భారతదేశ రక్షణ రంగాన్ని పటిష్టపరిచేందుకు విశాఖ సముద్ర తీరంలో అణు సామర్థ్యంతో కూడిన బాలిస్టిక్ క్షిపణి వ్యవస్థ కలిగిన నాలుగో జలాంతర్గామి (ఎస్ఎస్బీఎన్)ను నేవీ ఆవిష్కరించింది. ఈ జలాంతర్గామికి ఎస్–4 అని పేరు పెట్టారు. ఇందులో 3,500 కి.మీ. దూరంలోని లక్ష్యాన్ని సైతం ఛేదించేలా కె–4 అణు బాలిస్టిక్ క్షిపణులను అమర్చారు. మొదటి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ అరిహంత్ కేవలం 750 కి.మీ. పరిధి లక్ష్యాన్ని మాత్రమే ఛేదించగలదు. ఇండియన్ నేవీలో తొలి అణు జలాంతర్గామి ఐఎన్ఎస్ చక్రను రష్యా నుంచి లీజుకు తీసుకున్నారు.
15 ఏండ్ల క్రితం 2011, డిసెంబర్లో భారత్ సొంతంగా న్యూక్లియర్ సబ్ మెరైన్ల నిర్మాణాన్ని చేపట్టింది. వాటిని తూర్పు నౌకాదళ కేంద్రం విశాఖలోని నేవీ షిప్ బిల్డింగ్సెంటర్లో నిర్మిస్తున్నది. ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మించిన తొలి ఎస్ఎస్బీఎన్ (షిప్, సబ్మెర్సిబుల్, బాలిస్టిక్, న్యూక్లియర్) జలాంతర్గామి.. ఐఎన్ఎస్అరిహంత్ 2018 నుంచి నేవీకి పూర్తిస్థాయి సేవలు అందిస్తున్నది. ఆ డిజైన్, స్ఫూర్తితో దానికి మించిన శక్తితో ఐఎన్ఎస్ అరిహంత్‌ను 2024, ఆగస్టులో రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ నౌకాదళానికి అందజేశారు.