RHUMI 1: నింగిలోకి దూసుకెళ్లిన హైబ్రిడ్‌ రాకెట్‌ "రూమీ1"

RHUMI 1: నింగిలోకి దూసుకెళ్లిన హైబ్రిడ్‌ రాకెట్‌ "రూమీ1"

దేశంలో మొట్టమొదటిసారి పునర్వినియోగ హైబ్రిడ్‌ రాకెట్‌‌ను ప్రయోగించారు. చెన్నై, ఈసీఆర్‌లో తిరువిడందై తీర గ్రామం నుంచి 'రూమీ-1' అనే చిన్న రాకెట్‌ శనివారం(ఆగష్టు 24) ఉదయం నింగిలోకి దూసుకెళ్లింది. తమిళనాడుకు చెందిన స్టార్టప్ స్పేస్ జోన్ ఇండియా.. మార్టిన్ గ్రూప్‌తో కలిసి దీనిని అభివృద్ధి చేసింది. దాదాపు 80 కిలోల బరువున్న ఈ రాకెట్‌ను హైడ్రాలిక్‌ మొబైల్‌ కంటైనర్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ప్రయోగించారు. ఈ రాకెట్ ద్వారా 3 క్యూబ్ శాటిలైట్లు, 50 పికో శాటిలైట్ల‌ను ఉప‌క‌క్ష్య‌లోకి ప్రవేశపెట్టారు.

రూమీ1 ద్వారా ప్రయోగించిన క్యూబ్‌ ఉపగ్రహాలు గ్లోబల్ వార్మింగ్, వాతావరణ పరిస్థితులు, కాస్మిక్‌ రేడియేషన్‌, యూవీ రేడియేషన్‌, గాలి నాణ్యత వంటి సమాచారాన్ని సేకరించనుండగా.. పికో ఉపగ్రహాలు కంపనస్థాయి, ఓజోన్‌ పొర పరిస్థితి వంటి ఇతర పర్యావరణ పరిస్థితుల్ని గుర్తించి కిందకు సమాచారాన్ని చేరవేయనున్నాయి.

పునర్వినియోగం..

RHUMI-1 జెనరిక్ ఇంధన ఆధారిత హైబ్రిడ్ మోటార్. మొబైల్‌ లాంచ్‌పాడ్‌ నుంచి ప్రయోగించాక ఉపగ్రహాలు భూఉప కక్ష్యలోకి దూసుకెళ్లే మార్గంలో కొంతదూరం ప్రయాణించాక రాకెట్‌ స‌ముద్రంలో ప‌డిపోతుంది. అందుకుగానూ శకలాలు తిరిగి భూమికి చేరేలా రాకెట్‌లోనే పారాచూట్లను ఉంచారు. 35 కిలోమీట‌ర్ల ఎత్తుకు చేరుకున్నాక పారాచూట్లు తెరచుకొని  రాకెట్ సురక్షితంగా భూమికి చేరుకుంటుంది. అనంతరం సెన్సార్ల సాయంతో ఆ శకలాల్ని సేకరించి తిరిగి మరో రాకెట్ వినియోగానికి వాడనున్నారు. 

RHUMI మిషన్ కి ఇస్రో శాటిలైట్ సెంటర్ (ISAC) మాజీ డైరెక్టర్ డాక్టర్ మైల్‌స్వామి అన్నాదురై మార్గదర్శకత్వంలో స్పేస్ జోన్ వ్యవస్థాపకుడు ఆనంద్ మేగలింగం నాయకత్వం వహిస్తున్నారు. స్పేస్ జోన్ ఇండియా అనేది చెన్నైలోని ఒక ఏరో-టెక్నాలజీ సంస్థ.