విదేశాలకు తరలిపోతున్న భారత్​ గ్రంథ సంపద!

విదేశాలకు తరలిపోతున్న   భారత్​ గ్రంథ సంపద!

 గ్రంథాలయాలు,  తాళపత్ర  గ్రంథాలు,  దేవాలయాలు  వీటిలో ఉన్నటువంటి సారాన్ని సంగ్రహించి మన దేశ గ్రంథ సంపదను డిజిటలీరణ పేరుతో  విదేశాలకు తరలిస్తున్నారు.  ఒక దేశాన్ని నాశనం చేయాలంటే యుద్ధం చేయవలసిన అవసరం లేదు.  ఆ దేశ సంస్కృతీ  సంప్రదాయాలను,  జ్ఞానాన్ని  నాశనం చేస్తే  ఆ దేశం తనంత తానుగా కూలిపోతుంది.  

అమెరికాలోని  అత్యుత్తమ విశ్వవిద్యాలయాలలోని  గ్రంథాలయాలలో  ఏషియన్ స్టడీస్,  ఆఫ్రికన్ స్టడీస్,   సౌత్ అమెరికన్  స్టడీస్  వంటి విభాగాలు  పరిశీలిస్తే  బహుశా ఆ  ప్రాంతంలో జరిగిన పరిశోధన  లేదా దొరికిన పుస్తక  సంపద ఆయా ప్రాంతాలలో దొరుకుతాయో  లేదో చెప్పలేం.  కానీ,  ఈ  విశ్వవిద్యాలయంలో మాత్రం  (పుస్తక, ఎలక్ట్రానిక్ రూపేణా) కొలువుతీరి ఉన్నాయి. 

నేడు అమెరికా  అత్యుత్తమ ఆర్థిక శక్తిగా,  ఎదగడానికి ప్రధాన కారణం మిగతా దేశాల  సంస్కృతీ  సంప్రదాయాలను,  ఆచార వ్యవహారాలను  ఆ దేశాల బలాన్ని,  బలహీనతలు అంచనా వేయడమే.  సాంస్కృతిక మార్పులు,  వాణిజ్య సంబంధాలు, సామ్రాజ్యవాద దృష్టితో జరిగింది. భారతదేశం ప్రత్యేకంగా సాంస్కృతిక, భాషా, ఆధ్యాత్మిక  సంపదతో  ప్రసిద్ధి చెందింది. అయితే  భారతదేశానికి చెందిన అనేక మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  గ్రంథాలు,  పుస్తకాలు  ఇతర దేశాలకు  తరలించడం జరిగింది.  

17వ శతాబ్దం నుంచి 19వ శతాబ్దం మధ్య  బ్రిటిష్ వారు భారతదేశ పుస్తకాలు,  మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు,  కళాకృతులు,  ప్రాచీన శాసనాలు,  పత్రికలు, తదితరాలను తమ దేశాలకు తరలించుకుపోయారు. 19వ శతాబ్దంలో భారతదేశంలో ఉన్న  సాంస్కృతిక సంపదలు, శాస్త్రీయ గ్రంథాలను  విదేశీ పరిశోధకులు, విద్యావేత్తలు, మిషనరీలు ఇతర దేశాలకు తీసుకెళ్లారు. వీటిలో ముఖ్యంగా  సంస్కృత  పాఠ్యకృతులు,  రామాయణం,  మహాభారతం, ఉపనిషత్తులు, అగ్నిపురాణం,  కవిత్వం, అగ్ర పరిశోధనలు ఇతర దేశాల గ్రంథాలయాల్లో నిలిచాయి.  

ఆక్స్​ఫర్డ్​కు తరలింపు

 బ్రిటిష్ కాలంలో  సాహిత్యం, భాషా పరిశోధనలకు సంబంధించి భారతదేశంలోని ప్రాచీన గ్రంథాలు, సాహిత్య కృతులు యూరప్, ముఖ్యంగా బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, అమెరికా వంటి దేశాలకు తరలించడంతో ఈ సమయంలో  జరిగిన  అనేక  అనువాదాలు, పరిశోధనలు భారతదేశంలో ప్రాచీన సాహిత్యాన్ని కొత్తగా పరిచయం చేశాయి. సోలోమన్ లాంగ్స్ అనేక భారతీయ గ్రంథాలను, మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను తీసుకెళ్లాడు.  

ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీకి బ్రిటిష్ కాలంలో అనేక భారతీయ శాస్త్ర గ్రంథాలు, మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లు తీసుకెళ్లారు.  భారతదేశం నుంచి విదేశాలకు పుస్తకాలు, మాన్యుస్క్రిప్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లను  బ్రిటిష్  సామ్రాజ్యవాద కాలంలో  విదేశీ పరిశోధకులు, సైనికులు, వ్యాపారులు,  యూరోపియన్ సమాజాలు తీసుకెళ్లి తమ దేశాల్లో సంరక్షించారు.  ప్రపంచవ్యాప్తంగా ఉన్న మ్యూజియమ్స్ లో  అవి ప్రస్తుతం కోలువుతీరి ఉన్నాయి. 

బఖ్షాలి మాన్యుస్క్రిప్ట్:  7వ శతాబ్దం నాటిది. ఈ మాన్యుస్క్రిప్ట్ గణిత శాస్త్రంకు సంబంధించింది. పాదాల ద్వారా అంకెలను సూచించడంలో ప్రాచీన భారతదేశంలోని సాంకేతికతను చూపిస్తుంది. ఇది 1881లో బ్రిటిష్ పరిశోధకులు కనుగొన్న తరువాత లండన్  బ్రిటిష్  లైబ్రరీకి తరలించారు.  ప్రపంచంలో ‘1, 0’ సంఖ్యలను అంగీకరించే  మొదటి రిఫరెన్స్ గ్రంథం.

