు. అన్ని ఆరోగ్యంగా ఉన్నట్లు తేలడంతో ఊపిరి పీల్చుకున్నారు. పచ్చి మాంసం తినడం, లేదా బర్డ్​ ఫ్లూ సోకిన ఫుడ్ తినడం వల్ల ఆ పులులకు బర్డ్​ ఫ్లూ సోకి ఉండొచ్చని భావించారు. దీంతో దేశ వ్యాప్తంగా ఉన్న జూలను కేంద్ర ప్రభుత్వం అలర్ట్​ చేసింది.  

వలస పక్షులపై దృష్టి పెట్టాం

బర్డ్​ఫ్లూ అనేది వైరల్ ఇన్​ఫెక్షన్. ఇది ముఖ్యంగా వలస పక్షుల ద్వారా వ్యాప్తి చెందుతుంది. నాగ్​పూర్​లో ఘటన జరగడంతో ఇక్కడి జంతువులు, పక్షుల  విషయంలో శ్రద్ధ పెట్టాం. వలస పక్షలు మన పక్షులతో కలవకుండా ఎన్ క్లోజర్లను ఒకవైపే ఓపెన్​చేసి పెట్టాం. పక్షులకు, జంతువులకు ఇచ్చే నీళ్లలో యాంటీ బయాటిక్స్, మల్టీ విటమిన్స్ కలిపి ఇస్తున్నాం.మల, మూత్ర శాంపిల్స్​తీసుకుని పరీక్ష చేస్తున్నాం. చికెన్​, మటన్​, బీఫ్​వేడి చేసి ఇస్తున్నాం. నెహ్రూ జూపార్క్​లో అన్ని జంతువులు, పక్షులు, క్షీరదాలు ఆరోగ్యంగా ఉన్నాయి.

– డాక్టర్​అబ్దుల్ హకీమ్, వెటర్నరీ, డిప్యూటీ డైరెక్టర్, నెహ్రూ జూలాజికల్ పార్క్

జంతువులన్ని ఆరోగ్యంగా ఉన్నాయి 

నాగ్​పూర్​ఘటనతో దేశంలోని అన్ని జూ లు జాగ్రతలు తీసుకోవాలని కేంద్రం సూచనలు చేసింది. ఆ ఆదేశాల ప్రకారం పులులు, సింహాలు, చిరుతల మల, మూత్ర శాంపిల్స్​రెగ్యులర్​గా సేకరిస్తున్నాం. షెడ్యూల్ ప్రకారం బ్లడ్​ శాంపిల్స్​సేకరిస్తున్నాం. ప్రస్తుతానికి జంతువులన్నీ ఆరోగ్యంగా ఉన్నాయి. వాటికి ఇచ్చే ఆహారంలో మార్పులు చేశాం. ఎన్ క్లోజర్లను శానిటైజ్​చేస్తున్నాం. 

– జె.వసంత, క్యూరేటర్, 
నెహ్రూ జూలాజికల్ పార్క్​