కివీస్ చేతిలో భారత్ ఓటమి

క్వీన్స్లాండ్: న్యూజిలాండ్  పర్యటనలో ఉన్న భారత మహిళల టీమ్ కు మరో ఓటమి ఎదురైంది. ప్రతిష్టాత్మక వన్డే వరల్డ్ కప్ కోసం సిద్ధమవుతున్న మిథాలీ సేనకు న్యూజిలాండ్ తో వన్డే సిరీస్ కీలకంగా మారింది. కానీ ఈ సిరీస్ ను ఓటమితో ప్రారంభించింది టీమిండియా. కివీస్ విసిరిన 276 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో టీమిండియా బ్యాటర్లు విఫలమయ్యారు. కెప్టెన్ మిథాలీ రాజ్ (59), యస్తికా భాటియా (41)ను మినహాయిస్తే మిగతా బ్యాటర్లు ఫెయిల్ అవ్వడంతో భారత్ 213 పరుగులకే ఆలౌట్ అయ్యింది. దీంతో 62 రన్స్ తేడాతో ఓటమి తప్పలేదు. కివీస్ బౌలర్లలో జెస్ కేర్, హేలే జెన్సెస్ తలో రెండు వికెట్లతో భారత పతనాన్ని శాసించారు. 

కాగా, మొదట బ్యాటింగ్ చేసిన  న్యూజిలాండ్.. స్టార్ ప్లేయర్ సుజీ బేట్స్ (106) శతకంతో భారీ స్కోరు చేసింది. పది బౌండరీలు బాదిన సుజీ.. ధనాధన్ షాట్లతో భారత బౌలర్లపై విరుచుకుపడింది. ఈమెకు తోడుగా అమీ సాట్టర్త్ వైట్ (63), అమిలియా కేర్ (33) కూడా బాధ్యతాయుతంగా ఆడటంతో కివీస్ 275 రన్స్ చేసింది. ముఖ్యంగా సాట్టర్త్ వైట్ మధ్య ఓవర్లలో రన్ రేట్ పడిపోకుండా కీలకపాత్ర పోషించింది. ఇక, భారత బౌలర్లలో సీనియర్ పేసర్ జులన్ గోస్వామి, పూజా వస్త్రాకర్, రాజేశ్వరి గైక్వాడ్, దీప్తి శర్మ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. కానీ పరుగులను కట్టడి చేయడంలో విఫలమయ్యారు. ముఖ్యంగా జులన్, పూజా, పూనమ్ యాదవ్ బౌలింగ్ లో కివీస్ బ్యాటర్లు పరుగులు బాగా  పిండుకున్నారు. 

మరిన్ని వార్తల కోసం:

కేసీఆర్ నశం పెడితే మేం జండూబామ్ పెడతాం

ఎవరు మీలో కోటీశ్వరులు.. ఐపీఎల్ వేలానికి వేళాయెరా!