- 13 రన్స్ తేడాతో జింబాబ్వే గెలుపు
- బిష్ణోయ్,సుందర్ శ్రమ వృథా
- నేడు రెండో టీ20 మ్యాచ్
హరారే: సీనియర్ల రిటైర్మెంట్ తర్వాత బరిలోకి దిగిన కొత్త తరం టీమిండియా తొలి టీ20 మ్యాచ్‌లోనే బోల్తా కొట్టింది. చిన్న టార్గెట్ ఛేజింగ్‌లో బ్యాటర్లు ఘోరంగా ఫెయిల్ కావడంతో.. శనివారం జింబాబ్వేతో జరిగిన తొలి పోరులో 13 రన్స్ తేడాతో ఓడింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో జింబాబ్వే 1–0 లీడ్‌లో నిలిచింది. టాస్ ఓడిన జింబాబ్వే 20 ఓవర్లలో 115/9 స్కోరు చేసింది. క్లైవ్ మదాండె (29) టాప్ స్కోరర్. తర్వాత ఇండియా 19.5 ఓవర్లలో 102 రన్స్‌కే కుప్పకూలింది. కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (31), వాషింగ్టన్ సుందర్ (27) పోరాడి విఫలమయ్యారు. రజాకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
బిష్ణోయ్, సుందర్ కట్టడి..
జింబాబ్వేను స్పిన్నర్లు రవి బిష్ణోయ్ (4/13), సుందర్ (2/11) బాగా కట్టడి చేశారు. 6 రన్స్‌కే ఇన్నోసెంట్ కాయ్ (0) డకౌటైనా.. ఓపెనర్ మదెవెరె (21), బెన్నెట్ (23) నిలకడగా ఆడారు. ఈ ఇద్దరు రెండో వికెట్‌కు 34 రన్స్ జత చేశారు. అయితే ఆరో ఓవర్‌లో బౌలింగ్‌కు దిగిన బిష్ణోయ్ గూగ్లీతో బెన్నెట్‌ను ఔట్ చేశాడు. పవర్‌ప్లేలో40/2 స్కోరు చేసిన జింబాబ్వే 8వ ఓవర్‌లో మదెవెరె వికెట్‌ను కోల్పోయింది.
ఈ దశలో సికందర్ రజా (17), డియాన్ మేయర్స్ (23) గట్టెక్కించే బాధ్యత తీసుకున్నారు. ఈ ఇద్దరు నిలకడగా ఆడటంతో ఓ దశలో 74/3 స్కోరుతో ముందుకు సాగింది. కానీ 11వ ఓవర్‌లో అవేశ్ ఖాన్ (1/29) డబుల్ స్ట్రోక్ ఇచ్చాడు. ఐదో బాల్‌కు రజా వికెట్ తీస్తే తర్వాతి బాల్‌కు క్యాంప్‌బెల్ (0) రనౌటయ్యాడు. దీంతో స్కోరు 74/5గా మారింది. ఈ టైమ్‌లో మదాండె ఒంటరిపోరాటం చేశాడు. 15వ ఓవర్‌లో సుందర్ వరుస బాల్స్‌లో మేయర్స్, మసకద్జా (0)ను పెవిలియన్‌కు పంపాడు. ఫలితంగా టీ20ల్లో 100 వికెట్ల క్లబ్‌లో చేరాడు. 16వ ఓవర్‌లో బిష్ణోయ్ నాలుగు బాల్స్ తేడాలో ల్యూక్ జోంగ్వి (1), ముజురబాని (0)ని ఔట్ చేశాడు. చివరి వరకు నిలబడ్డ మదాండె, చటారా (0 నాటౌట్)తో కలిసి స్కోరు వంద దాటించాడు.
బౌలర్లు అదుర్స్..
చిన్న టార్గెట్‌ను జింబాబ్వే బౌలర్లు అద్భుతంగా కాపాడుకున్నారు. ఇన్నింగ్స్ నాలుగో బాల్‌కే అభిషేక్ శర్మ (0) డకౌట్‌తో మొదలైన వికెట్ల పతనం వేగంగా సాగింది. మధ్యలో గిల్, అవేశ్ ఖాన్ (16) సుందర్ కాసేపు బ్యాట్లు అడ్డేసినా రెండో ఎండ్‌లో ఒక్కరు కూడా సహకరించలేదు. రుతురాజ్ (7), రియాన్ పరాగ్ (2), రింకూ సింగ్ (0), ధ్రువ్ జురెల్ (6), రవి బిష్ణోయ్ (9), ముకేశ్ కుమార్ (0), ఖలీల్ అహ్మద్ (0 నాటౌట్) సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫలితంగా 28/4తో పవర్‌ప్లేను ముగించిన ఇండియా 84/8, 86/9తో కష్టాల్లో పడింది. సుందర్.. ఆవేశ్‌తో 8వ వికెట్‌కు 23 రన్స్ జోడించి ఆశలు రేకెత్తించినా గెలిపించలేకపోయాడు.
సంక్షిప్త స్కోర్లు
జింబాబ్వే: 20 ఓవర్లలో 115/9 (మదాండె 29*, మేయర్స్ 23, బిష్ణోయ్ 4/13).
ఇండియా: 19.5 ఓవర్లలో 102 ఆలౌట్ (గిల్ 31, సుందర్ 27, చటారా 3/16, రజా 3/25).