 ఋగ్వేద మాన్యుస్క్రిప్ట్: ప్రాచీన వేద కాలం నాటిది.  భారతదేశంలోని అత్యంత పురాతనమైన వేద గ్రంథం ఋగ్వేదం.  ఇది ధర్మ, విజ్ఞాన, పూజా విధానాలను వివరించడంతో పాటు సమాజం, ఆధ్యాత్మిక పరిపాలనను సమన్వయపరుస్తుంది. ఈ మాన్యుస్క్రిప్ట్​ను ఆక్స్​ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన బోడ్లీన్ లైబ్రరీకి తరలించారు. 

 మహాభారత  మాన్యుస్క్రిప్ట్ :  ఇది 16వ శతాబ్దం నాటిది.  మహాభారతం భారతీయ సాహిత్యంలోని అత్యంత ప్రసిద్ధ ఎపిక్,  ధర్మం, యుద్ధం తదితర అంశాలను వివరిస్తుంది. దీన్ని  లండన్  బ్రిటిష్  లైబ్రరీకి తరలించారు.
 టిబెట్టన్ బౌద్ధ  మాన్యుస్క్రిప్ట్ : ప్రాచీన టిబెట్టియన్ బౌద్ధ పాఠాలు. ఈ  మాన్యుస్క్రిప్ట్ లో  టిబెట్టియన్ బౌద్ధ ధర్మం, దానితో సంబంధిత విధానాలు ఉన్నాయి. వీటి ద్వారా బౌద్ధ విజ్ఞానం, దృష్టికోణాలు వివరించారు. 

మొఘల్ మినియేచర్ పెయింటింగ్స్ :16వ  శతాబ్దం కాలం నాటివి.  మొఘల్ సామ్రాజ్య కాలంలో విస్తృతంగా ఉత్పత్తి చేసిన  చిత్రకళలు, సామ్రాజ్యానికి సంబంధించిన దృశ్యాలు, వారసత్వపు అంశాలు ఉన్నాయి. ఈ చిత్రాల తరలింపు  బ్రిటిష్  లైబ్రరీకి, అలాగే ప్రపంచంలోని ఇతర  మ్యూజియంలకు తరలించడం  జరిగింది. 
అక్బర్నామా:16వ శతాబ్దం నాటిది.  మొఘల్ సామ్రాజ్యపు  చరిత్రకారుడు అబుల్ ఫజల్ రాసిన ఈ గ్రంథం, మొఘల్ సామ్రాజ్యాధిపతి అక్బర్  జీవితం, పాలనను వివరిస్తుంది. ఈ విలువైన మాన్యుస్క్రిప్ట్ కూడా బ్రిటిష్ లైబ్రరీకి తరలించారు. 

 బాబర్​నామా:  16వ శతాబ్దం నాటిది.  మొఘల్ చక్రవర్తి బాబర్ తన జీవితాన్ని, సామ్రాజ్యాన్ని ప్రస్తావిస్తూ రాసిన  స్వీయ చరిత్ర, ఇతని మానసిక స్థితి, యుద్ధం, ప్రజలతో గల సంబంధం గురించి వివరిస్తుంది. ఈ మాన్యుస్క్రిప్ట్ కూడా లండన్  బ్రిటిష్  లైబ్రరీకి తరలించడం జరిగింది.

మహమ్మద్​ ఘోరీ కాలంలో: మహ్మద్ ఘోరీ భారతదేశం నుంచి ఇస్లామిక్ దేశాలకు మరింత విజ్ఞానం అందించడానికి పుస్తకాలు, హస్తలిపి గ్రంథాలు తరలించాడు. 

డిజిటలీకరణ పేరిట తరలింపు

విద్య ఉమ్మడి జాబితాలో ఉన్నది.  దానికి అనుబంధ రంగమైన గ్రంథాలయాలలోని అపురూపమైన గ్రంథ సంపద అరబిక్, పారశీక, ఉర్దూ, ఇంగ్లీష్, హిందీ , సంస్కృతం, తెలుగు , తమిళం వంటి భాషల పుస్తకాలు తాళపత్ర గ్రంథాలు డిజిటలీకరణ పేరున దేశ సరిహద్దులు దాటుతున్నాయి.   

మన దేశంలో,  విదేశాలలో అనేక స్వచ్ఛంద సంస్థలు పురాతన, అపురూపమైన గ్రంథ సంపదను,  పుస్తకా లను,  చేతి రాత ప్రతులను ఉచితంగా డిజిటలైజ్ చేస్తామని చెబుతూ వాటిని సరిహద్దులు దాటించే  ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో  డిజిటలీకరణకు సంబంధించి సరి అయిన విధివిధానాలు ప్రభుత్వాలు  రూపొందించవలసిన అవసరం ఉన్నది. 

మనదేశంలో రాజా రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్, నేషనల్ మాన్యు స్క్రిప్ట్ మిషన్,  భారత జాతీయ గ్రంథాలయం వంటి అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం కలిగిన గ్రంథాలయాలు డిజిటలీకరణ చేసేందుకు సిద్ధంగా ఉన్నాయి.  ముఖ్యంగా ఈ అపురూపమైన గ్రంథాల ఆన్​లైన్​ అందుబాటును పరిశీలిస్తే  చైనా, జపాన్, అమెరికా దేశాల్లో  సెక్యూరిటీ  రిస్ట్రిక్షన్ లాగానే  మన ఇండిజీనియస్  సిస్టం అమలుపరిస్తే బాగుంటుంది.

- డా. రవి కుమార్ చేగోని,ప్రధాన కార్యదర్శి, తెలంగాణ గ్రంథాలయ సంఘం,హైదరాబాద్-