కెనడా పార్లమెంట్‪లో ఖలిస్తానీ ఉగ్రవాదికి నివాళి: ఇండియన్ కాన్సులేట్ కౌంటర్

గత ఏడాది జూన్ 18న బ్రిటిష్ కొలంబియాలోని గురుద్వారా వెలుపల కెనడాలోని సర్రేలో జరిగిన కాల్పుల్లో ఖలిస్తాన్ టైగర్ ఫోర్స్(కెటిఎఫ్)చీఫ్ నిజ్జర్ మరణించారు. కెనడా పార్లమెంట్ మంగళవారం హౌస్ ఆఫ్ కామన్స్‌లో కొద్దిసేపు మౌనం పాటించి హర్దీప్ సింగ్ నిజ్జర్ కు నివాళి అర్పించింది. భారత దేశంలో ఉగ్రవాదిగా ప్రకటించిన నిజ్జర్ కు కెనడా చట్టసభలో నివాళి అర్పించడాన్ని ఇండియన్ కాన్సులేట్ తప్పుబట్టింది.  

దీన్ని వ్యతిరేఖిస్తూ వాంకోవర్‌లోని భారత కాన్సులేట్ జనరల్ 1985లో ఎయిర్ ఇండియా కనిష్క విమానంపై ఖలిస్తానీ బాంబు దాడిలో 329 మంది మృతులకు నివాళులర్పించేందుకు స్మారక సేవను ప్రకటించారు. 23 జూన్ 2024నాటికి ఆ ఘటన జరిగి 39 ఏళ్లు. అలాంటి టెర్రరిస్టులకు కెనడా మద్దతు ఇస్తుందని ఇండియన్ కన్సులేట్ ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చింది. భారత ప్రభుత్వం విడుదల చేసిన40మంది నిషేధిత ఉగ్రవాదుల జాబితాలో అతని పేరు ఉంది. కెనడాలో హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ పాత్ర ఉందని పేర్కొంది. దీన్ని భారత్ తీవ్రంగా ఖండించింది, అప్పటి నుంచి ఇరు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలు దెబ్బతిన్నాయి. 

ఎవరీ హర్దీప్ సింగ్ నిజ్జర్?

హర్దీప్ సింగ్ నిజ్జర్ భారతదేశంలోని జలంధర్‌లో ఉన్న భర్‌సింగ్‌పురా గ్రామానికి చెందినవాడు. 1997లో ఇతను పంజాబ్ నుంచి కెనడాకు వలస వెళ్లాడు. అక్కడ ప్లంబర్‌గా వృత్తిలో చేరాడు. ఇతనికి పెళ్లయి, ఇద్దరు కుమారులు ఉన్నారు. కెనడాలో అడుగుపెట్టినప్పటి నుంచే అతడు ఖలిస్తానీ వేర్పాటువాదులతో బలమైన సంబంధాలను ఏర్పరుచుకున్నాడు.

ఖలిస్టాన్ టైగర్ ఫోర్స్ (KTF) (నిషేదిత ఉగ్రవాద సంస్థ) ఏర్పాటు వెనుక అతడే మాస్టర్ మైండ్. అంతేకాదు.. సిఖ్ ఫర్ జస్టిస్ (SFJ)లోనూ అతడు సభ్యుడు. 2007లో పంజాబ్‌లోని లుథియానాలో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో నిజ్జర్ మోస్ట్ వాంటెడ్.

ఈ దాడిలో ఆరుగురు మృతి చెందగా, 40 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. 2009లో రాష్ట్రీయ సిక్ సంగత్ అధ్యక్షుడు రూల్డా సింగ్ హత్యలోనూ నిజ్జర్ పాత్ర ఉంది. 2020లో నిజ్జర్‌ను భారత ప్రభుత్వం ఉగ్రవాదిగా ప్రకటించింది. గతేడాది జులైలో జలంధర్‌లో హత్యకు గురైన పూజారి కేసులోనూ నిజ్జర్ ప్రమేయం ఉందని తేలడంతో.. అతడ్ని పట్టిస్తే రూ.10 లక్షల బహుమతి ఇస్తామని జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) ప్రకటించింది. అంతేకాదు.. కెనడా, యూకే, అమెరికాలో ఉన్న భారత దౌత్య కార్యాలయాలపై జరిగిన దాడుల వెనుక నిజ్జర్ హస్తం ఉందని అనుమానిస్తున్నారు.