2024 టీ20 ప్రపంచ కప్ విశ్వ విజేతగా టీమిండియా అవతరించింది. శనివారం(జూన్ 29) బార్బడోస్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ సేన 7 పరుగుల స్వల్ప తేడాతో విజయం సాధించింది. టీమిండియాకు ఇది రెండో టీ20 ప్రపంచకప్ టైటిల్. గతంలో 2007లో ధోని సారథ్యంలో విశ్వ విజేతగా నిలిచారు.
ఈ మ్యాచ్ లో రోహిత్ సేన విజయం మిరాకిల్ అని చెప్పుకోవాలి. చివరి నాలుగు ఓవర్లలో సౌతాఫ్రికా విజయానికి 26 పరుగులు అవసరం కాగా.. భారత బౌలర్లు అద్భుతం చేశారు. 17వ ఓవర్ తొలి బంతికి హార్దిక్ పాండ్యా.. క్లాసెన్ ను అవుట్ చేసి భారత శిబిరంలో నమ్మకాన్ని నింపాడు. ఆ మరుసటి ఓవర్ లో బుమ్రా.. మార్కో జెన్ సెన్ ను ఔట్ చేయడమే కాకుండా.. కేవలం రెండు పరుగులు ఇచ్చాడు. ఇక 19వ ఓవర్ వేసిన అర్షదీప్ తన మార్క్ చూపించాడు. తీవ్ర ఒత్తిడిలోనూ శభాష్ అనిపించేలా బౌలింగ్ చేశాడు. కేవలం 4 పరుగులిచ్చాడు. ఇక ఆఖరి ఓవర్లో సఫారీ జట్టు విజయానికి 16 పరుగులు అవసరం కాగా.. పాండ్య మొదటి బంతికి మిల్లర్ ని ఔట్ చేసి దక్షిణాఫ్రికాను దెబ్బతీశాడు. చివరకు ప్రొటీస్ జట్టు నిర్ణీత ఓవర్లలో 169 పరుగులు చేసి.. విజయానికి 7 పరుగుల దూరంలో నిలిచిపోయింది.
ఆదుకున్న కోహ్లీ, అక్షర్
అంతకుముందు టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 176 పరుగులు చేసింది. పేలవ ఫామ్ తో సతమవుతున్న విరాట్ కోహ్లీ (76; 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక మ్యాచ్‌లో అదరగొట్టాడు. అక్షర్ పటేల్ (47; 31 బంతుల్లో 1 ఫోర్, 4 సిక్స్‌లు) దూకుడుగా ఆడాడు. 34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడిన భారత జట్టును కోహ్లీ, అక్షర్ పటేల్ ఆదుకున్నారు. నాలుగో వికెట్‌కు 72 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి ఇన్నింగ్స్‌ను చక్కదిద్దారు. చివర్లో శివమ్ దూబె (27; 16 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్) మెరుపులు మెరిపించాడు. దక్షిణాఫ్రికా బౌలర్లలో కేశవ్ మహరాజ్, నోకియా తలో 2 వికెట్లు పడగొట్టగా.. జాన్సెన్, రబాడా చెరో వికెట్ తీశారు.