IND Vs NZ, 1st Test: కొత్త కుర్రాడు ధాటికి భారత్ విల విల.. 34 పరుగులకే 6 వికెట్లు

IND Vs NZ, 1st Test: కొత్త కుర్రాడు ధాటికి భారత్ విల విల.. 34 పరుగులకే 6 వికెట్లు

భారత్ లాంటి ఛాలెంజింగ్ గడ్డపై తొలిసారి అడుగుపెట్టిన న్యూజిలాండ్ యువ పేసర్ విలియం ఒరోర్కే టీమిండియా బ్యాటర్లను ఒక ఆట ఆడుకున్నాడు. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరుగుతున్న తొలి టెస్టులో తన పేస్ తో స్టార్ బ్యాటర్లను ఇబ్బంది పెట్టాడు. ఓ వైపు పరుగులని నియంత్రిస్తూనే మరోవైపు వికెట్లు పడగొడుతున్నాడు. దీంతో భారత బ్యాటర్లు పెవిలియన్ కు క్యూ కడుతున్నారు. అతనితో పాటు సీనియర్ ఫాస్ట్ బౌలర్లు సౌథీ, హెన్రీ రాణించడంతో రెండో రోజు లంచ్ సమయానికి భారత్ 6 వికెట్ల నష్టానికి 34 పరుగులు చేసి పీకల్లోతు కష్టాల్లో పడింది. 

10 పరుగులకే 3 వికెట్ల కోల్పోయిన భారత్ ను వికెట్ కీపర్ రిషబ్ పంత్, ఓపెనర్ యశస్వి జైశ్వాల్ ఆదుకునే ప్రయత్నం చేశారు. 10 ఓవర్ల పాటు కివీస్ పేస్ ను ధీటుగా ఎదర్కొన్నారు. క్రీజ్ లో ఇద్దరూ కుదురుకున్నారనుకున్న సమయంలో స్వల్ప వ్యవధిలో మూడు కీలక వికెట్లను కోల్పోయింది. జైశ్వాల్ (13) ఒరోర్కే బౌలింగ్ లో కట్ చేయబోయి పాయింట్ లో క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు. రాహుల్ వికెట్ కీపర్ బ్లండర్ కు క్యాచ్ ఇచ్చి డకౌట్ గా వెనుదిరిగాడు. ఆడుకుంటాడనుకున్న జడేజా (0) హెన్రీ బౌలింగ్ లో గాల్లోకి క్యాచ్ లేపి పెవిలియన్ బాట పట్టాడు. 

ఒకదశలో 3 వికెట్లకు 31 పరుగులతో ఉన్న భారత్ ఒక్కసారిగా 6 వికెట్లకు 34 పరుగులతో ఊహించని కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లకు తలవంచారు. అంతకముందు సౌథీ అద్భుతమైన బంతితో రోహిత్ (2) ను బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత ఓవర్లో ఒరోర్కే కోహ్లీని డకౌట్ చేయగా.. సర్ఫరాజ్ కూడా హెన్రీ బౌలింగ్ లో డకౌట్ గా వెనుదిరిగాడు. దీంతో 9/0 గా భారత్ ఒక్కసారిగా 10/3 వికెట్లతో కష్టాల్లో పడింది. కివీస్ బౌలర్లలో విలియం ఒరోర్కే  మూడు వికెట్లు పడగొట్టాడు. హెన్రీ 2 వికెట్లు తీసుకున్నాడు. సౌదీకి ఒక వికెట్ దక్కింది.