కొలంబో: ఇండియాతో టీ20 సిరీస్ ఓటమికి శ్రీలంక ప్రతీకారం తీర్చుకుంది. బౌలింగ్‌లో దునిత్ వెల్లలాగే (5/27), మహేశ్ తీక్షణ (2/45), జెఫ్రీ వాండర్సే (2/34) చెలరేగడంతో.. బుధవారం జరిగిన ఆఖరిదైన మూడో వన్డేలోనూ లంకేయులు 110 రన్స్ తేడాతో టీమిండియాను చిత్తు చేశారు. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2–0తో సొంతం చేసుకున్నారు. ఫలితంగా 27 ఏళ్ల తర్వాత లంక చేతిలో సిరీస్ కోల్పోయిన చెత్త రికార్డును ఇండియా మూటగట్టుకుంది.
టాస్ గెలిచిన లంక 50 ఓవర్లలో 248/7 స్కోరు చేసింది. అవిష్క ఫెర్నాండో (96) తృటిలో సెంచరీ మిస్ చేసుకున్నా రెండు కీలక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. పాథుమ్ నిశాంక (45)తో తొలి వికెట్‌కు 89, కుశాల్ మెండిస్ (59)తో రెండో వికెట్‌కు 82 రన్స్ జత చేశాడు. చివర్లో కమిందు మెండిస్ (23)తో కుశాల్ ఏడో వికెట్‌కు 36 రన్స్ జోడించాడు. అరంగేట్రం ప్లేయర్ రియాన్ పరాగ్ (3/54) ఆఫ్ బ్రేక్‌తో లంక ఇన్నింగ్స్‌ను నిలువరించే ప్రయత్నం చేశాడు.
తర్వాత ఇండియా 26.1 ఓవర్లలోనే 138 రన్స్‌కే కుప్పకూలింది. రోహిత్ (30) టాప్ స్కోరర్. సుందర్ (30), కోహ్లీ (20) పోరాడి విఫలమయ్యారు. గిల్ (6), రోహిత్ తొలి వికెట్‌కు 37 రన్స్ జత చేయగా, చివర్లో సుందర్, కుల్దీప్ (6) 9వ వికెట్‌కు 37 రన్స్ జోడించినా ప్రయోజనం దక్కలేదు. ఇన్నింగ్స్‌లో ఏడుగురు సింగిల్ డిజిట్‌కే పరిమితమయ్యారు. ఫెర్నాండోకు ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’, దునిత్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించాయి.